న్యూఢిల్లీః దేశరాజధాని పరిథిలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యంతో ఉన్నకార్లు, స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్వూవీ), ను రిజిస్ట్రేషన్ చేసేముందు చిన్ననిబంధనను పాటించాల్సిందిగా కోర్టు సూచించింది. పర్యావరణ పరిరక్షణ సెస్ కింద 1 శాతం ప్రత్యేక రుసుమును సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకు చెల్లించిన అనంతరం యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపింది.
ఢిల్లీ చుట్టుపక్కల డీజిల్ కార్ల నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఆటోకంపెనీలు ఆహ్వానించాయి. ఎక్స్ షోరూం ఖరీదుకంటే 1 శాతం ప్రత్యేక రుసుమును పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేరున సిపిసిబి ప్రభుత్వ రంగ బ్యాంకులో జమచేసి, ఆ రసీదుతో ఆర్టీవో కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవచ్చని ఎపెక్స్ కోర్టు తెలిపింది. ఢిల్లీలో డీజిల్ వాహనాల నిషేధంతో జర్మనీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెజ్ బెంజ్, టయోటా, సంస్థలు తీవ్ర నష్టాలు చవిచూశాయి. దీంతో ఈ రెండు సంస్థలూ 1 శాతం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాక్స్ చెల్లిస్తామంటూ కోర్టులో పిల్ దాఖలు చేశాయి. కార్ల కంపెనీల పిల్ ను అంగీకరించిన సుప్రీం కోర్టు... నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు బ్యాన్ ఎత్తివేసిన వెంటనే కొన్ని ఆటోమొబైల్ సంస్థల షేర్లు అమాంతం పెరిగిపోయాయి. గత సంవత్సరం డిసెంబర్ 16న ఢిల్లీలో ఖరీదైన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ ను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే నిర్ణయాన్ని ఎన్సీఆర్ కు సైతం విస్తరిస్తూ ఈ సంవత్సరం మార్చి 31న మరో ఉత్తర్వు జారీ చేసింది. తాజాగా అటోకంపెనీల అభ్యర్థనపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని ధర్మాసనం నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. అయితే గ్రీన్ సెస్ విధించే హక్కు కోర్టుకు లేదంటూ కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలపడంతో తదుపరి విచారణకు ధర్మాసనం అంగీకరించింది.
డీజిల్ వాహనాలపై నిషేధం ఎత్తివేత..
Published Sat, Aug 13 2016 11:59 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM
Advertisement