బెంగళూరు ఘటనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యువత అనుసరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి వల్లే బెంగళూరులో అనర్ధం జరిగిందని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర అన్నారు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తేలికగా కొట్టిపారేశారు. బెంగళూరులో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో కీచకులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. న్యూఇయర్ స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్న మహిళలను వేధింపులకు గురిచేశారు. పోలీసుల సాక్షిగానే కీచకులు ఈ అఘాయిత్యాలకు పాల్పడడం భయాందోళన రేపుతోంది.
బాధితులు ఫిర్యాదు చేసినా రక్షకభటులు చూసిచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయని ‘బెంగళూరు మిర్రర్’ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి ఈ ఘటనపై అవాక్కయ్యేలా స్పందించారు. 'దురదృష్టం కొద్ది న్యూ ఇయర్ వంటి వేడుకల సందర్భాల్లోనే ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ రోజు మొత్తం యువతే అక్కడ ఉన్నారు. వారంతా పాశ్చాత్య సంస్కృతి అనుసరిస్తున్న వారే. వారి ఆలోచన మాత్రమే కాదు.. వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా పాశ్చాత్య సంస్కృతిలాగే ఉంది.
అందుకే కొంత గందరగోళం జరిగింది. కొంతమంది అమ్మాయిలను వేధింపులకు గురయ్యారు' అంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీనిపై జాతీయ మహిళ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వెంటనే సమాధానం చెప్పాలని, మొత్తం మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయనను వెంటనే మంత్రి పదవిలో నుంచి తొలగించాలని కోరింది.