సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఈనెల 13న యూపీఏ మిత్ర పక్షాలకు విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు భాగస్వామ్య పక్షాలతో పాటు తెలుగుదేశం వంటి ఎన్డీయే భాగస్వాములకు కూడా ఆహ్వానం అందినట్లు జాతీయ పత్రికలలో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. అందులో టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటిపేజీలో ప్రముఖంగా ఇచ్చింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకింగ్ సంక్షోభం వంటి అంశాలపై ఈ విందు సమావేశంలో చర్చిస్తారని వినిపిస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో యూపీఏని పటిష్టపరుచుకోవడంలో భాగంగానే ఈ విందు జరుగుతోందని కూడా వినిపిస్తోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బీజేపీ – తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వినిపిస్తున్నా ఇంకా తెగతెంపులు కాకుండానే యూపీఏ విందుకు తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ఏడాది నేపథ్యంలో..
అయితే కొద్ది కాలంగా హస్తినలో పరిణామాలను గమనిస్తున్న వారికి మాత్రం ఈ పరిణామం అంతగా ఆశ్చర్యం కలిగించలేదు. కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీ కి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న మాట నిజమేనని వారు పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా ఎన్డీయేలో భాగస్వామిగా కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ రకరకాల కారణాల రీత్యా బీజేపీకి దూరం జరిగేందుకు ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఎన్నికల ఏడాది నేపథ్యంలో తన వైఫల్యాల నెపాన్ని కేంద్రంపై వేసి కన్వీనియెంట్‌గా తప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది కూడా అందరూ చర్చించుకుంటున్న అంశమే.
కాంగ్రెస్‌తో టీడీపీ సాన్నిహిత్యం..: టీడీపీ ఎంపీలు, నాయకులు కాంగ్రెస్ నాయకులకు సన్నిహితంగా వ్యవహరిస్తుండడం గత కొంతకాలంగా కనిపిస్తున్నదేన ని విశ్లేషకులంటున్నారు. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ తొలివిడత సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపే సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీతో మాట్లాడడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మంగళవారం నాడు పార్లమెంటు వెలుపల తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న సమయంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ఒకరు టీడీపీ ఎంపీలకు దగ్గరగా ప్లకార్డు పట్టుకుని నిరసన తెలపడం గమనార్హం.
నాలుగు నెలల కిందటే రంగం సిద్ధం..
కాంగ్రెస్–టీడీపీ సాన్నిహిత్యానికి మూడు, నాలుగు నెలల కిందటే రంగం సిద్ధమైందని ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. మూడునాలుగు నెలల క్రితం నుంచే టీడీపీ అనుకూల ‘తోక పత్రిక’లో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రారంభమయ్యాయి. మరో ప్రధాన పత్రిక కూడా ఇటీవలి కాలంలో ఇదే వైఖరితో కథనాలు ప్రముఖంగా ప్రచురించడాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
ఈ పద్ధతిలో జరగదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్‌కు సంబంధించి, బోయలను ఎస్టీలలో కలపడానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం, తన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ చేత నిజనిర్ధారణ కమిటీ వేయించి కేంద్రం నిధులివ్వకపోవడం నిజమేనన్నట్లు గణాంకాలు చెప్పించడం, ఆ నిజనిర్ధారణ కమిటీలో కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులుండడం వంటివన్నీ కూడా బీజేపీతో దూరం జరగడానికి తగిన భూమికను సిద్ధం చేసుకోవడంలో భాగమేనని విశ్లేషకులంటున్నారు. ఇవన్నీ గమనిస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండానే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ నుంచి విందుకు ఆహ్వానం రావడం ఆశ్చర్యం కలిగించట్లేదని విశ్లేషకులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment