
త్వరలో రాహుల్ రైతు పాదయాత్ర
న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పరంపర నేపథ్యంలో కర్షకుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కిసాన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలుగా ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన మహారాష్ట్రలోని విదర్భ లేదా తెలంగాణలోని మెదక్‌గానీ మరేదైనా జిల్లా నుంచి ఈ యాత్రను రాహుల్ ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణలలోని వివిధ జిల్లాల్లో రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు.
యూపీలోని బుందేల్‌ఖండ్, తూర్పు యూపీలో పర్యటించనున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బుందేల్‌ఖండ్‌కు ప్రత్యేక ప్యాకేజీ అందేలా రాహుల్ చొరవ చూపడం తెలిసిందే. రాహుల్ కిసాన్ పాదయాత్ర గురించి ఏఐసీసీ సమాచార విభాగం ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలాను మీడియా సంప్రదించగా రానున్న కొన్ని రోజుల్లోనే ఈ యాత్ర ఉంటుందని...రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన అన్ని రాష్ట్రాలనూ రాహుల్ సందర్శిస్తారని చెప్పారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాలు ఖరారు కావాల్సి ఉందన్నారు.
మే రెండో వారంలో రాహుల్ రాక:
రాహుల్ వచ్చేనెల రెండోవారంలో తెలంగాణకు రానున్నారు. ఇటీవలి వడగళ్ల వాన, ఈదురు గాలులకు తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట, ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో పంట పొలాలను పరిశీలించడంతోపాటు బాధిత రైతులను పరామర్శించేందుకు రాహుల్ వస్తున్నట్లు ఏఐసీసీ నుంచి టీపీసీసీకి సమాచారం అందింది.