మతహింసతో చీల్చే యత్నం: సోనియా
న్యూఢిల్లీ: దేశంలో మతహింస పెరగడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. మతం పేరుతో ప్రజలను చీల్చేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అల్లర్లను ప్రేరేపిస్తోందని విరుచుకుపడ్డారు. తిరువనంతపురంలో కేరళ పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఆమె మాట్లాడారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఇటీవలే దాదాపు 600చొప్పున మతహింస సంఘటనలు జరిగాయని యూపీఏ పదేళ్ల హయాంలో అల్లర్లు చాలా అరుదని అన్నారు. మరో సభలో మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33శాతం కోటా కల్పించే బిల్లు ఆమోదం కోసం ప్రతిపక్షంగా కర్తవ్యం నెరవేరుస్తామన్నారు.
ఆత్మపరిశీలన చేసుకోండి: వెంకయ్య
మోడీ సర్కార్ వచ్చినప్పటినుంచి మత హింస పెరిగిందన్న సోనియాగాంధీ ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవరాహాల మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆధార రహితమైన ఇలాంటి ఆరోపణలు చేసేముందు కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఢిల్లీలో వ్యాఖ్యానించారు.