సూపర్‌స్టార్‌ భార్యకు సుప్రీం కోర్టు మందలింపు | Supreme Court Pulls Up Latha Rajinikanth Over Kochadaiyaan Movie Controversy | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ భార్యకు సుప్రీం కోర్టు మందలింపు

Published Tue, Jul 3 2018 5:08 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Supreme Court Pulls Up Latha Rajinikanth Over Kochadaiyaan Movie Controversy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కొచ్చాడియాన్‌  చిత్ర నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించకపోగా, విచారణ ఎదుర్కోకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారంటూ లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే వాళ్లంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు తప్పకుండా కోర్టుకు హాజరుకావాల్సిందే. తప్పేమీ లేకపోతే నిర్దోషిగా తేలతారు కదా. ఇప్పుడైనా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మంచిది’ అంటూ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం చురకలు అంటించింది.

వివరాలు.... సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో యానిమేషన్‌ చిత్రం ‘కొచ్చాడియాన్‌’  తెరకెక్కిన విషయం తెలిసిందే. 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ చిత్ర నిర్మాణం కోసం లతా రజనీకాంత్‌కు చెందిన మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ... బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి రూ.6.20 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. అయితే రుణం చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ యాడ్‌బ్యూరో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లతా రజనీకాంత్‌.. జూలై 3వ తేదీ లోపు సంబంధిత సంస్థకు రుణాన్ని చెల్లించాల్సిందేనని గత ఫిబ్రవరిలో కోర్టు ఉ‍త్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 12 వారాల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇంతవరకు రుణం చెల్లించకపోవడంతో లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా గతంలో... ఈ కేసుతో లతా రజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆమె హామీదారుగా మాత్రమే ఉన్నారని.. యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రుణాన్ని త్వరలోనే చెల్లిస్తామని మీడియా వన్‌ గ్లోబల్‌ సంస్థ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ  పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు... జూలై 3వ తేదీలోగా లతా రజనీకాంత్‌ గాని, మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ గాని యాడ్‌ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement