
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామసుబ్రమణియన్
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ రానున్నారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అక్కడ ఆయన 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి హైకోర్టుకు వచ్చేపక్షంలో ఆయన ఇక్కడ మూడవ స్థానం లో ఉంటారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామసుబ్రమణియన్ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం కొద్ది రోజులక్రితం సిఫారసు చేసింది. అయితే ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. తమిళనాడుకు చెందిన జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రామసుబ్రమణియన్‌కు మంచి వక్తగా పేరుంది.