ఢిల్లీ ప్రభుత్వానికీ అధికారాలుండాలి: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని అధికారాలుండాలనీ, లేకపోతే అది పనిచేయలేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరే(ఎల్జీ) పరిపాలనాధిపతి అని, సీఎం, మంత్రివర్గం నామమాత్రమేనని ఢిల్లీ హైకోర్టు గతంలో తీర్పు నివ్వడం తెలిసిందే. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంలో సవాల్ చేసింది. సుప్రీం తుది విచారణను జనవరి 18కి వాయిదా వేస్తూ.. ‘ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కొన్ని అధికారాలుండాలి. లేకపోతే అది పనిచేయలేదు.
ఈ విషయాన్ని త్వరగా తేల్చాలి’అని పేర్కొంది. ఆప్ ప్రభుత్వం తరఫున న్యాయవాది గోపాల్ సుబ్రమణియం వాదిస్తూ ప్రస్తుతం ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి నుంచి నాల్గవ తరగతి ఉద్యోగి వరకు ఎవరినీ నియమించే అధికారం లేదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం పాలనలో ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాలను ఎల్జీ తీసుకోవాలనీ, అభిప్రాయ భేదాలుంటే రాష్ట్రపతికి నివేదించాలని వివరించారు.