Arushi murder case
-
రాజీవ్ హంతకుల విడుదలకు నో
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ వీరిని విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ జస్టిస్ గొగోయ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి సమర్పించింది. మాజీ ప్రధానితో పాటు 15 మంది అధికారుల్ని పొట్టనపెట్టుకున్న విదేశీయుల్ని విడుదల చేస్తే చాలా ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి వీబీ దూబే కోర్టుకు సమర్పించిన పత్రంలో తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరస్తుల విడుదలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రాజీవ్ హంతకులపై ఎలాంటి జాలి చూపించాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు. మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. జయకుమార్, రాబర్ట్ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఈ ఏడుగురికి విధించిన శిక్షల్ని రద్దుచేసి విడుదల చేయాలంటూ అదే ఏడాది కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంతో ఏడుగురు ఉగ్రవాదుల్ని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం కేంద్రం అంగీకారం లేకుండా ఖైదీలను రాష్ట్రాలు విడుదల చేయడం కుదరదని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాన్ని సవరించేదాక ఆగం దేశంలో ఆందోళనలు, ధర్నాలు, బంద్‌ల సందర్భంగా అల్లరిమూకలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. ఇలాంటి ఘటనల్ని నిరోధించేందుకు కేంద్రం చట్టాన్ని సవరించేంతవరకూ తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చట్ట సవరణ విషయంలో ప్రభుత్వానికి తాము మార్గదర్శకాలు జారీచేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఎక్కడైనా అల్లర్లు, ఆస్తుల విధ్వంసం జరిగితే సంబంధిత జిల్లా సూపరింటెండెంట్(ఎస్పీ)లను బాధ్యులుగా చేయాలని న్యాయస్థానానికి సూచించారు. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలకు అధికారుల్ని బాధ్యులుగా చేయగానే అలాంటి అక్రమ కట్టడాలు నిలిచిపోయాయని తెలిపారు. ► ఆరుషీ తల్వార్, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో తల్వార్ దంపతుల్ని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. ► వచ్చే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్ యంత్రాలను తనిఖీలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సుప్రీంను ఆశ్రయించారు. ► లైంగిక దాడి, అత్యాచారాలకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌పై ఉన్న నిబంధనల్ని సమీక్షిస్తామని సుప్రీం తెలిపింది. మీడియాలో బాధిత మహిళలు, చిన్నారుల పేర్లు, ఫొటోల ప్రసారాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. వసతి గృహాల్లో రేప్‌లు ఎప్పుడు ఆగుతాయి? దేశంలోని అనాథాశ్రమాలు, వసతి గృహాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగికదాడులు ఎప్పుడు ఆగుతాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యూపీ, బిహార్‌లోని వసతి గృహాల్లో మహిళలు, మైనర్ బాలికలపై రేప్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. అనాథాశ్రమాల్లో లైంగికదాడులపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. యూపీలోని పాల్గఢ్, ప్రతాప్‌గఢ్ బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతి గృహాల్లో మహిళలు, మైనర్ బాలికపై జరిగిన దారుణాలపై కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమికస్ క్యూరీగా పనిచేస్తున్న న్యాయవాది అపర్ణా భట్ స్పందిస్తూ.. దేశంలోని చిన్నారుల సంరక్షణా కేంద్రాలు(సీసీఐ)తో పాటు సోషల్ ఆడిట్ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుందని విన్నవించారు. అనంతరం కేంద్రం, హోంశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ న్యాయవాదులు కోర్టు ముందు హాజరుకాగా, ఇంతమంది ఎందుకొచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం స్త్రీ, శిశుసంక్షేమ శాఖ న్యాయవాది హాజరైతే సరిపోతుందని∙వ్యాఖ్యానించింది. -
ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు
-
న్యాయం దక్కినట్టేనా?
తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో ఊహించని మలుపులు తిరిగి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ బాలిక ఆరుషి, వాచ్‌మన్ హేమరాజ్‌ల హత్య కేసు చివరకు దోషులెవరో తేలకుండానే ముగిసిపోయింది. ఈ కేసులో ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లే ప్రధాన నిందితులంటూ ఆరోపించిన సీబీఐ చివరకు దాన్ని నిరూపించలేకపోవడంతో... అలహాబాద్ హైకోర్టు గురువారం ఆ దంపతులిద్దరినీ ‘సంశయ లబ్ధి’ కింద విడుదల చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు సందేహాతీతమైన, సహేతుకమైన సాక్ష్యాధారాలేవీ సమర్పించ లేకపోయారని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశంలోనూ, వెలుపలా దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారి, ఎన్నో సంక్లిష్టతలతో నిండి ఉన్న కేసుల తీరు తెన్నులను... వాటిని చాకచక్యంగా పరిష్కరించిన వైనాన్ని పోలీసు శిక్షణా సంస్థల్లో అధ్యయనం చేయిస్తారు. దర్యాప్తు ఎలా చేయకూడదో, సాక్ష్యాధారాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో, వాటినెంత ప్రాణప్రదంగా చూసుకోవాలో వివ రించడానికి ఆరుషి హత్య కేసును ఇప్పుడా జాబితాలో చేర్చక తప్పదు. ఎందుకంటే తొలుత దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులుగానీ, అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా అందరూ భావించే సీబీఐ సిబ్బందికానీ ఆదినుంచీ తప్పులు చేస్తూ పోయారు. మీడియాకు లీకులివ్వడంలో చూపిన ఉత్సాహంలో రవ్వంతైనా దర్యాప్తుపై చూపలేకపోయారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు తొలుత ఆరుషిని వాచ్మాన్ హత్య చేసి పారిపోయి ఉంటాడని నిర్ధారణకొచ్చారు. ఆ ఇంటిపైనున్న గదిలో నివాసం ఉంటున్నా డన్నారు గనుక అక్కడ సోదా చేద్దామనుకున్నా ఆ గదికి దారితీసే మెట్లవైపు తలుపు తాళం వేసి ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. హేమరాజ్ కోసం అంతటా వెతికి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు ఆ మర్నాడొచ్చి తలుపు తాళం బద్దలుకొట్టారు. తీరాచూస్తే అక్కడి టెర్రస్‌పైనే అతని శవం పడి ఉంది. ఆ పక్కనున్న గదిలో రక్తపు మరకలున్న దిండు దొరికింది. అనంతరకాలంలో ఆ రక్తపు మరకలు హేమరాజ్‌వేనని నిర్ధారణైంది. ఆరుషికి సంబంధించి మెడ కోసిన ఆనవాలు తప్ప నెత్తురొలికిన జాడలేదు. అంటే ఆ రక్తపు మరకల్ని ఎవరో శుభ్రం చేసి ఉండాలి. అలా చేసిందెవరో పోలీసులు తేల్చలేకపోయారు. తల్వార్ దంపతులే ఆ పని చేసి ఉండొచ్చునని భావించినా అందుకు ఎలాంటి ఆధా రాలనూ చూపలేకపోయారు. రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ, ఇంట్లో పనిచేసే రాజ్‌కుమార్, విజయ్‌మండల్ అనే మరో ఇద్దరు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఏమీ రాబట్టలేకపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా ఫలితం లేకపోయింది. ఆరుషి కేసులో మొత్తం మూడు దర్యాప్తులు జరిగాయి. అందులో ఒకటి యూపీ పోలీసులది కాగా, మరో రెండింటిని సీబీఐకి చెందిన రెండు వేర్వేరు బృందాలు చేపట్టాయి. చిత్రమేమంటే– రెండూ వేర్వేరు నిర్ధారణలకొచ్చాయి. హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెనువెంటనే స్వాధీనం చేసుకోనందువల్ల నేరస్తుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషినీ, హేమ రాజ్‌నూ అభ్యంతరకర పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక ఆ బాలికను ‘పరువు హత్య’ చేశారని ఆరోపించినా ఆరుషి గదిలో ఆమె శవం మాత్రమే ఎందుకున్నదో, హేమరాజ్ శవం టెర్రస్‌పైకి ఎలా చేరిందో సీబీఐ చెప్పలేకపోయింది. ఆరుషి గదికి బయట తాళం వేసి ఉందని, దాని తాళం చెవి తల్వార్ దంపతుల దగ్గరే ఉంటుందని, వేరేవారెవరూ ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ గదికి వేరే తలుపు కూడా ఉందని, పైగా ఆరుషి గదిలోకి దుండగులు బాత్రూం ద్వారా ప్రవేశించి ఉండొచ్చునని తల్లిదండ్రులు చెప్పినదానికి వారి దగ్గర జవాబు లేదు. నార్కో అనాలిసిస్ పరీక్షలు సైతం ఉన్న గందరగోళాన్ని మరింత పెంచాయి. కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌మండల్ నార్కో అనాలిసిస్ పరీక్షల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరికి వారు మరొకరు ఈ హత్యకు కారకులని చెప్పారు. వారు చెప్పిన అంశాలతో సరిపోలే సాక్ష్యాధారాలేవీ పోలీసులకు లభించలేదు. తమ సచ్ఛీలత నిరూపించుకోవడానికి ఆరుషి తల్లిదండ్రులు కూడా అన్ని పరీక్షలకూ సిద్ధపడ్డారు. కానీ అందులో ఏమీ తేలలేదు. ఇలా ఈ కేసులో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నదని ‘నిరూపించడం’ కోసం ఆ కుటుంబాన్ని మీడియా బజారులో నిలబెట్టింది. అన్ని విలువలనూ వదిలిపెట్టి అనేక కథనాలను ప్రచారంలో పెట్టింది. రాజేష్ తల్వార్‌కు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉన్నదని ఒక కథనం చెబితే... ఆ దంపతులు కుమార్తెను ఒంటరిగా వదిలి విందుల పేరుతో ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవారని మరో కథనం ఏకరువు పెట్టింది. తొలుత ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఇందులో ఎలాంటి ఆధారాలూ లభించలేదని అంగీకరించింది. కానీ ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తున్నట్టు 2013 నవం బర్లో తెలిపింది. చిత్రమేమంటే ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు గనుక కేసు మూసేయాలని 2010 డిసెంబర్లో న్యాయస్థానాన్ని సీబీఐ అభ్యర్థిస్తే అందుకు అభ్యంతరం చెబుతూ అప్పీల్‌కెళ్లింది తల్వార్ దంపతులే. తీరా మరో మూడేళ్లకు వారే నేరస్తులంటూ న్యాయస్థానం శిక్షించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వివిధ సందర్భాల్లో వారు సాగించిన పోరాటం, పడిన మనో వేదన అంతా ఇంతా కాదు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు లభించడం మాట అటుంచి ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరకు తొమ్మిదేళ్లకు వారిద్దరూ నిర్దోషులుగా బయటికొచ్చారు గానీ... తమ కుమార్తె ఉసురు తీసిందెవరో మాత్రం తెలియలేదు. మన దర్యాప్తు సంస్థల పని తీరుకు, మన న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు సాగే వైనానికి ఆరుషి హత్య కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. -
ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు
అలహాబాద్: తొమ్మిదేళ్ల క్రితం సంచలన రేపిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమ్రాజ్ హత్య కేసుల్లో అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో కింది కోర్టు దోషులుగా తేల్చిన ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ తల్వార్లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సమర్పించిన ఆధారాలు వారిద్దరిని దోషులుగా నిర్ధారించేందుకు సరిపోవని తేల్చింది. దంతవైద్యులైన తల్వార్ దంపతులు ఘజియాబాద్ దస్నా జైలు నుంచి శుక్రవారం విడుదల కానున్నారు. ఆరుషి, హేమ్రాజ్ హత్యకేసుల్లో 2013లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు నుపుర్, రాజేశ్‌లకు జీవిత ఖైదు విధించింది. తీర్పు అనంతరం సీబీఐ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రకటించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ తల్వార్ దంపతులు చేసిన అప్పీలును బెంచ్ సమర్థించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్(సంశయ లాభం)కింద అప్పీలుదారులకు అనుకూలంగా తీర్పునిచ్చేందుకు ఈ కేసు తగినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మాకు న్యాయం జరిగింది: తల్వార్ దంపతులు ఈ వార్త తెలియగానే తల్వార్ దంపతులు ఎంతో ఆనందించారని దస్నా జైలు జైలర్ దధిరామ్ మౌర్య పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగిందని తల్వార్ దంపతులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. ‘ రోజూలాగే వారిద్దరు తమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తీర్పు గురించి చెప్పగానే ఆనందబాష్పాలతో న్యాయం జరిగిందని నుపుర్ చెప్పారు’ అని మౌర్య తెలిపారు.విడుదల అనంతరం తల్వార్ దంపతులకు వ్యక్తిగత గోప్యత ఇవ్వాలని తల్వార్ దంపతుల తరఫు న్యాయవాది రెబెకా జాన్ కోరారు. నాడు సీబీఐకి అప్పగించిన మాయావతి గొంతు కోయడంతో మే 2008న నోయిడాలోని తన ఇంట్లో ఆరుషి(14) హత్యకు గురైంది. ఇంటి పనిమనిషి హేమ్రాజ్ మృతదేహాన్ని ఇంటి టెర్రస్‌పై కనుగొన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ఉత్తరప్రదేశ్ పోలీసులపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి మాయవతి కేసును సీబీఐకి అప్పగించారు. అయితే సీబీఐ అధికారి అరుణ్ కుమార్ విచారణ తీరుపై విమర్శల నేపథ్యంలో కేసు విచారణను 2009లో మరో అధికారి నీలభ్ కిశోర్ చేపట్టారు. కేసులో మలుపులెన్నో.. ► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు ► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు ► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు ► మే 17: ఇంటి పై కప్పుపై హేమ్రాజ్ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ► మే 23: కేసులో ప్రధాన నిందితుడిగా ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు ► జూన్ 1: సీబీఐ చేతికి కేసు విచారణ ► జూన్ 13: తల్వార్ దంపతుల ఇంట్లో పనిచేసే కృష్ణను అరెస్టు చేసిన సీబీఐ ► డిసెంబర్ 29: తుది దర్యాప్తు నివేదికను ఘజియాబాద్ సీబీఐ కోర్టుకు సమర్పించిన సీబీఐ. తల్వార్ ఇంట్లో పనిచేసేవారికి క్లీన్చిట్.. ఆరుషి తల్లిదండ్రులపై అనుమానం ► ఫిబ్రవరి 9, 2011: సీబీఐ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఆరుషి తల్లిదండ్రులపై హత్య, సాక్ష్యాధారాలు తారుమారు ఆరోపణలపై విచారణ కొనసాగించాలని సీబీఐ కోర్టు ఆదేశం ► నవంబర్, 2013: జంట హత్యల కేసులో రాజేశ్, నుపుర్‌లను దోషులుగా తేల్చిన ఘజియాబాద్ సీబీఐ కోర్టు.. జీవిత ఖైదు విధింపు ► సెప్టెంబర్ 7, 2017: దంపతుల అప్పీలుపై తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు ► అక్టోబర్ 12: రాజేశ్, నుపుర్ తల్వార్లను నిర్దోషులుగా విడుదల చేస్తూ హైకోర్టు తీర్పు -
బోనెక్కిన కడుపుతీపి!
విశ్లేషణ బొజ్జా తారకం, సీనియర్ న్యాయవాది కన్నకూతురు గొంతుకోసి చం పారనే అభియోగంపై ఘజియా బాద్ సెషన్స్ కోర్టు తల్లిదండ్రు లిద్దరికీ యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఆరుషిని చంపిన రోజునే వాళ్లింట్లో పని వానిగా ఉన్న హేమ్రాజ్ని కూడా అదే మాదిరిగా గొంతుకోసి చంపా రనే అభియోగం మీద వారికి యావజ్జీవ కారాగారశిక్ష పడింది. వీటికి అదనంగా, ఆధా రాలను కనపడనీయకుండా చేశారని ఐదు సంవత్సరాల జైలు శిక్ష, పోలీసులను తప్పుదారి పట్టించినందుకు మరో రెండేళ్ల శిక్ష తండ్రిపై విధించి, జరిమానా కూడా విధించిం ది. అరుదైన కేసుల్లో అరుదైన కేసు కిందకి ఇది రాదని సెషన్స్ జడ్జి అభిప్రాయపడి మరణశిక్ష విధించలేదు. 2008లో జరిగిన ఈ రెండు హత్యలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. రాజేష్ తల్వార్, నూపూర్లకు ఆరుషి ఒక్క గానొక్క కూతురు. 14 ఏళ్ల వయస్సు. ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థిని. దంపతులిద్దరూ దంతవైద్యులు. ఉన్న ఒక్క కూతురినీ చంపారంటే ఎవరికీ నమ్మశక్యం కాలేదు. అనుమానాల రాత్రి... 2008 మే, 15న వారిని ఆఖరిగా చూసింది కారు డ్రైవర్. రాత్రి తాళాలు అప్పజెప్పి వెళ్లాడు. ఇంట్లో తల్వార్ దంపతులు, ఆరుషి, పని సహాయకుడు హేమ్రాజ్ -ఆ నలుగురే ఉన్నారు. ఆరుషి తన గదిలో, ఆమె తల్లిదండ్రు లు వారి గదిలో పడుకున్నారు. హేమ్రాజ్ అదే ఇంట్లో వేరే గదిలో పడుకున్నాడు. ఆరుషి తలుపు వేసుకుంటే తాళం దానంతట అదే పడిపోతుంది. తాళం లేకుండా లోపలి నుంచి తలుపు తీయవచ్చు గాని బయట నుంచి తీయాలం టే తాళం చెవి ఉండాలి. అది తల్వార్ దంపతుల వద్ద ఉంటుంది. 16 ఉదయం ఇంటి పని చేసే ఆమె వచ్చేటప్పటికి తలుపు తీసిలేదు. ఆమె బెల్ నొక్కింది. నూపూర్ వచ్చి తాళం చెవి కింద ఉందేమో చూడమని పంపిస్తూ, హేమ్ రాజ్ పాలు తేవటానికి వెళ్లి ఉంటాడని చెప్పింది. పని మనిషి కిందికి వెళ్లిందో లేదో ఆమెను మళ్లీ పైకి పిలిచి తాళం చెవి ఉన్నది రమ్మన్నది. ఆరుషి గది తెరిచి చూసే సరికి మంచం మీద చనిపోయి ఉన్నది. హేమ్రాజ్ కనబడ లేదు. ఆరుషి గొంతుకోసి ఉన్నది. ఆమె పెనుగులాడుతూ చనిపోయిన ఆనవాళ్లు లేవు. ఒక్కగా నొక్క కూతురు అంత దారుణంగా చంపబడి ఉంటే ఆరుషి తల్లిగాని తండ్రిగాని చలించలేదు. తల్లి కళ్లలో నుంచి ఒక్క చుక్క కూడా రాల లేదు. ఆరుషి శవాన్ని తుడిచినట్టు కనపడింది. రాజేష్ పోలీసు రిపోర్టు ఇచ్చాడు. తల్లిదండ్రులే... 17వ తేదీన హేమ్రాజ్ శవం అదే ఇంట్లో మేడపైన అట్ట పెట్టెలో కనపడింది. అతని గొంతుక కూడా కోసినట్టు ఉన్నది. కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తులో మరో ముగ్గురిని అనుమానించారు గాని తర్వాత విడిచి పెట్టే శారు. మొదటి బృందం చేసిన దర్యాప్తు సంతృప్తిగా లేదని రెండో బృందాన్ని నియమించారు. ఈ బృందం తల్వార్ దంపతులే హత్య చేసి ఉంటారని అనుకున్నారు గాని దర్యాప్తును ముగించమన్నారు. దానికి మేజిస్ట్రేట్ అంగీక రించక, దర్యాప్తు కొనసాగించమని ఉత్తరువు ఇచ్చాడు. దానిపై తల్వార్ దంపతులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తల్వార్ దంపతులకు చుక్కెదురకాగా, సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా దర్యాప్తు జరగవలసిందేనని ఉత్తరువు ఇచ్చింది. చివరికి ఆ దంపతులే కూతుర్ని చంపా రని నిర్ధారించారు. ఏ కేసుకైనా ఆధారాలు, సాక్ష్యాలు ఉండాలి. ఆధారాలు దర్యాప్తు చేసే వారికి దొరుకుతాయి. సాక్ష్యాలు చూసిన వాళ్లు చెబుతారు. దీనిని ప్రత్యక్ష సాక్ష్యం అంటారు. రెండో దానిని పరిస్థితుల దృష్ట్యా సాక్ష్యం అంటారు. ఆరుషి కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. నేరం చేసిన వారికి నోరు మెదపకుండా ఉండే హక్కు ఉన్నది. వాళ్లేమి మాట్లాడటం లేదు కాబట్టి వారే చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చే ఆస్కారం లేదు. ఆధారాలతోనే... మరో ఆధారం చనిపోయిన వారిని ఆఖరిగా, ఎక్కడ, ఎవరు చూశారనేది. హత్యలు జరిగిన రాత్రి ఇంట్లో నలు గురే ఉన్నారు. ఐదో వ్యక్తి ప్రవేశించటానికి ఏ ఆస్కారమూ లేదు. తలుపులో, తాళమో బద్దలు గొట్టి ఎవరో ప్రవే శించారు అని చెప్పటానికి కూడా ఆస్కారం లేదు. హేమ్ రాజ్ శవం తన గదిలో కాక మేడపైన కనపడింది. ఎవరో మెట్ల మీద నుంచి పైకి లాక్కొని వెళ్లి ఉంటారు. అయితే మెట్ల మీదగాని, ఆరుషి మంచం మీద గాని రక్తపు మర కలు లేవు. హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారు. ఇంట్లో ఉన్న నలుగురిలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇద్దరూ హత్య ఆనవాళ్లు లేకుండా తుడిచివేశారు. ఆరుషి మర్మావ యంలో తెల్లని ద్రవం కారిన ఆనవాళ్లున్నాయి. ఇద్దరి శరీ రంపై కట్టెతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. రాజేష్ తల్వార్ దగ్గర ఉండే గోల్ఫ్ కట్టెలలో ఒకటి కనపడలేదని దర్యా ప్తులో తేలింది. అది రాజేశ్ తర్వాత తెచ్చి ఇచ్చాడు. దాని పైనా రక్తపు మరకలు లేవు. ఆరుషి, హేమ్‌రాజ్‌ల గొంతు కోసిన పరికరం వైద్యులు శస్త్ర చికిత్సకు వాడే పదునైన అం చుగల కత్తి. వాటినీ జప్తు చేశారు. ఆ ఇద్దరి వైపే... ప్రత్యక్ష సాక్ష్యం లేకపోయినా హత్య కేసులో శిక్ష వేయవచ్చని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెబుతూ వస్తు న్నది. అయితే ఆధారాలు గట్టిగా ఉండాలి. కోర్టు ముం దుకు తెచ్చే సందేహాలు హేతుబద్ధమైనవిగా ఉండాలి. కేసులో వచ్చే పరిస్థితులన్నీ ఒక గొలుసులా పేర్చాలి. ఏ ఒక్క లింకూ తప్పిపోకూడదు, తెగిపోకూడదు. ‘మను షులు అబద్ధమాడవచ్చు కాని పరిస్థితులు అబద్ధం చెప్ప వు’ అనేది మరో న్యాయసూత్రం. ఇంట్లో నలుగురే ఉండ టం, బయట నుంచి ఎవరూ రావటానికి ఆస్కారం లేకపో వటం, హేమ్రాజ్ శవాన్ని ఎవరో మేడ మీదికి లాక్కొని వెళ్లటం, ఆరుషి మంచం మీద చనిపోయి ఉండటం, ఆ ఇద్దరి గొంతులూ పదునైన పరికరంతో కోసి ఉండటం, హేమ్రాజ్ పాలు తేవడానికి వెళ్లాడని చెప్పటం, తల్లిదం డ్రుల అసహజ ప్రవర్తన- ఇటువంటివే హంతకులు తల్లి దండ్రులే అని చూపుతున్నాయి. సెషన్స్ జడ్జి తన తీర్పుకు ఇరవై ఆరు ప్రధానమైన ఆధారాలు చూపారు. ధర్మసందే హాలకు తాలులేదని కూడా పేర్కొన్నారు. హత్యలు చేయ టానికి ఉద్దేశమేమిటో జడ్జి నిర్ధారించలేదు. పరిస్థితుల ఆధారంగా తేల్చిన సందర్భంలో హత్య చేయటానికి ఉద్దేశ మేమిటో చెప్పాలి. అయితే ఉద్దేశం చెప్పనంత మాత్రాన ఇతర పరిస్థితులపై ఆధారపడిన సాక్ష్యాన్ని తిరస్కరించ టానికి వీలులేదని సుప్రీం కోర్టు చాలాసార్లు చెబుతూ వస్తున్నది. తల్వార్ దంపతుల ప్రవర్తన జడ్జికి ఎన్నో అనుమానాలు రేపింది. వేరే ఎవరైనా హత్యలు చేసి వెళ్లిపోయారంటే ఆ దాఖలాలు లేవు. హత్య చేసి ఆధారాలు దొరక్కుండా వెళ్లి పోయారనుకుంటే, మరి హేమ్రాజ్ శవం మేడ మీదికి ఎలా వెళ్లింది? అట్ట పెట్టెలో ఎవరు పెట్టారు? ఆరుషి ఒంటిమీద రక్తపు మరకలు ఏవీ లేకుండా తుడిచి శుభ్రం చేసి తెల్లటి దుప్పటి కప్పిందెవరు? ఇవన్నీ చేయటం లోపల ఉన్నవారికే సాధ్యంకాని బయటివాళ్లకు కాదు. వీటికి సంతృప్తికరంగా తల్వార్ దంపతులు న్యాయ స్థానం ముందు సమాధానం చెప్పుకోలేకపోయారు కాబట్టి వారిని దోషులని నిర్ధారించటానికి వీలులేదు. ఎందుకంటే మౌనంగా ఉండిపోయే హక్కు ముద్దాయిలకు ఉంటుంది. కాని కొన్ని పరిస్థితులను చెప్పగలగటం ముద్దాయిల పరిధిలోనే ఉంటుంది, వాటి వివరాలు ముద్దాయిలకు మాత్రమే తెలుస్తాయి. అటువంటి సంద ర్భాలలో ముద్దాయిలు మౌనంగా ఉండటాన్ని కోర్టులు అంగీకరించవు. అయితే నేర నిరూపణ బాధ్యత ప్రాసిక్యూ షన్ మీదనే ఉంటుంది. కాని కొన్ని సందర్భాలలో ఒక విష యం ఎలా జరిగిందో, జరిగి ఉంటుందో చెప్పటం సాధ్యం కాదు. అటువంటి సందర్భాలలో ‘‘ఇది ఇలా జరిగి ఉం టుందనే అభిప్రాయానికి’’ రావచ్చు. దీనిని చట్టం అంగీక రించింది. దీనినే సుప్రీంకోర్టు ఎన్నోసార్లు సమర్థించింది. ఈ సూత్రాల ఆధారంగా తల్వార్ దంపతులను సెషన్స్ జడ్జి దోషులుగా ధృవీకరించారు. ఈ కేసు ఓ సవాలు... జడ్జి కూడా మానవమాత్రుడే. అతనికీ కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఉద్దేశాలు, ప్రపంచం, సమాజం పట్ల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆయన ఏ సమాజం నుంచి వచ్చాడో ఆ సమాజపు విలువలు వెంటాడుతూ ఉంటా యి. జడ్జి చూసేది భారతీయ సమాజంలో వస్తున్న కేసు లు. జడ్జి పరిశీలించేది ఆంగ్ల న్యాయసూత్రాల ఆధారంగా ఏర్పడిన పద్ధతి. ఈ రెండూ చాలాసార్లు పరస్పరం సంఘర్షించుకుంటాయి. అటువంటి సందర్భాలలో జడ్జి ఎటూ తేల్చుకోలేక ‘‘ధర్మ సందేహాల’’కు అతీతంగా నేరం నిరూపణ కాలేదనే న్యాయసూత్రాన్ని ఆశ్రయిస్తాడు. ‘‘ఒక నిర్దోషికి శిక్ష వేయటం కంటే వెయ్యి మంది దోషులను విడిచిపెట్టేయటం మంచిదనే’’ ధర్మసూత్రం ప్రకారం దోషిని విడిచిపెట్టేస్తారు. ఆరుషి కేసు విచారించిన జడ్జికి ఏ ధర్మసందేహమూ రాలేదు. అందుకనే తల్వార్ దంపతు లకు యావజ్జీవ కారాగారశిక్ష విధించాడు. ఆయన తీర్పు కోసం ఆధారపడిన న్యాయసూత్రాలను, సాక్ష్యాధారాలను పైకోర్టులు ఎలా పరిశీలిస్తాయో చూడాలి. ఆరుషి కేసు దర్యాప్తు విభాగానికి, న్యాయ విచారణా విభాగానికి, సాక్ష్యాధారాల నిర్ణయ విధానాలకు ఓ సవాలు. ఈ కేసు మన న్యాయ సూత్రాలను పునర్విమర్శించుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతుంది. -
ఇటు ఉద్విగ్నత.. అటు మీడియా హడావుడి
ఘజియాబాద్: ఆరుషి హత్య కేసులో కోర్టు తీర్పు పురస్కరించుకుని పరిణామాలను కవర్ చేసేందుకు సోమవారం మీడియా పోటీలు పడింది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ మీడియా ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు వద్ద మోహరించింది. అధిక సంఖ్యలో ప్రజలు సైతం తీర్పు వినేందుకు ఆసక్తి ప్రదర్శించారు. తీర్పు విన్నతర్వాత కుప్పకూలిపోయిన తల్వార్ దంపతులు కొద్దిసేపటికే తేరుకున్నారు. నూపుర్ తల్లిదండ్రులు సహా మిగతా కుటుంబసభ్యులు కూడా తల్వార్ దంపతులను ఓదార్చారు. నూపుర్‌ను దస్నా జైలుకు తరలించేందుకు సిద్ధమైన మహిళా కానిస్టేబుళ్లు విలువైన వస్తువుల్ని బంధువులకు అప్పగించాల్సిందిగా ఆమెకు సూచించారు. ఓ వైపు సీబీఐ కోర్టులో తీర్పు ప్రకటన ప్రక్రియ, అనంతర పరిణామాలు కొనసాగగా కోర్టు బయట మీడియా సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు గుమిగూడారు. భారీ బందోబస్తు ఉండటంతో కొందరు ఫొటో జర్నలిస్టులు చెట్లు, భవనాలపైకి ఎక్కి కోర్టు లోపలి దృశ్యాలను చిత్రించేందుకు యత్నించారు. -
ఆరుషి తల్లిదండ్రుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో తల్లిదండ్రుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కోర్టులో ఆరుషి తల్లిదండ్రులు నూపుర్, రాజేష్ తల్వార్లకు మరోసారి చుక్కెదురైంది. జర్నలిస్టులను సాక్షులుగా పరిగణించాలన్న తల్వార్ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆరుషి హత్య కేసులో సాక్షులను ప్రశ్నించాలన్న తల్వార్ దంపతుల విజ్ఞప్తి సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎడిజి(శాంతి భద్రతలు), సిబిఐ సంయుక్త సంచాలకులు అరుణ్ కుమార్‌లతో పాటు అదనంగా మరో 14 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుగా కొట్టివేసింది. దాంతో వారు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది. నిందితుడిగా అనుమానించిన హేమ్రాజ్ కూడా ఆ తరువాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు పట్ల ఆసక్తి చూపుతున్నారు.