భారత్‌లో జైషే మహ్మద్ నుంచి పొంచి ఉన్న ఆత్మహుతి దాడుల ప్రమాదాన్ని అడ్డుకునేందుకు ఆ సంస్థ స్థావరాలపై దాడి తప్పనిసరి అయ్యిందని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. నిర్దిష్టంగా జైషే శిబిరాన్నే లక్ష్యంగా చేసుకొని సైనికేతర దాడి చేశామని ఆయన చెప్పారు. జైషే ఉగ్ర క్యాంపుపై వైమానిక దాడి నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోఖలే ఈ మేరకు ప్రకటన చేశారు.
విదేశాంగ కార్యదర్శిచేసిన ప్రకటన పూర్తి పాఠం ఇదీ...
‘‘2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ కేంద్రంగా పని చేసే ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసి 40 మంది ధీర జవాన్లను బలిగొంది. మసూర్ అజర్ నాయకత్వంలోని జేఈఎం గత రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. బహవల్‌పూర్ కేంద్రంగా పని చేస్తోంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఈ సంస్థ 2001 డిసెంబర్‌లో భారత పార్లమెంట్‌పై, 2016 జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడులు జరిపింది. వరుస ఉగ్ర దాడులకు తెగబడుతూ వస్తోంది. పాకిస్తాన్‌లో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జైషే నడుపుతున్న శిక్షణా శిబిరాల తాలూకూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాక్‌కు తెలియజేస్తూ వచ్చాం. కానీ అలాంటివేమీ లేవని ఆ దేశం తోసిపుచ్చుతోంది. పాకిస్తాన్ అధికారులకు తెలియకుండా వందలాది మంది జీహాదీలకు శిక్షణ ఇవ్వగల అలాంటి భారీ శిక్షణా శిబిరాలు పని చేయలేవు. జైషేపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేం పదే పదే పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేస్తూ వచ్చాం.
కానీ పాక్ ఆ దేశ భూభాగంపై ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే దిశగా నిర్దిష్టంగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ గ్రూపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి ఉగ్ర దాడికి కుట్ర పన్నుతున్నట్లు, ఇందుకోసం ఫిదాయీన్ (ఆత్మహుతి) జీహాదీలకు శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. పొంచి వున్న ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు సైనికేతర, ముందస్తు దాడి చేయడం తప్పనిసరి అయింది. నిఘా వర్గాల నేతృత్వంలో మంగళవారం వేకువజామున, బాలాకోట్‌లోని జైషే శిక్షణ శిబిరంపై దాడి చేశాం. ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, ఆత్మాహుతి దాడులు జరిపేందుకు శిక్షణ పొందుతున్న జిహాదీ గ్రూపులను పెద్ద సంఖ్యలో నిర్మూలించాం.
మసూద్ అజర్ సమీప బంధువైన మౌలానా యూసఫ్ అజర్ (అలియాస్ ఉస్తాద్ ఘారి) ఆధ్వర్యంలోని ఈ శిబిరం దట్టమైన అడవిలోని ఓ కొండపై పౌర నివాసాలకు దూరంగా ఉంది. ఉగ్రవాదంతో పోరాడేందుకు అవసరమైన సమస్త చర్యలూ చేపట్టే విషయంలో భారత్ గట్టిగా, నిబద్ధతతో వ్యవహరిస్తోంది. నిర్దిష్టంగా జైషే శిబిరాన్నే లక్ష్యంగా చేసుకుని సైనికేతర దాడి చేశాం. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ వాటిల్లకుండా ఉండేందుకు నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకున్నాం. భారత్‌కు వ్యతిరేకంగా తన భూభాగంపై ఉగ్ర కార్యకలాపాలు అనుమతించబోనని 2004 జనవరిలో పాకిస్తాన్ ప్రకటించింది. దానికి ఆ దేశం కట్టుబడి ఉంటుందని, జైషే సహా ఇతర ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ధ్వంసం చేసే దిశగా తగిన చర్యలు చేపడుతుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment