అలహాబాద్: తొమ్మిదేళ్ల క్రితం సంచలన రేపిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమ్‌రాజ్ హత్య కేసుల్లో అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో కింది కోర్టు దోషులుగా తేల్చిన ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ తల్వార్‌లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సమర్పించిన ఆధారాలు వారిద్దరిని దోషులుగా నిర్ధారించేందుకు సరిపోవని తేల్చింది. దంతవైద్యులైన తల్వార్ దంపతులు ఘజియాబాద్ దస్నా జైలు నుంచి శుక్రవారం విడుదల కానున్నారు.
ఆరుషి, హేమ్‌రాజ్ హత్యకేసుల్లో 2013లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు నుపుర్, రాజేశ్‌లకు జీవిత ఖైదు విధించింది. తీర్పు అనంతరం సీబీఐ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రకటించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ తల్వార్ దంపతులు చేసిన అప్పీలును బెంచ్ సమర్థించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్(సంశయ లాభం)కింద అప్పీలుదారులకు అనుకూలంగా తీర్పునిచ్చేందుకు ఈ కేసు తగినదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మాకు న్యాయం జరిగింది: తల్వార్ దంపతులు
ఈ వార్త తెలియగానే తల్వార్ దంపతులు ఎంతో ఆనందించారని దస్నా జైలు జైలర్ దధిరామ్ మౌర్య పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగిందని తల్వార్ దంపతులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. ‘ రోజూలాగే వారిద్దరు తమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తీర్పు గురించి చెప్పగానే ఆనందబాష్పాలతో న్యాయం జరిగిందని నుపుర్ చెప్పారు’ అని మౌర్య తెలిపారు.విడుదల అనంతరం తల్వార్ దంపతులకు వ్యక్తిగత గోప్యత ఇవ్వాలని తల్వార్ దంపతుల తరఫు న్యాయవాది రెబెకా జాన్ కోరారు.
నాడు సీబీఐకి అప్పగించిన మాయావతి
గొంతు కోయడంతో మే 2008న నోయిడాలోని తన ఇంట్లో ఆరుషి(14) హత్యకు గురైంది. ఇంటి పనిమనిషి హేమ్‌రాజ్ మృతదేహాన్ని ఇంటి టెర్రస్‌పై కనుగొన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ఉత్తరప్రదేశ్ పోలీసులపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి మాయవతి కేసును సీబీఐకి అప్పగించారు. అయితే సీబీఐ అధికారి అరుణ్ కుమార్ విచారణ తీరుపై విమర్శల నేపథ్యంలో కేసు విచారణను 2009లో మరో అధికారి నీలభ్ కిశోర్ చేపట్టారు.
కేసులో మలుపులెన్నో..
► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు
► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు
► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు
► మే 17: ఇంటి పై కప్పుపై హేమ్‌రాజ్ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు
► మే 23: కేసులో ప్రధాన నిందితుడిగా ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు
► జూన్ 1: సీబీఐ చేతికి కేసు విచారణ
► జూన్ 13: తల్వార్ దంపతుల ఇంట్లో పనిచేసే కృష్ణను అరెస్టు చేసిన సీబీఐ
► డిసెంబర్ 29: తుది దర్యాప్తు నివేదికను ఘజియాబాద్ సీబీఐ కోర్టుకు సమర్పించిన సీబీఐ. తల్వార్ ఇంట్లో పనిచేసేవారికి క్లీన్‌చిట్.. ఆరుషి తల్లిదండ్రులపై అనుమానం
► ఫిబ్రవరి 9, 2011: సీబీఐ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఆరుషి తల్లిదండ్రులపై హత్య, సాక్ష్యాధారాలు తారుమారు ఆరోపణలపై విచారణ కొనసాగించాలని సీబీఐ కోర్టు ఆదేశం
► నవంబర్, 2013: జంట హత్యల కేసులో రాజేశ్, నుపుర్‌లను దోషులుగా తేల్చిన ఘజియాబాద్ సీబీఐ కోర్టు.. జీవిత ఖైదు విధింపు
► సెప్టెంబర్ 7, 2017: దంపతుల అప్పీలుపై తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
► అక్టోబర్ 12: రాజేశ్, నుపుర్ తల్వార్‌లను నిర్దోషులుగా విడుదల చేస్తూ హైకోర్టు తీర్పు
Comments
Please login to add a commentAdd a comment