న్యూఢిల్లీ: కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై పరువు హత్యలకు పాల్పడటం సామాజిక రుగ్మత అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇది వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని హరించడమేనని.. దీని చెడు ప్రభావం సమాజంపై పడుతుందని పేర్కొంది. వెంటనే ఖాప్ పంచాయతీల చట్ట వ్యతిరేక చర్యలను పూర్తిగా ఆపుచేయాలని ఆదేశించింది. పరువు హత్యలకు పాల్పడటమనేది మనిషి హుందాతనాన్ని, చట్ట సార్వభౌమత్వాన్ని అవమానించడమేనంది.
2010లో శక్తి వాహిని అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ‘ఖాప్‌లు తాము సీజర్ పూర్వీకులు లేదా 16వ లూయీగా భావించుకుని తమకోసం తాము చట్టాలు చేసుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లలో ఖాప్ పంచాయతీలు జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధం.
ఇష్టపూర్వకంగా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వయోజనులను చంపేస్తామని బెదిరించడం, హింసకు దిగడం, పరువు హత్యలకు పాల్పడటాన్ని అంగీకరించబోం. వారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆపుచేయాలి. ఎవరిని వివాహం చేసుకోవాలో తేల్చుకునే స్వేచ్ఛ పురుషులు, స్త్రీలకు ఉంటుంది. ఇందుకు కుటుంబం లేదా కులం, లేదా సమూహం అనుమతి అవసరం లేదు’ అని పేర్కొంది. పరువు హత్యలు లేదా నేరాలను అదుపు చేసేందుకు తాము జారీ చేసే మార్గదర్శకాలను ఆరు వారాల్లోగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment