
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ విస్పష్ట మెజారిటీ రాకుంటే బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాన్ బీజేపీ అలయన్స్ ఏర్పాటు దిశగా చర్చలు జరిపేందుకు మధ్యప్రదేశ్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాధ్‌కు యూపీఏ చీఫ్ సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.
మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం హంగ్ పార్లమెంట్ అనివార్యమైతే చిన్న, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే కసరత్తును కమల్ నాధ్‌కు సోనియా అప్పగించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఎన్డీఏయేతర పక్షాలు, తటస్ధంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకంగా మారనున్నాయి.
కేంద్రంలో ఎవరు అధికార పగ్గాలు చేపడతారో నిర్ణయించే కీలక పార్టీలుగా ఇవి అవతరిస్తాయి. ఇక హంగ్ పార్లమెంట్ అనివార్యమైతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పార్టీకి మద్దతును కూడగట్టే ప్రక్రియను కమల్ నాధ్ సమర్ధంగా ముందుకు తీసుకువెళతారని సోనియా భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment