బోనెక్కిన కడుపుతీపి!
విశ్లేషణ
బొజ్జా తారకం, సీనియర్ న్యాయవాది
కన్నకూతురు గొంతుకోసి చం పారనే అభియోగంపై ఘజియా బాద్ సెషన్స్ కోర్టు తల్లిదండ్రు లిద్దరికీ యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఆరుషిని చంపిన రోజునే వాళ్లింట్లో పని వానిగా ఉన్న హేమ్‌రాజ్‌ని కూడా అదే మాదిరిగా గొంతుకోసి చంపా రనే అభియోగం మీద వారికి యావజ్జీవ కారాగారశిక్ష పడింది. వీటికి అదనంగా, ఆధా రాలను కనపడనీయకుండా చేశారని ఐదు సంవత్సరాల జైలు శిక్ష, పోలీసులను తప్పుదారి పట్టించినందుకు మరో రెండేళ్ల శిక్ష తండ్రిపై విధించి, జరిమానా కూడా విధించిం ది. అరుదైన కేసుల్లో అరుదైన కేసు కిందకి ఇది రాదని సెషన్స్ జడ్జి అభిప్రాయపడి మరణశిక్ష విధించలేదు. 2008లో జరిగిన ఈ రెండు హత్యలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. రాజేష్ తల్వార్, నూపూర్‌లకు ఆరుషి ఒక్క గానొక్క కూతురు. 14 ఏళ్ల వయస్సు. ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థిని. దంపతులిద్దరూ దంతవైద్యులు. ఉన్న ఒక్క కూతురినీ చంపారంటే ఎవరికీ నమ్మశక్యం కాలేదు.
అనుమానాల రాత్రి...
2008 మే, 15న వారిని ఆఖరిగా చూసింది కారు డ్రైవర్. రాత్రి తాళాలు అప్పజెప్పి వెళ్లాడు. ఇంట్లో తల్వార్ దంపతులు, ఆరుషి, పని సహాయకుడు హేమ్‌రాజ్ -ఆ నలుగురే ఉన్నారు. ఆరుషి తన గదిలో, ఆమె తల్లిదండ్రు లు వారి గదిలో పడుకున్నారు. హేమ్‌రాజ్ అదే ఇంట్లో వేరే గదిలో పడుకున్నాడు. ఆరుషి తలుపు వేసుకుంటే తాళం దానంతట అదే పడిపోతుంది. తాళం లేకుండా లోపలి నుంచి తలుపు తీయవచ్చు గాని బయట నుంచి తీయాలం టే తాళం చెవి ఉండాలి. అది తల్వార్ దంపతుల వద్ద ఉంటుంది.
16 ఉదయం ఇంటి పని చేసే ఆమె వచ్చేటప్పటికి తలుపు తీసిలేదు. ఆమె బెల్ నొక్కింది. నూపూర్ వచ్చి తాళం చెవి కింద ఉందేమో చూడమని పంపిస్తూ, హేమ్ రాజ్ పాలు తేవటానికి వెళ్లి ఉంటాడని చెప్పింది. పని మనిషి కిందికి వెళ్లిందో లేదో ఆమెను మళ్లీ పైకి పిలిచి తాళం చెవి ఉన్నది రమ్మన్నది. ఆరుషి గది తెరిచి చూసే సరికి మంచం మీద చనిపోయి ఉన్నది. హేమ్‌రాజ్ కనబడ లేదు. ఆరుషి గొంతుకోసి ఉన్నది. ఆమె పెనుగులాడుతూ చనిపోయిన ఆనవాళ్లు లేవు. ఒక్కగా నొక్క కూతురు అంత దారుణంగా చంపబడి ఉంటే ఆరుషి తల్లిగాని తండ్రిగాని చలించలేదు. తల్లి కళ్లలో నుంచి ఒక్క చుక్క కూడా రాల లేదు. ఆరుషి శవాన్ని తుడిచినట్టు కనపడింది. రాజేష్ పోలీసు రిపోర్టు ఇచ్చాడు.
తల్లిదండ్రులే...
17వ తేదీన హేమ్‌రాజ్ శవం అదే ఇంట్లో మేడపైన అట్ట పెట్టెలో కనపడింది. అతని గొంతుక కూడా కోసినట్టు ఉన్నది. కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తులో మరో ముగ్గురిని అనుమానించారు గాని తర్వాత విడిచి పెట్టే శారు. మొదటి బృందం చేసిన దర్యాప్తు సంతృప్తిగా లేదని రెండో బృందాన్ని నియమించారు. ఈ బృందం తల్వార్ దంపతులే హత్య చేసి ఉంటారని అనుకున్నారు గాని దర్యాప్తును ముగించమన్నారు. దానికి మేజిస్ట్రేట్ అంగీక రించక, దర్యాప్తు కొనసాగించమని ఉత్తరువు ఇచ్చాడు.
దానిపై తల్వార్ దంపతులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తల్వార్ దంపతులకు చుక్కెదురకాగా, సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా దర్యాప్తు జరగవలసిందేనని ఉత్తరువు ఇచ్చింది. చివరికి ఆ దంపతులే కూతుర్ని చంపా రని నిర్ధారించారు. ఏ కేసుకైనా ఆధారాలు, సాక్ష్యాలు ఉండాలి. ఆధారాలు దర్యాప్తు చేసే వారికి దొరుకుతాయి. సాక్ష్యాలు చూసిన వాళ్లు చెబుతారు. దీనిని ప్రత్యక్ష సాక్ష్యం అంటారు. రెండో దానిని పరిస్థితుల దృష్ట్యా సాక్ష్యం అంటారు. ఆరుషి కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. నేరం చేసిన వారికి నోరు మెదపకుండా ఉండే హక్కు ఉన్నది. వాళ్లేమి మాట్లాడటం లేదు కాబట్టి వారే చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చే ఆస్కారం లేదు.
ఆధారాలతోనే...
మరో ఆధారం చనిపోయిన వారిని ఆఖరిగా, ఎక్కడ, ఎవరు చూశారనేది. హత్యలు జరిగిన రాత్రి ఇంట్లో నలు గురే ఉన్నారు. ఐదో వ్యక్తి ప్రవేశించటానికి ఏ ఆస్కారమూ లేదు. తలుపులో, తాళమో బద్దలు గొట్టి ఎవరో ప్రవే శించారు అని చెప్పటానికి కూడా ఆస్కారం లేదు. హేమ్ రాజ్ శవం తన గదిలో కాక మేడపైన కనపడింది.
ఎవరో మెట్ల మీద నుంచి పైకి లాక్కొని వెళ్లి ఉంటారు. అయితే మెట్ల మీదగాని, ఆరుషి మంచం మీద గాని రక్తపు మర కలు లేవు. హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారు. ఇంట్లో ఉన్న నలుగురిలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇద్దరూ హత్య ఆనవాళ్లు లేకుండా తుడిచివేశారు. ఆరుషి మర్మావ యంలో తెల్లని ద్రవం కారిన ఆనవాళ్లున్నాయి. ఇద్దరి శరీ రంపై కట్టెతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. రాజేష్ తల్వార్ దగ్గర ఉండే గోల్ఫ్ కట్టెలలో ఒకటి కనపడలేదని దర్యా ప్తులో తేలింది. అది రాజేశ్ తర్వాత తెచ్చి ఇచ్చాడు. దాని పైనా రక్తపు మరకలు లేవు. ఆరుషి, హేమ్‌రాజ్‌ల గొంతు కోసిన పరికరం వైద్యులు శస్త్ర చికిత్సకు వాడే పదునైన అం చుగల కత్తి. వాటినీ జప్తు చేశారు.
ఆ ఇద్దరి వైపే...
ప్రత్యక్ష సాక్ష్యం లేకపోయినా హత్య కేసులో శిక్ష వేయవచ్చని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెబుతూ వస్తు న్నది. అయితే ఆధారాలు గట్టిగా ఉండాలి.
కోర్టు ముం దుకు తెచ్చే సందేహాలు హేతుబద్ధమైనవిగా ఉండాలి. కేసులో వచ్చే పరిస్థితులన్నీ ఒక గొలుసులా పేర్చాలి. ఏ ఒక్క లింకూ తప్పిపోకూడదు, తెగిపోకూడదు. ‘మను షులు అబద్ధమాడవచ్చు కాని పరిస్థితులు అబద్ధం చెప్ప వు’ అనేది మరో న్యాయసూత్రం. ఇంట్లో నలుగురే ఉండ టం, బయట నుంచి ఎవరూ రావటానికి ఆస్కారం లేకపో వటం, హేమ్‌రాజ్ శవాన్ని ఎవరో మేడ మీదికి లాక్కొని వెళ్లటం, ఆరుషి మంచం మీద చనిపోయి ఉండటం, ఆ ఇద్దరి గొంతులూ పదునైన పరికరంతో కోసి ఉండటం, హేమ్‌రాజ్ పాలు తేవడానికి వెళ్లాడని చెప్పటం, తల్లిదం డ్రుల అసహజ ప్రవర్తన- ఇటువంటివే హంతకులు తల్లి దండ్రులే అని చూపుతున్నాయి.
సెషన్స్ జడ్జి తన తీర్పుకు ఇరవై ఆరు ప్రధానమైన ఆధారాలు చూపారు. ధర్మసందే హాలకు తాలులేదని కూడా పేర్కొన్నారు. హత్యలు చేయ టానికి ఉద్దేశమేమిటో జడ్జి నిర్ధారించలేదు. పరిస్థితుల ఆధారంగా తేల్చిన సందర్భంలో హత్య చేయటానికి ఉద్దేశ మేమిటో చెప్పాలి. అయితే ఉద్దేశం చెప్పనంత మాత్రాన ఇతర పరిస్థితులపై ఆధారపడిన సాక్ష్యాన్ని తిరస్కరించ టానికి వీలులేదని సుప్రీం కోర్టు చాలాసార్లు చెబుతూ వస్తున్నది.
తల్వార్ దంపతుల ప్రవర్తన జడ్జికి ఎన్నో అనుమానాలు రేపింది. వేరే ఎవరైనా హత్యలు చేసి వెళ్లిపోయారంటే ఆ దాఖలాలు లేవు. హత్య చేసి ఆధారాలు దొరక్కుండా వెళ్లి పోయారనుకుంటే, మరి హేమ్‌రాజ్ శవం మేడ మీదికి ఎలా వెళ్లింది? అట్ట పెట్టెలో ఎవరు పెట్టారు? ఆరుషి ఒంటిమీద రక్తపు మరకలు ఏవీ లేకుండా తుడిచి శుభ్రం చేసి తెల్లటి దుప్పటి కప్పిందెవరు? ఇవన్నీ చేయటం లోపల ఉన్నవారికే సాధ్యంకాని బయటివాళ్లకు కాదు.
వీటికి సంతృప్తికరంగా తల్వార్ దంపతులు న్యాయ స్థానం ముందు సమాధానం చెప్పుకోలేకపోయారు కాబట్టి వారిని దోషులని నిర్ధారించటానికి వీలులేదు. ఎందుకంటే మౌనంగా ఉండిపోయే హక్కు ముద్దాయిలకు ఉంటుంది.
కాని కొన్ని పరిస్థితులను చెప్పగలగటం ముద్దాయిల పరిధిలోనే ఉంటుంది, వాటి వివరాలు ముద్దాయిలకు మాత్రమే తెలుస్తాయి. అటువంటి సంద ర్భాలలో ముద్దాయిలు మౌనంగా ఉండటాన్ని కోర్టులు అంగీకరించవు. అయితే నేర నిరూపణ బాధ్యత ప్రాసిక్యూ షన్ మీదనే ఉంటుంది. కాని కొన్ని సందర్భాలలో ఒక విష యం ఎలా జరిగిందో, జరిగి ఉంటుందో చెప్పటం సాధ్యం కాదు. అటువంటి సందర్భాలలో ‘‘ఇది ఇలా జరిగి ఉం టుందనే అభిప్రాయానికి’’ రావచ్చు. దీనిని చట్టం అంగీక రించింది. దీనినే సుప్రీంకోర్టు ఎన్నోసార్లు సమర్థించింది. ఈ సూత్రాల ఆధారంగా తల్వార్ దంపతులను సెషన్స్ జడ్జి దోషులుగా ధృవీకరించారు.
ఈ కేసు ఓ సవాలు...
జడ్జి కూడా మానవమాత్రుడే. అతనికీ కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఉద్దేశాలు, ప్రపంచం, సమాజం పట్ల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆయన ఏ సమాజం నుంచి వచ్చాడో ఆ సమాజపు విలువలు వెంటాడుతూ ఉంటా యి. జడ్జి చూసేది భారతీయ సమాజంలో వస్తున్న కేసు లు. జడ్జి పరిశీలించేది ఆంగ్ల న్యాయసూత్రాల ఆధారంగా ఏర్పడిన పద్ధతి. ఈ రెండూ చాలాసార్లు పరస్పరం సంఘర్షించుకుంటాయి. అటువంటి సందర్భాలలో జడ్జి ఎటూ తేల్చుకోలేక ‘‘ధర్మ సందేహాల’’కు అతీతంగా నేరం నిరూపణ కాలేదనే న్యాయసూత్రాన్ని ఆశ్రయిస్తాడు. ‘‘ఒక నిర్దోషికి శిక్ష వేయటం కంటే వెయ్యి మంది దోషులను విడిచిపెట్టేయటం మంచిదనే’’ ధర్మసూత్రం ప్రకారం దోషిని విడిచిపెట్టేస్తారు. ఆరుషి కేసు విచారించిన జడ్జికి ఏ ధర్మసందేహమూ రాలేదు. అందుకనే తల్వార్ దంపతు లకు యావజ్జీవ కారాగారశిక్ష విధించాడు. ఆయన తీర్పు కోసం ఆధారపడిన న్యాయసూత్రాలను, సాక్ష్యాధారాలను పైకోర్టులు ఎలా పరిశీలిస్తాయో చూడాలి. ఆరుషి కేసు దర్యాప్తు విభాగానికి, న్యాయ విచారణా విభాగానికి, సాక్ష్యాధారాల నిర్ణయ విధానాలకు ఓ సవాలు. ఈ కేసు మన న్యాయ సూత్రాలను పునర్విమర్శించుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతుంది.