రూ. లక్ష దాటిన కిలో టీ పౌడరు | Storm in a Tea cup: kg Tea powder cost Rs.1lhak | Sakshi
Sakshi News home page

రూ. లక్ష దాటిన కిలో టీ పౌడరు

Published Fri, Jul 7 2017 2:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

రూ. లక్ష దాటిన కిలో టీ పౌడరు

రూ. లక్ష దాటిన కిలో టీ పౌడరు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే, ముఖ్యంగా యూరప్‌ దేశాల్లో గూర్ఖాలాండ్‌ రాజధాని డార్జిలింగ్‌ తేయాకు ప్రత్యేకమైన డిమాండ్‌ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ రాష్ట్ర ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తుండడంతో తేయాకు రెండో పంట పూర్తిగా దెబ్బతిన్నది. తేయాకును తెంపే కూలీలు పనిలోకి రాకుండా ఆందోళన చేస్తుండడంతో స్థానిక టీ కంపెనీలన్నీ మూతపడ్డాయి. యూరప్‌ దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారతీయ కరెన్సీలో ఐదువేల రూపాయలకు కిలో పలికే డార్జిలింగ్‌ టీ పొడి ధర ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో లక్ష ఇరవై వేల రూపాయలు పలుకుతోంది. మరికొంతకాలం అయితే అసలు సరకు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తేయాకు ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అస్సాం తేయాకుకన్నా డార్జిలింగ్‌లో పండే తేయాకు ప్రత్యేకమైనది, భిన్నమైనది. దీనికి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటుంది. అందుకనే అస్సాం టీ పొడి కిలో 130 రూపాయలు పలికితే డార్జిలింగ్‌ టీ పొడి ధర ఐదువేల రూపాయల వరకు పలుకుతుంది. డార్జిలింగ్‌ తేయాకు పంటను మేలో ప్రారంభిస్తారు. అదే జూన్‌ నెలలో తీవ్రస్థాయికి చేరుకుంటంది. సెప్టెంబర్‌తో పూర్తిగా ముగిసిపోతుంది. అన్నింటికన్నా జూన్‌ నెల కీలకమైనది. ఆకులను తెంపి వేయడం వల్ల మళ్లీ వచ్చే ఆకులు బలంగా ఉంటాయి. జూన్‌ నెలలో తేయాకు ఆకులను తెంపడం ఆపిస్తే ఆ తర్వాత ఆకులు కూడా చేతికి అందకుండా పోతాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తూ గూర్ఖాలు జూన్‌ 9వ తేదీ నుంచి తేయాకు తోటల్లోకి పనులకు రావడం లేదు.

డార్జిలింగ్‌ తేయాకు రెండో పంట దాదాపు పూర్తిగా తుడుచుపెట్లుకుపోయినట్లేనని స్థానిక ‘గూడ్‌రిక్‌ గ్రూప్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏఎన్‌ సింగ్‌ తెలిపారు. 40 శాతం రెవెన్యూ పూర్తిగా నష్టపోయామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఆ కంపెనీకి 260 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే వాటిల్లిందని డార్జిలింగ్‌ టీ అసోసియేషన్‌ కార్యదర్శి కౌషిక్‌ బసు మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలో దాదాపు వంద మంది ఎగుమతిదారులకు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తోంది.

జర్మనీకి చెందిన హల్‌స్సేన్‌ అండ్‌ ఆంప్, లియాన్, లండన్‌కు చెందిన యూనిలివర్, యూకేకు చెందిన టైపూ, ట్వినింగ్స్, టెట్లీ కంపెనీలు డార్జిలింగ్‌ టీ పొడిని ఎక్కువగా కొనగోలు చేస్తాయి. ఇప్పట్లో ఆందోళన సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు గూర్ఖా ఆందోళనకారులు మరణించారు. పలువురు గాయపడ్డారు. 1980 దశకంలో ఆందోళన తీవ్రంగా జరిగినప్పుడు దాదాపు 1200 మంది ఆందోళనకారులు మరణించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement