రాజ్యాంగ ధర్మాసనానికి ‘అధికారాల వివాదం’
సుప్రీంకోర్టు నిర్ణయం
కేంద్రం, ఆప్ సర్కార్ వాదనలు అక్కడే వినిపించాలన్న జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదు కనుక లెప్టినెంట్ గవర్నర్ చేతిలోనే పాలనాధికారం ఉంటుందని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ అధికార అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ కేసుల్లో చట్టం, రాజ్యాంగానికి సంబంధించిన అనేక కీలకాంశాలుండటంతో దీన్ని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె. సిక్రీ, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్, ఐదుగురు న్యాయమూర్తులతో ఈ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తమ వాదనలను ఈ ధర్మాసనం ఎదుట వినిపించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేసు సత్వర పరిష్కారం కోసం ధర్మాసనాన్ని త్వరగా ఏర్పాటు చేయవలసిందిగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిని కోరవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఏయే అంశాలపై విచారణ జరపాలన్నది న్యాయమూర్తులు నిర్ధారించలేదు. ఢిల్లీ ప్రభుత్వ విభాగాలపై అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న విషయమై ఆప్ సర్కారు, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్‌ల మధ్య గట్టి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.