నేడు శివసేనతో భేటీ | Congress-NCP combine prepares contours of forging alliance with Shiv Sena | Sakshi
Sakshi News home page

నేడు శివసేనతో భేటీ

Published Fri, Nov 22 2019 3:51 AM | Last Updated on Fri, Nov 22 2019 3:51 AM

Congress-NCP combine prepares contours of forging alliance with Shiv Sena - Sakshi

ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న శరద్‌పవార్, అహ్మద్‌ పటేల్‌ తదితరులు

న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధమయ్యాయి. శివసేనతో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు గురువారం విజయవంతంగా ముగిశాయి. ఈ చర్చల్లో అన్ని అంశాల్లో ‘పూర్తి ఏకాభిప్రాయం’ సాధించినట్లు చర్చల అనంతరం రెండు పార్టీలు ప్రకటించాయి.  కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, పొత్తుకు తుదిరూపమిచ్చేందుకు శుక్రవారం శివసేనతో భేటీకానున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసిన సమాజ్‌వాదీ, సీపీఎం, స్వాభిమాని ప„Š , పీజంట్స్‌ వర్కర్స్‌ పార్టీలతో శుక్రవారం చర్చించి, ఆ తరువాత శివసేనతో కూటమి కూర్పుపై, కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌– సీఎంపీ)పై యోచిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ముంబైలో అధికారికంగా తుది ప్రకటన ఉంటుందన్నాయి. ఆ తర్వాత మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీకి లేఖ ఇస్తాయి. నవంబర్‌ 26న ప్రమాణ స్వీకారం ఉండొచ్చని శివసేన వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటములు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన విషయం తెలిసిందే.  

ఉద్ధవ్‌నా? ఆదిత్యనా?
శివసేన తరఫున ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సేన యువనేత, పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేకు ఆ స్థానం అప్పగించే ఆలోచన ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. కానీ, ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం కావాలని ఎన్సీపీ, కాంగ్రెస్‌ పట్టుబడుతున్నాయని, తొలిసారి ఎమ్మెల్యే అయిన, రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆదిత్యకు పెద్ద బాధ్యత అప్పగించడం సరికాదని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, సీఎంగా ఉద్ధవ్, ఆదిత్య కాకుండా.. శివసేన సీనియర్‌నేతలు సంజయ్‌ రౌత్, ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ దేశాయిల పేర్లూ శివసేన వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, ఠాక్రేలు కాకుండా, వేరే ఎవరు సీఎం అయినా, పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది.  

సీడబ్ల్యూసీ ఆమోదం
ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ నివాసంలో గురువారం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగాయి. ‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపాం. రెండు పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది’ అని చర్చల అనంతరం కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ప్రకటించారు. సీఎంపీ ప్రకటన సందర్భంగా కొత్త ప్రభుత్వ వివరాలను వెల్లడిస్తామన్నారు. సీఎం పదవిని పంచుకోవడంపై వస్తున్న వార్తలను మీడియా ప్రస్తావించగా.. ‘అవన్నీ ఊహాగానాలే’ అని కొట్టివేశారు. ఎన్సీపీతో చర్చల వివరాలను కాంగ్రెస్‌ పార్టీలోని అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీకి నేతలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన భేటీలో శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

సోనియా, ఉద్ధవ్‌ భేటీ ఉండదు
సోనియాగాంధీతో ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమయ్యే అవకాశాలు లేవని సేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ‘ఒకటి, రెండు రోజుల్లో మూడు (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయి.  ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని గురువారం మీడియాతో చెప్పారు.

పవార్, ఠాక్రే భేటీ
ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో గురువారం రాత్రి శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సమావేశమయ్యారు. దక్షిణ ముంబైలోని శరద్‌ పవార్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే, వారు ఏం చర్చించారనే విషయం వెల్లడి కాలేదు.

ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ‘డిప్యూటీ’
ప్రభుత్వ కూర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ముంబైలో మరికొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేన నేతనే ఉంటారని, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్‌ పదవి కాంగ్రెస్‌కేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ తరఫున బాలాసాహెబ్‌ తోరట్‌ ఉంటారని తెలుస్తోంది. పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రిపదవులు లభించనున్నాయనే వార్తలొచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement