సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయానికి ముఖ్యకారణాల్లో ఒకటి పార్టీలో దిగువస్థాయి నుంచి పైస్థాయి వరకు విస్తరించిన అవినీతి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంక్షేమ పథకమైన లబ్ధిదారులకు చెందాలన్నా స్థానిక పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ నాయకుల చేతులు తడపడాల్సిందే. దీన్ని స్థానికంగా ముద్దుగా ‘కట్ మనీ’ అని కూడా పిలుచుకుంటున్నారు. పిలుస్తున్నారు. పార్టీలో అవినీతి ఇంతగా విస్తరించిన విషయాన్ని స్వయంగా గ్రహించిన మమతా బెనర్జీ గత వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీలో ఎవరు అవినీతికి పాల్పడిన ఉపేక్షించేది లేదని, వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
అంతేకాకుండా ఇప్పటి వరకు అలా అవినీతికి పాల్పడిన వారు ఆ డబ్బును తిరిగి చెల్లించాలంటూ కూడా మమతా బెనర్జీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఆమె అంతకుముందు జాన్ 10 తేదీన రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఓ ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్టీలో దిగువస్థాయి నుంచి ‘కట్ మనీ’పై స్థాయి వరకు ఓ చైన్‌లా చేరుకుందని, తీసుకున్న సొమ్ము పైస్థాయి నుంచి కిందకు వెళ్లినప్పుడే కిందిస్థాయి పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఆ సొమ్మును తిరిగి ప్రజలకు అందజేస్తారని, అందుకని ముందుగా స్పందించాల్సింది పైస్థాయి నాయకులని తృణమూల్ ఎంపీ శతాబ్ది రాయ్ వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ పిలుపునకు, శతాబ్ది రాయ్ వ్యాఖ్యలు పార్టీ నాయకులు ఎంతవరకు స్పందిస్తున్నారో తెలియదుగానీ ఈ ‘కట్ మనీ’ అవినీతికి వ్యతిరేకంగా ఓ బెంగాలీ గాయకుడు నాచికేత చక్రవర్తి పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ముడుపులు తీసుకున్న దాదాలు, దీదీలు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సిన రోజు వచ్చింది. ఆ మేరకు పిలుపు వచ్చింది. మంత్రయినా, అధికారయినా ప్రజాగ్రహాన్ని చవిచూడక ముందే స్పందించాలి. అవిగో రుద్రవీణ ధ్వనులు’ అంటూ బెంగాలీ భాషలో ఆ పాట హృద్యంగా కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment