షిరిడీకి వెళ్లడం ఇక ఈజీ
షిరిడీ సాయిబాబా భక్తులకు శుభవార్త. ఇక నుంచి షిరిడీ వెళ్లాలంటే గంటల తరబడి రైలు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. వచ్చే నెల నుంచి నేరుగా షిరిడీకి విమానాలు వెళ్లనున్నాయి. మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎంఏడీసీ) సంస్థ అహ్మద్‌నగర్ జిల్లాలో షిరిడీ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. ఈ విమానాశ్రయానికి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు నగరాల నుంచి విమానాలు వచ్చేందుకు వీలుంది. 2002లో ఏర్పాటైన ఎంఏడీసీ ఇంతవరకు ఒక్క విమానాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయలేదని కాగ్ ఇటీవలే వాతలు పెట్టింది. దాంతో తాము తొలిసారిగా ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ సీఎండీ విశ్వాస్ ఎం పాటిల్ తెలిపారు.
విమానాశ్రయం దాదాపుగా సిద్ధమైందని, దీన్ని తామే నిర్వహిస్తామని, వచ్చే నెల నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని ఆయన చెప్పారు. తొలుత కేవలం స్వదేశీ విమానాలను మాత్రమే ఇక్కడి నుంచి నడిపిస్తామని, ఆ తర్వాత అంతర్జాతీయ విమానాలు కూడా వస్తాయని అన్నారు. దీని కోసం పౌర విమానయాన మంత్రిత్వశాఖ రూ. 340.54 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీని రన్‌వే 2,500 మీటర్ల పొడవుంటుందని, 3 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన టెర్మినల్ ఉందని, రన్ వేను 700 మీటర్ల మేర విస్తరించేందుకు ఇటీవలే రూ. 40 కోట్లు మంజూరయ్యాయని, దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టామని పాటిల్ వివరించారు.
ఇప్పటికే ఏటీసీ టవర్, సిస్టంలు సిద్ధమయ్యాయని, దీనికి అంతర్జాతీయ లుక్ ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దేశంలోని వివిధ నగరాల నుంచి షిరిడీకి రావాలంటే ప్రస్తుతం రైలు, రోడ్డు మార్గాలు మాత్రమే ఉన్నందున ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందని పాటిల్ చెప్పారు.