Nachiketa
-
Children's Day 2021 Special: యముడిని మెప్పించిన నచికేతుడు.. కథ!
నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు. బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు. వాజశ్రవుడు గౌతముడి వంశానికి చెందినవాడు. అతడికి ఉద్ధాలకుడనే పేరు కూడా ఉండేది. ఒకసారి అతడు ‘విశ్వజిత్’ అనే యాగాన్ని తలపెట్టాడు. పురోహితులను, వేదపండితులను ఆహ్వానించి దిగ్విజయవంతంగా యాగాన్ని పూర్తి చేశాడు. యాగం నిర్వహించినవాడు తన సర్వ సంపదలనూ దానం చేయాలనేదే ‘విశ్వజిత్’ యాగ నియమం. వాజశ్రవుడు తన గొడ్లపాకలోని ముసలి గోవులను పురోహితులకు దానం చేయసాగాడు. వాజశ్రవుడి కొడుకు నచికేతుడు బాలకుడు. తండ్రి చేస్తున్న తతంగాన్నంతా అతడు గమనించసాగాడు. ఎలాగైనా తండ్రికి జ్ఞానం కలిగించాలనుకున్నాడు. మెల్లగా తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. ‘నాన్నా! నేనూ నీ సంపదనేగా! మరి నన్నెవరికి దానమిస్తావు?’ అని అడిగాడు. కొడుకు ప్రశ్నను పిల్లచేష్టగా భావించి, వాజశ్రవుడు పట్టించుకోలేదు. నచికేతుడు పట్టువీడలేదు. తండ్రి దాన ధర్మాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు చీటికి మాటికి అడ్డు తగులుతూ ‘నాన్నా! నన్నెవరికి దానమిస్తావు?’ అని పదే పదే అడగసాగాడు. వాజశ్రవుడికి సహనం నశించి, కొడుకు మీద పట్టరాని కోపం వచ్చింది. ‘నిన్ను యముడికి దానం చేస్తాను! ఫో!’ అని కసురుకున్నాడు. యజ్ఞ తతంగం అంతా ముగిశాక, వాజశ్రవుడికి కాస్త ఊపిరిపీల్చుకునే తీరిక చిక్కింది. ఏదో కోపంలో కొడుకుతో అనేసిన మాటలు గుర్తొచ్చి, బాధపడ్డాడు. ఇంతలో నచికేతుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. ‘నాన్నా! ఆడినమాట నిలుపుకోకుంటే అసత్య దోషం చుట్టుకుంటుంది. అందువల్ల ఏమీ బాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపు’ అన్నాడు. వాజశ్రవుడు బదులివ్వలేదు. తండ్రి మాట ప్రకారం నచికేతుడు యముడి వద్దకు బయలుదేరాడు. యముడి కోసం వెదుక్కుంటూ నచికేతుడు నరకలోకానికి చేరుకున్నాడు. నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు. బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు. ‘ఎవరో బాలకుడు మీకోసం వచ్చి, మూడురోజులుగా అన్నపానీయాల్లేకుండా మన నరకద్వారం వద్దే నిరాహారంగా ఎదురుచూస్తున్నాడు’ అని యమభటులు చెప్పారు. ‘అతిథిలా వచ్చిన బాలకుడిని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేశాను’ అనుకుని యముడు బాధపడ్డాడు. వెంటనే నచికేతుని వద్దకు చేరుకున్నాడు. ‘మూడురోజులు నిన్ను నిరాహారంగా ఉంచి పాపం చేశాను. అందుకు పరిహారంగా నీకు మూడు వరాలిస్తాను. కోరుకో!’ అన్నాడు. సరేనన్నాడు నచికేతుడు. ‘నేను తిరిగి ఇంటికి చేరుకునే సరికి, నన్ను మా నాన్న నవ్వుతూ స్వాగతించాలి, అతడి పాపాలన్నీ తొలగిపోవాలి. ఇది నా మొదటి వరం’ అన్నాడు నచికేతుడు. ‘తథాస్తు’ అన్నాడు యముడు. ‘స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞక్రతువు పద్ధతిని నేర్పించాలి. ఇది నా రెండో వరం’ అడిగాడు నచికేతుడు. సంతోషంగా ‘సరేన’న్నాడు యముడు. యజ్ఞక్రతువును నేర్పించి, అప్పటి నుంచి ఆ యజ్ఞానికి నచికేతుడి పేరు మీద ‘నాచికేత యజ్ఞం’ అనే పేరు వస్తుందని కూడా ఆశీర్వదించాడు. ‘మరణానంతర జీవితాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని నాకు వివరించాలి. ఇది నా మూడోవరం’ అన్నాడు నచికేతుడు. బాలకుడి మూడోవరానికి యముడు అవాక్కయ్యాడు. దాని బదులు ధన కనక వస్తువాహనాలింకేవైనా కోరుకోమన్నాడు. నచికేతుడు యముడి ప్రతిపాదనకు ‘ససేమిరా’ అన్నాడు. తనకు ఎలాగైనా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాల్సిందేనని పట్టుబట్టాడు. బాలకుడైన నచికేతుడి పట్టుదలకు ముచ్చటపడ్డాడు యముడు. ఎట్టకేలకు అతడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. మరణానంతర జీవన రహస్యాలను వివరించి, సాదరంగా సాగనంపాడు. బ్రహ్మజ్ఞానం పొందిన నచికేతుడు ఇంటికి చేరుకోగా, అతడి తండ్రి సంతోషంగా అతణ్ణి స్వాగతించాడు. – కఠోపనిషత్తులోని కథ -
‘కట్ మనీ’పై వైరల్ అవుతున్న పాట
-
‘కట్ మనీ’పై వైరల్ అవుతున్న పాట
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయానికి ముఖ్యకారణాల్లో ఒకటి పార్టీలో దిగువస్థాయి నుంచి పైస్థాయి వరకు విస్తరించిన అవినీతి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంక్షేమ పథకమైన లబ్ధిదారులకు చెందాలన్నా స్థానిక పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ నాయకుల చేతులు తడపడాల్సిందే. దీన్ని స్థానికంగా ముద్దుగా ‘కట్ మనీ’ అని కూడా పిలుచుకుంటున్నారు. పిలుస్తున్నారు. పార్టీలో అవినీతి ఇంతగా విస్తరించిన విషయాన్ని స్వయంగా గ్రహించిన మమతా బెనర్జీ గత వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీలో ఎవరు అవినీతికి పాల్పడిన ఉపేక్షించేది లేదని, వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అలా అవినీతికి పాల్పడిన వారు ఆ డబ్బును తిరిగి చెల్లించాలంటూ కూడా మమతా బెనర్జీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఆమె అంతకుముందు జాన్ 10 తేదీన రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఓ ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్టీలో దిగువస్థాయి నుంచి ‘కట్ మనీ’పై స్థాయి వరకు ఓ చైన్‌లా చేరుకుందని, తీసుకున్న సొమ్ము పైస్థాయి నుంచి కిందకు వెళ్లినప్పుడే కిందిస్థాయి పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఆ సొమ్మును తిరిగి ప్రజలకు అందజేస్తారని, అందుకని ముందుగా స్పందించాల్సింది పైస్థాయి నాయకులని తృణమూల్ ఎంపీ శతాబ్ది రాయ్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ పిలుపునకు, శతాబ్ది రాయ్ వ్యాఖ్యలు పార్టీ నాయకులు ఎంతవరకు స్పందిస్తున్నారో తెలియదుగానీ ఈ ‘కట్ మనీ’ అవినీతికి వ్యతిరేకంగా ఓ బెంగాలీ గాయకుడు నాచికేత చక్రవర్తి పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ముడుపులు తీసుకున్న దాదాలు, దీదీలు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సిన రోజు వచ్చింది. ఆ మేరకు పిలుపు వచ్చింది. మంత్రయినా, అధికారయినా ప్రజాగ్రహాన్ని చవిచూడక ముందే స్పందించాలి. అవిగో రుద్రవీణ ధ్వనులు’ అంటూ బెంగాలీ భాషలో ఆ పాట హృద్యంగా కొనసాగుతుంది. -
అభినందన్ మానసిక స్థితిని ఊహించగలను : నచికేత
న్యూఢిల్లీ : ఓ గంట క్రితం వరకూ కూడా ప్రతి భారతీయుడి మదిలో ఒకటే ప్రశ్న.. వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ పరిస్థితి ఏంటి.. ఎప్పుడు విడుదల చేస్తారు.. అసలు వదిలేస్తారా.. లేదా అనే అనుమానాలు. వాటన్నింటికి సమాధానం దొరికింది. రేపు అభినందన్‌ను విడుదల చేస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధ ఖైదీగా పట్టుబడ్డప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఆ సమయంలో సదరు వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందో వివరించారు కార్గిల్ వార్ హీరో కే నచికేత. అభినందన్ విడుదల ప్రకటన కంటే ముందు మీడియాతో మాట్లాడారు నచికేత. ఈ సందర్భంగా నచికేత, వింగ్ కమాండర్ అభినందన్‌ను ప్రశంసించారు. యుద్ధ ఖైదీగా ఆయన చూపిన స్థైర్యాన్ని కొనియాడారు. అంతేకాక ‘అభినందన్ ఒక సాహసోపేత పైలెట్ మాత్రమే కాక వృత్తిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. రక్షణ రంగంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే.. స్త్రీ, పురుష బేధం లేకుండా హై కమాండ్ ఆదేశాల మేరకు వారి, వారి విధులను అత్యుత్తమంగా నిర్వహించాల్సి ఉంటుంది. ట్రైనింగ్‌లో కూడా ఇదే అంశాన్ని బోధిస్తారు. విపత్కర పరిస్థితుల్లో నిగ్రహం కోల్పోకుండా ఉండటం గురించి కూడా ట్రైన్ చేస్తారు.. అందుకే యుద్ధ ఖైదీగా పట్టుబడిన వ్యక్తి ఎంతటి హింసనయిన భరిస్తాడు కానీ దేశానికి, సైన్యానికి సంబంధించిన రహస్యాలను మాత్రం చెప్పడ’ని తెలిపారు. అంతేకాక ‘అభినందన్ క్షేమంగా ఇంటికి వస్తాడని నా నమ్మకం. ఇలాంటి కష్ట కాలంలో మనమందరం అతని కుటుంబానికి అండగా నిలవాలి. కానీ దురదృష్టావశాత్తు మీడియా ఈ విషయంలో సరిగా వ్యవహరించలేదు. అత్యుత్సాహంతో అభినందన్ యుద్ధ ఖైదీగా పట్టుబడిన వీడియోలను పదే పదే ప్రచారం చేస్తూ ఆ కుటుంబాన్ని మరింత బాధపెట్టింది. ఏది ఏమైనా అభినందన్ క్షేమంగా వస్తాడు. రావాలని నేను కోరుకుంటున్నాను’ అని తెలిపారు. అయితే నచికేత మాట్లాడిన కాసేపటికే అభినందన్‌ను రేపు విడుదల చేస్తామంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. (చదవండి : కార్గిల్ వార్‌లో పాక్‌కి చిక్కిన పైలట్.. తర్వాత?) -
కార్గిల్ వార్‌లో పాక్‌కి చిక్కిన పైలట్.. తర్వాత?
పాకిస్తాన్‌కు చిక్కిన పైలట్ విక్రమ్ అభినందన్ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ప్రతీ భారతీయుడు మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి సంఘటనే సరిగ్గా 20 ఏళ్ల కిందట ఎదురైంది.1999లో కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దు గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ 27 యుద్ధ విమానం గస్తీ కాసింది. ఆ యుద్ధ విమానంకు పైలట్‌గా వ్యవహరించారు లెఫ్టినెంట్ కే నచికేత. కానీ, కొన్ని సాంకేతిక లోపాలతో ఆ యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలిపోయింది. ప్యారచూట్తో దిగిన నచికేతను పాక్ ఆర్మీ యుద్ధ ఖైదీగా పట్టుకుంది. ఆ తర్వాత భారత ఆర్మీ రహస్యాలు చెప్పమని పాక్ సైనికులు నచికేతను చిత్ర హింసలకు గురిచేశారు. పాక్ ఉన్నతాధికారి ఒకరు చిత్రహింసలను ఆపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సైన్యం నచికేతపై దాడులు ఆపింది. అసలు మరుసటి రోజు చూస్తానో లేదో అన్నట్లుగా వారు హింసించారని నచికేత చెప్పారు. అయితే పాక్ ఉన్నతాధికారి యుద్ధ ఖైదీని విచారణ చేసే పద్ధతి ఇదికాదని చెప్పడంతో వారంతా వెనక్కు తగ్గారని వెల్లడించారు. నాడు భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం నుంచి పాక్ పై త్రీవ ఒత్తిడి రావడంతో ఎనిమిది రోజుల తర్వాత నచికేతను పాక్ వదిలిపెట్టింది. నాడు యుద్దం జరుగుతున్న సమయంలో తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించడం, ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా భారత రహస్యాలు చెప్పకపోవడంతో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, ప్రధాని వాజ్‌పేయిలు అతన్ని హీరోగా కొనియాడారు. నాటి ప్రభుత్వం ఆయన్ను వాయుసేన పథకంతో గౌరవించింది. నచికేతను విడిపించేందుకు ఇస్లామాబాద్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న పార్థసారథి ఎంతగానో కృషి చేశారు. ఆ సమయంలో విదేశీవ్యవహారాల కార్యాలయంలో నచికేతన్ను ఉంచుతామని, తీసుకెళ్లాల్సిందిగా తనకు ఓ ఫోన్‌కాల్ వచ్చిందని పార్థసారథి చెప్పారు. నచికేతను దయ తలచి వదిలేస్తున్నామంటూ పాక్ చెప్పడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని అందుకే తాను అక్కడికి రానని తేల్చి చెప్పినట్లు పార్థసారథి వివరించారు. జెనీవా కన్వెషన్ ప్రకారం పాకిస్తాన్ భారత అధికారులకు అప్పగించాల్సి ఉందని చెప్పారు. యుద్ధ సమయంలో దేశాలు ఎలా వ్యవహరించాలో అంతర్జాతీయ న్యాయసూత్రాలు జెనీవా కన్వెన్షన్‌లో పొందుపర్చారు. ఇక నచికేతను అదే రోజు సాయంత్రం జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ అధికారులు తనకు అప్పగించారని గుర్తుచేసుకున్నారు. అక్కడి నుంచి తాము వాఘా సరిహద్దు గుండా భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు. అయితే భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు ప్యారచూట్ సహాయంతో కిందకు దూకిన అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పాక్ వెల్లడించింది. అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు చెబుతున్న పాక్, జెనీవా కన్వెన్షన్ ప్రకారం అభినవ్‌ను వదిలేస్తుందా? భారత్ ఎలాంటి వ్యూహంతో అదృశ్యమైన పైలట్‌ను తిరిగి తీసుకొస్తుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే.