పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు!
చెన్నై, సాక్షి ప్రతినిధి : అవును మీరు సరిగానే చదివారు, సందేహమే లేదు. ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంకులు తదితర చోట్ల దొంగలు పడితే ప్రజలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. మరి పోలీస్‌స్టేషన్లో దొంగలు పడితే?. ఈ విచిత్రం చెన్నైలో జరిగింది. చెన్నైలో అత్యంత ప్రధానమైన మౌంట్‌రోడ్డులో తేనాంపేట పోలీస్‌స్టేషన్ ఉంది. 24 గంటలు రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదాగల అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం కూడా ఉంది.
మంగళవారం తెల్లవారుజామున విధులకు వచ్చిన పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ విభాగ కార్యాలయం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని కనుగొన్నారు. లోపలికి పోయి చూడగా ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో వినియోగించే ఏడు వాకీటాకీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దొంగలుపడిన విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదండీ సంగతి.