![Story of Nachiketa And Yama In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/14/555.jpg.webp?itok=l7o0RXHz)
నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు.
ఏదో పని మీద బయటకు వెళ్లాడు.
యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు.
బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు.
వాజశ్రవుడు గౌతముడి వంశానికి చెందినవాడు. అతడికి ఉద్ధాలకుడనే పేరు కూడా ఉండేది.
ఒకసారి అతడు ‘విశ్వజిత్’ అనే యాగాన్ని తలపెట్టాడు.
పురోహితులను, వేదపండితులను ఆహ్వానించి దిగ్విజయవంతంగా యాగాన్ని పూర్తి చేశాడు.
యాగం నిర్వహించినవాడు తన సర్వ సంపదలనూ దానం చేయాలనేదే ‘విశ్వజిత్’ యాగ నియమం.
వాజశ్రవుడు తన గొడ్లపాకలోని ముసలి గోవులను పురోహితులకు దానం చేయసాగాడు.
వాజశ్రవుడి కొడుకు నచికేతుడు బాలకుడు. తండ్రి చేస్తున్న తతంగాన్నంతా అతడు గమనించసాగాడు. ఎలాగైనా తండ్రికి జ్ఞానం కలిగించాలనుకున్నాడు. మెల్లగా తండ్రి దగ్గరకు చేరుకున్నాడు.
‘నాన్నా! నేనూ నీ సంపదనేగా! మరి నన్నెవరికి దానమిస్తావు?’ అని అడిగాడు.
కొడుకు ప్రశ్నను పిల్లచేష్టగా భావించి, వాజశ్రవుడు పట్టించుకోలేదు.
నచికేతుడు పట్టువీడలేదు. తండ్రి దాన ధర్మాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు చీటికి మాటికి అడ్డు తగులుతూ ‘నాన్నా! నన్నెవరికి దానమిస్తావు?’ అని పదే పదే అడగసాగాడు.
వాజశ్రవుడికి సహనం నశించి, కొడుకు మీద పట్టరాని కోపం వచ్చింది.
‘నిన్ను యముడికి దానం చేస్తాను! ఫో!’ అని కసురుకున్నాడు.
యజ్ఞ తతంగం అంతా ముగిశాక, వాజశ్రవుడికి కాస్త ఊపిరిపీల్చుకునే తీరిక చిక్కింది. ఏదో కోపంలో కొడుకుతో అనేసిన మాటలు గుర్తొచ్చి, బాధపడ్డాడు.
ఇంతలో నచికేతుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. ‘నాన్నా! ఆడినమాట నిలుపుకోకుంటే అసత్య దోషం చుట్టుకుంటుంది. అందువల్ల ఏమీ బాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపు’ అన్నాడు.
వాజశ్రవుడు బదులివ్వలేదు.
తండ్రి మాట ప్రకారం నచికేతుడు యముడి వద్దకు బయలుదేరాడు.
యముడి కోసం వెదుక్కుంటూ నచికేతుడు నరకలోకానికి చేరుకున్నాడు.
నచికేతుడు అక్కడకు చేరుకునే సమయానికి యముడు నరకంలో లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు.
యముడు తిరిగి వచ్చేంత వరకు నచికేతుడు మూడురోజుల పాటు నరకద్వారం వద్దే నిరాహారంగా పడిగాపులు గాశాడు.
బయటకు వెళ్లిన యముడు తిరిగి నరకానికి వచ్చాడు.
‘ఎవరో బాలకుడు మీకోసం వచ్చి, మూడురోజులుగా అన్నపానీయాల్లేకుండా మన నరకద్వారం వద్దే నిరాహారంగా ఎదురుచూస్తున్నాడు’ అని యమభటులు చెప్పారు.
‘అతిథిలా వచ్చిన బాలకుడిని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేశాను’ అనుకుని యముడు బాధపడ్డాడు. వెంటనే నచికేతుని వద్దకు చేరుకున్నాడు.
‘మూడురోజులు నిన్ను నిరాహారంగా ఉంచి పాపం చేశాను. అందుకు పరిహారంగా నీకు మూడు వరాలిస్తాను. కోరుకో!’ అన్నాడు.
సరేనన్నాడు నచికేతుడు.
‘నేను తిరిగి ఇంటికి చేరుకునే సరికి, నన్ను మా నాన్న నవ్వుతూ స్వాగతించాలి, అతడి పాపాలన్నీ తొలగిపోవాలి. ఇది నా మొదటి వరం’ అన్నాడు నచికేతుడు.
‘తథాస్తు’ అన్నాడు యముడు.
‘స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞక్రతువు పద్ధతిని నేర్పించాలి. ఇది నా రెండో వరం’ అడిగాడు నచికేతుడు.
సంతోషంగా ‘సరేన’న్నాడు యముడు. యజ్ఞక్రతువును నేర్పించి, అప్పటి నుంచి ఆ యజ్ఞానికి నచికేతుడి పేరు మీద ‘నాచికేత యజ్ఞం’ అనే పేరు వస్తుందని కూడా ఆశీర్వదించాడు.
‘మరణానంతర జీవితాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని నాకు వివరించాలి. ఇది నా మూడోవరం’ అన్నాడు నచికేతుడు.
బాలకుడి మూడోవరానికి యముడు అవాక్కయ్యాడు.
దాని బదులు ధన కనక వస్తువాహనాలింకేవైనా కోరుకోమన్నాడు.
నచికేతుడు యముడి ప్రతిపాదనకు ‘ససేమిరా’ అన్నాడు. తనకు ఎలాగైనా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాల్సిందేనని పట్టుబట్టాడు.
బాలకుడైన నచికేతుడి పట్టుదలకు ముచ్చటపడ్డాడు యముడు. ఎట్టకేలకు అతడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. మరణానంతర జీవన రహస్యాలను వివరించి, సాదరంగా సాగనంపాడు.
బ్రహ్మజ్ఞానం పొందిన నచికేతుడు ఇంటికి చేరుకోగా, అతడి తండ్రి సంతోషంగా అతణ్ణి స్వాగతించాడు.
– కఠోపనిషత్తులోని కథ
Comments
Please login to add a commentAdd a comment