కుట్రతోనే వాద్రాపై ఆరోపణలు: సోనియా
మోదీ షెహన్‌షాలా వ్యవహరిస్తున్నారని ధ్వజం
రాయ్‌బరేలీ: తన అల్లుడు రాబర్ట్ వాద్రాపై బీజేపీ, ఎన్‌డీఏ ప్రభుత్వం ఆరోపణలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ విముక్త భారత్‌ను సాధించాలనే లక్ష్యంతోనే బీజేపీ నేతలు రాబర్ట్ వాద్రాపై కుట్రపూరితంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో సోనియాగాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు.. ఒక ఆయుధ వ్యాపారికి, వాద్రాకు మధ్య ఉన్న లింకులపై ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేపట్టనుందనే వార్తలపై సోనియాను ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు.
మోదీ షెషన్‌షాలా ప్రవర్తిస్తున్నారు..
నరేంద్రమోదీ ప్రధానమంత్రిలా కాకుండా షెహన్‌షా (చక్రవర్తి) మాదిరిగా ప్రవర్తిస్తున్నారని సోనియా మండిపడ్డారు. దేశంలో పేదరికం, కరువు తీవ్రంగా ఉండి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మరోవైపు వాద్రాను సోనియాగాంధీ వెనకేసుకురావడం ఒక నాటకమని బీజేపీ కొట్టిపారేసింది.