సాక్షి, న్యూఢిల్లీ : మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు ముస్లిం మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. పుణేకు చెందిన దంపతులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బదులివ్వాలని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది.
శబరిమల ఆలయంలో మహిళల అనుమతికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాజా పిటిషన్‌పై విచారణ చేపడతామని సుప్రీం బెంచ్ పిటిషనర్ల తరపు న్యాయవాదికి తెలిపింది. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశ పౌరులెవరినీ వారి మతం, జాతి, కులం, జెండర్, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్షకు గురిచేయరాదని, ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతించకపోవడం లింగవివక్ష, సమానత్వ హక్కులకు తూట్లు పొడవడమేనని పిటిషనర్లు పేర్కొన్నారు. విదేశాల్లో మసీదుల్లోకి మహిళలను అనుమతిస్తున్నారా అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment