
ఘజియాబాద్ : కూతురుని హత్య చేసిన కేసులో నిర్దోషులుగా బయటపడిన రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ దంపతులు ఆదివారం దాస్నా జైలులో బిజీగా గడిపేశారు. స్వయంగా వారు దంతవైద్యులు కావడంతో జైలులోని క్లినిక్ ఆదివారం ఇతర ఖైదీలతో కిక్కిరిసిపోయింది. తమ దంత సమస్యలు చూపించుకునేందుకు జైలు సిబ్బందితోసహా బారులు తీరారు. దీంతో వారిద్దరు ఆదివారం విశ్రాంతి లేకుండా జైలులో గడిపారు.
'సాధారణంగా వైద్యులైన నుపుర్, రాజేష్ శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆదివారం క్లినిక్ వచ్చేవాళ్లు కాదు. అయితే, ఈ ఆదివారమే వారికి చివరి రోజు కావడంతో ఆ విషయం తెలుసుకున్న ఖైదీలు పెద్ద మొత్తంలో క్లినిక్ వద్ద బారులు తీరారు. రాజేష్ పురుష ఖైదీలకు వైద్యం చేయగా నుపుర్ మహిళా ఖైదీలకు వైద్య సేవలు చేసింది' అని జైలు అధికారులు తెలిపారు. అలాగే, జైలు ఖైదీలతోపాటు పప్పు అన్నం తిన్నారని తెలిపారు. గతంలో ఫిబ్రవరి విచారణ సమయంలో కూడా తాము నిర్దోషులుగా బయటకు వచ్చినప్పటికీ వారానికో, రెండు రోజులకు ఒకసారి జైలులోని ఖైదీలకు వైద్యం చేస్తామని కూడా కోర్టుకు తెలిపారు. తమ కూతురు ఆరుషిని, పని మనిషి హేమ్ రాజ్‌ను హత్యచేసిన కేసులో వీరిద్దరు నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు విడుదల కావాల్సి ఉండగా ఆదివారం కావడంతో ఆరోజంతా చివరిసారిగా జైలులో వారికి వైద్య సేవలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment