న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక సంఖ్య. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు సోమవారం ప్రమాణస్వీకారం చేసే వీలుంది. గత నెలలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను కేంద్రానికి సూచించింది. వీరిలో జస్టిస్ రామసుమ్రమణియన్ హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాను, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, హృతికేశ్ రాయ్‌లు రాజస్తాన్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరనుంది. సుప్రీంకోర్టులో 59,331 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జూలై 11న రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment