
ట్రిపుల్ తలాక్ నిషేధంపై ఎన్నికల తర్వాత కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి
ఘజియాబాద్/లక్నో: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది మత సంబంధ విషయం కాదని, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదని శనివారం ఘజియాబాద్‌లో విలేకర్లతో అన్నారు. ‘ట్రిపుల్ తలాక్ నిషేధం కోసం ప్రభుత్వం యూపీ ఎన్నికల తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం ప్రతి మతాన్నీ గౌరవిస్తుంది.
అయితే మతారాధన, సంఘ దురాచారం కలసి మనుగడ సాగించలేవు. ట్రిపుల్ తలాక్ మహిళలకు గౌరవాన్ని నిరాకరిస్తోంది. ఈ దురాచారానికి ముగింపు పలకడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని చెప్పారు. మహిళకు గౌరవం, న్యాయం, సమానత్వమనే మూడు అంశాలపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈ అంశాన్ని లేవనెత్తుతుందని వివరించారు. మహిళలను బీజేపీ ఒక్కటే గౌరవిస్తోందని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద అంశంపై సమాజ్‌వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు తమ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆదివారం ఆయన లక్నోలో డిమాండ్ చేశారు.