ఈశాన్య రుతు పవనాలు మరింత ప్రతాపం చూపించనున్నట్లు వచ్చిన సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటి వరకు చేపట్టిన ముందస్తు చర్యలు వేగవంతం చేయడానికి నిర్ణయించింది.
సాక్షి, చెన్నై:ఈశాన్య రుతు పవనాలు మరింత ప్రతాపం చూపించనున్నట్లు వచ్చిన సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటి వరకు చేపట్టిన ముందస్తు చర్యలు వేగవంతం చేయడానికి నిర్ణయించింది. వర్షాలకు 28మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం
సచివాలయంలో అధికారులతో సీఎం పన్నీరు సెల్వం వర్షాలపై సమీక్షించారు.
ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో రాష్ర్టంలో వారం నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో ప్రభుత్వం మేల్కొంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో సహాయక చర్యల విషయమై పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలను మరింత వేగవంతం చేసే విధంగా అధికారులకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి విపత్తులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.
అధికారులతో సమీక్ష: సచివాలయంలో పది విభాగాల అధికారులతో సీఎం సమీక్షించారు. సీనియర్ మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్య లింగం, ఎడ పాడి పళని స్వామి, వేలుమణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌వర్గీస్ సుంకత్, ప్రభుత్వ సలహా దారు షీలా బాలకృష్ణన్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాల వారీగా సేకరించిన సమాచారాన్ని ఆయా విభాగాల అధికారులు సీఎంకు వివరించారు. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు 28 మంది మరణించినట్టు ప్రకటించారు. తూత్తుకుడిలో ఐదుగురు, కడలూరులో నలుగురు, రామనాథపురంలో ముగ్గురు, ఇతర జిల్లాల్లో ఇద్దరు, లేదా ఒకరు చొప్పున మరణించినట్టు వివరించారు.
ఆరు జిల్లాల్లో అత్యధికంగా 20 మి.మీ. వర్షపాతం నమోదు అయిందని, మరో ఏడు జిల్లాల్లో 10 నుంచి 155 మి. మీ వరకు వర్షం పడ్డట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జలాశయాల్లో ప్రస్తుత నీటి మట్టం, పెరుగుతున్న నీటి మట్టం గురించి విశదీకరించారు. డెల్టా జిల్లాల్లో సంబా సాగు బడి, అన్నదాతలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సీఎం పన్నీరు సెల్వం, త్వరితగతిన ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ తీరాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేయాలని, వారి నుంచి వచ్చే సమాచారం మేరకు ఎలాంటి ప్రమాదాల్ని అయినా, విపత్తుల్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇచ్చామని, ఈ పనుల్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందస్తుగా సర్వ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.