'మా సోనియా సివంగి లాంటివారు'
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సివంగి లాంటివారని ఆ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు వేటిలోనూ ఆమెపేరు లేదని అన్నారు. లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నాయకులు తమ ప్రసంగాల్లో సోనియాపై పరోక్ష విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే సివంగి లాంటి సోనియా.. వీటికి భయపడబోరని సింధియా చెప్పారు. అగస్టా వెస్ట్‌లాండ్ భారతీయ కార్యాలయంలోని అధికారి పీటర్ హులెట్ రాసిన లేఖను ఆయన ప్రస్తావిస్తూ, సోనియా.. ఆమె సలహాదారులను తమ రాయబార కార్యాలయం గౌరవించాల్సి ఉందని చెప్పారన్నారు. సోనియా పేరు ఏ పత్రంలోనూ లేదని, ఎవరి సంతకాలూ లేని.. ఎవరూ ధ్రువీకరించని పత్రాల మీద మాత్రమే ఉందని తెలిపారు.
ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ కూడా తన జీవితంలో ఎప్పుడూ ఏ గాంధీనీ కలవలేదన్నారని, వాళ్ల నుంచి తనకు లేఖ గానీ, మెసేజ్ గానీ ఏమీ లేవని చెప్పారని సింధియా గుర్తుచేశారు. గాంధీలకు అసలు డబ్బు ఏవీ చెల్లించలేదని క్రిస్టియన్ మైఖేల్ గట్టిగా చెప్పారన్నారు. మిలన్ కోర్టు జడ్జి కూడా సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవనే చెప్పారని అన్నారు.