అంతరిక్ష పథికుడి కన్నుమూత | Space scientist UR Rao, former ISRO chief, passes away | Sakshi
Sakshi News home page

అంతరిక్ష పథికుడి కన్నుమూత

Published Tue, Jul 25 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

అంతరిక్ష పథికుడి కన్నుమూత

అంతరిక్ష పథికుడి కన్నుమూత

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన యూఆర్‌ రావు
► దేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి
► ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పనలో విశేష కృషి
►  చంద్రయాన్, మంగళ్‌యాన్‌ తదితర ఇస్రో ప్రాజెక్టుల్లో కీలకపాత్ర


సాక్షి, బెంగళూరు: దేశ అంతరిక్ష చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్, దేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి యూఆర్‌ రావు సోమవారమిక్కడ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో కన్నుమూశారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆయన నిద్రలోనే మరణించారని ఇస్రో పౌర సంబంధాల డైరెక్టర్‌ దేవీప్రసాద్‌ కర్ణిక్‌ తెలిపారు.

85 ఏళ్ల రావుకు భార్య యశోద, ఒక కుమారుడు మదన్‌రావు, కుమార్తె మాలా ఉన్నారు. రావు మృతి వార్త తెలిసిన వెంటనే శాస్త్రవేత్తలు, కర్ణాటక గవర్నర్‌ వీ.ఆర్‌.వాలా, సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ తదితర ప్రముఖులు ఆయన స్వగృహానికి చేరుకుని నివాళి అర్పించారు. అంత్యక్రియలను సాయంత్రం నిర్వహించారు. రావు మృతిపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మరపురానివి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

1975లో ప్రయోగించిన ‘ఆర్యభట్ట’ మొదలుకుని ఇటీవల చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్‌–1, అంగరకుడిపైకి పంపిన మంగళ్‌యాన్, ప్రతిపాదిత ఆదిత్య సోలార్‌ మిషన్‌ వంటి దాదాపు అన్ని ఇస్రో ప్రాజెక్టుల్లో రావు వివిధ హోదాల్లో కీలక పాత్ర పోషించా రు. వాతావరణం, కమ్యూనికేషన్లకు సంబంధించిన భాస్కర, రోహిణి, ఇన్‌శాట్‌–1, ఇన్‌శాట్‌–2, ఐఆర్‌ఎస్‌–1ఏ, 1బీ, 1సీ, 1డీ ఉపగ్రహాల ప్రయోగానికి దోహదపడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేకూర్చుకోవడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.

చివరిదశ వరకు అంతరిక్ష రంగంతోనే తన జీవితాన్ని పెనవేసుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ పాలకమండలి చైర్మన్, తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చాన్స్‌లర్‌ పదవుల్లో కొనసాగుతూనే తుదిశ్వాస విడిచారు. రెండు తరాల శాస్త్రవేత్తల మధ్య వారధిలా పనిచేసిన ఆయనకు దేశంలోని ఎన్నో శాస్త్ర, సాంకేతిక సంస్థలతో సన్నిహిత అనుబంధం ఉంది.  

శ్రీహరికోటతో అనుబంధం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): రావుకు శ్రీహరికోటలోని రాకెట్‌ ప్రయోగ కేంద్రం(షార్‌)తో విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత ప్రధానులు పీవీ నరసింహారావు, రాజీవ్‌ గాంధీలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన రావు.. వారు షార్‌ సందర్శనకు వచ్చినప్పుడు ఇస్రో కార్యక్రమాలను క్షుణ్ణంగా వివరించేవారు. ఇస్రో చైర్మన్‌గా రిటైరైన తర్వాత కూడా ఆయన షార్‌లో జరిగిన అన్ని ప్రయోగాలకు హాజరై  సలహాలు, సూచనలు ఇచ్చారు.

సాంకేతిక రథసారథి
అంతరిక్ష రంగంలో దేశాన్ని పరుగులు పెట్టించిన ఉడిపి రామచంద్ర రావు 1932 మార్చి 10న కర్ణాటక ఉడిపి జిల్లాలోని కుగ్రామం అడమూరులో పేద రైతు కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యను ఉడిపిలో, జూనియర్‌ కాలేజీ విద్యను బళ్లారిలో, బీఎస్సీని అనంతపురంలోని ప్రభుత్వ కాలేజీలో, ఎమ్మెస్సీని బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీలో భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేశారు. కాస్మిక్‌ రే (విశ్వ కిరణ) శాస్త్రవేత్తగా కెరీర్‌ను ప్రారంభించిన రావు కొన్నాళ్లు అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, టెక్సాస్‌ వర్సిటీల్లో అధ్యాపకుడిగా చేశారు.

ఆ సమయంలో ఉపగ్రహాలు, సౌరశక్తి వినియోగంపై ఎన్నో పరిశోధనలు నిర్వహించారు. 1966లో సారాభాయ్‌తోపాటు భారత్‌కు తిరిగివచ్చి ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీలో ప్రొఫెసర్‌గా చేరారు. 1972లో ఇండియన్‌ సైంటిఫిక్‌ శాటిలైట్‌ ప్రాజెక్టులో  డైరెక్టర్‌గా చేరి.. దేశానికి ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే గురుతర బాధ్యత తీసుకున్నారు. 1984లో భారత అంతరిక్ష కమిషన్‌ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి రాకెట్‌ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని వేగవంతం చేశారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్, క్రయోజనిక్‌ టెక్నాలజీ అభివృద్ధికీ శ్రీకారం చుట్టారు. ఫలితంగా 2 టన్నుల బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల పీఎస్‌ఎల్‌వీతోపాటు ఇతర శక్తిమంతమైన రాకెట్లు భారత్‌ సొంతమయ్యాయి.

రావు ఇస్రో అధిపతిగా ఉన్న సమయంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌ రాకెట్లతో దేశ కమ్యూనికేషన్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కాస్మిక్‌ రేస్, ఖగోళ భౌతికశాస్త్రం, ఉపగ్రహాలు తదితర అంశాలపై ఆయన 350 పరిశోధన పత్రాలతోపాటు పలు పుస్తకాలు రాశారు. 25 వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రభుత్వం ఆయనను 1976లో పద్మభూషణ్, ఈ ఏడాదిలో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.  వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత ‘శాటిలైట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ తోపాటు మెక్సికోలోని ఐఏఎఫ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సభ్యత్వం పొందిన తొలి భారత అంతరిక్ష శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement