లక్నో: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్టులు షేర్ చేసినందుకు ఢిల్లీ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను అరెస్ట్ చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతన్ని విడుదల చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన భర్తను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రశాంత్ భార్య జగీష అరారా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం అతన్ని వెంటనే విడుదల చేయాలని యోగి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అతనికి 11 రోజుల రిమాండ్ విధించండపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీం.. అతనేమన్న హత్య చేశారాఅంటూ ఘాటుగా ప్రశ్నించింది. ప్రశాంత్‌ను అరెస్ట్ చేయాడాన్ని తాము సమర్థించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.జర్నలిస్ట్‌లపై ప్రభుత్వాలు ఈ విధంగా నిర్భంధం విధించడం సరికాదని కోర్టు హెచ్చరించింది.
యోగి ఆదిత్యానాథ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారనే ఆరోపణలపై శనివారం నుంచి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన భర్త కనోజియాను అరెస్ట్ చేసే క్రమంలో సరైన పద్ధతులను పోలీసులు పాటించలేదని, ఆయన అరెస్ట్ అక్రమమని జగీష అరారా పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ గత ఏడాది కాలంగా తనతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతున్నారని, రాజకీయ నేతగా మారిన సన్యాసి తన జీవితాంతం తనతో ఉండేందుకు సిద్ధ పడతారా ? అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్‌ను షేర్ చేశారన్న అభియోగంతో కనోజియాను అరెస్ట్ చేశారు. ప్రధానంగా మహిళల అభిప్రాయాలను ప్రసారం చేసే ‘నేషనల్ లైవ్’ అనే టీవీ ఛానల్ ఎడిటర్‌ను కూడా కొన్ని గంటల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ వీడియో క్లిప్పును ప్రసారం చేసినందుకే ఛానల్ ఎడిటర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు.
ఇలాంటి నిర్బంధం సరైనది కాదు..
ప్రశాంత్ కనోజియాను అరెస్ట్ చేయండపై దారుణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జర్నలిస్ట్‌ల అక్రమ అరెస్టులను తాము ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేశారు. పత్రికలపై ఇలాంటి నిర్బంధం సరైనది కాదని.. యూపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment