
ఆరుషి తల్లిదండ్రుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో తల్లిదండ్రుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కోర్టులో ఆరుషి తల్లిదండ్రులు నూపుర్, రాజేష్ తల్వార్లకు మరోసారి చుక్కెదురైంది. జర్నలిస్టులను సాక్షులుగా పరిగణించాలన్న తల్వార్ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు తిరస్కరించింది.
ఆరుషి హత్య కేసులో సాక్షులను ప్రశ్నించాలన్న తల్వార్ దంపతుల విజ్ఞప్తి సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎడిజి(శాంతి భద్రతలు), సిబిఐ సంయుక్త సంచాలకులు అరుణ్ కుమార్‌లతో పాటు అదనంగా మరో 14 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుగా కొట్టివేసింది. దాంతో వారు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది.
నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది. నిందితుడిగా అనుమానించిన హేమ్‌రాజ్ కూడా ఆ తరువాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు పట్ల ఆసక్తి చూపుతున్నారు.