టెలికం కంపెనీలకు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ : కాల్ డేటా వ్యవహారంలో నలిగిపోతున్న టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో జరుగుతున్న విచారణను నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాల్ డేటా ఇవ్వడానికి అభ్యంతరం లేదని టెలికాం కంపెనీలు ఉన్నత న్యాయస్థానానికి తెలిపాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల వివాదం మధ్య తాము నలిగిపోతున్నామని కోర్టుకు వెల్లడించాయి.
వారంలోగా కాల్ డేటా వివరాలు విజయవాడ కోర్టుకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ సమాచారాన్ని మూడు వారాల పాటు ఓపెన్ చేయవద్దని కూడా కోర్టు ఆదేశించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. అసలు ఈ విషయాన్ని హైకోర్టుకు తెలుపకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని టెలికాం కంపెనీలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండు రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని టెలికాం కంపెనీలు వివరణ ఇచ్చాయి.