ఆరుషి హత్యకేసులో.. సినిమా డైరెక్టర్‌లా..! | Aarushi-Hemraj murder case : HC slams CBI trial court | Sakshi
Sakshi News home page

ఆరుషి హత్యకేసులో.. సినిమా డైరెక్టర్‌లా..!

Published Fri, Oct 13 2017 10:00 AM | Last Updated on Mon, Apr 8 2019 7:08 PM

Aarushi-Hemraj murder case : HC slams CBI trial court - Sakshi

నిర్దోషులుగా తేలిన రాజేశ్‌-నుపుర్‌ తల్వార్‌ దంపతులు(ఇన్‌సెట్‌లో హతులు ఆరుషి, హేమ్‌రాజ్‌)

అలహాబాద్‌ : ఒక ఆలోచన ఆధారంగా కథ అల్లుకుని, దానికి తగ్గట్లు సీన్లు రాసుకుని సినిమాను ఓ కొలిక్కితెస్తారు దర్శకులు. సంచలనాత్మక ఆరుషి-హేమ్‌రాజ్‌ హత్యకేసులోనూ సీబీఐ విచారణ కోర్టు(ట్రయల్‌ కోర్టు) న్యాయమూర్తి సరిగ్గా సినిమా దర్శకుడి మాదిరి ‘కథను కొలిక్కి తెచ్చేందుకు’  ప్రయత్నించారట!!

‘‘న్యాయమూర్తి సినిమా దర్శకుడిలా వ్యవహరించారు. అసలు హత్య చేసింది ఎవరు, ఎందుకు, ఎలా చేశారు అనే వాస్తవ విషయాలను పట్టించుకోకుండా చెల్లాచెదురుగా ఉన్న ఆధారాలనే నమ్మి, నిందితులకు జీవితఖైదు విధించారు’’ అని ఘజియాబాద్‌ సీబీఐ విచారణ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తీర్పు కాపీలో ఆసక్తికరమైన విషయాలను రాసుకొచ్చింది.

2008 నాటి నోయిడా జంట హత్యలపై గురువారం తీర్పును వెలువరించిన అలహాబాద్‌ హైకోర్టు.. జీవితఖైదును అనుభవిస్తోన్న ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్‌ తల్వార్‌, నుపుర్‌ తర్వార్‌లను సంశయ లబ్ధి(బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌) కింద నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దోషులను నిర్ధారించడంలో సీబీఐ పూర్తిగా విఫలం చెందిందని, ఆ అరకొర ఆధారాలనే నమ్మిన సీబీఐ న్యాయమూర్తి నిజానిజాలను విస్మరించారని హైకోర్టు ధర్మాసనం వాపోయింది. ప్రస్తుతం దస్నా జైలులో ఉన్న రాజేశ్‌, నుపుర్‌ తల్వార్‌లు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం ఉంది.

తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో ఊహించని మలుపులు తిరిగి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన బాలిక ఆరుషి, వాచ్‌మన్‌ హేమరాజ్‌ల హత్య కేసులో దోషులెవరో ఇంకా తేలలేదు. ఈ కేసులో ఆమె తల్లిదండ్రులు నూపూర్‌ తల్వార్, రాజేష్‌ తల్వార్‌లే ప్రధాన నిందితులంటూ ఆరోపించిన సీబీఐ.. వారికి మరణశిక్ష విధించాలని వాదించింది. అయితే అందుకు తగ్గట్లు సందేహాతీతమైన, సహేతుకమైన సాక్ష్యాధారాలేవీ సీబీఐ సమర్పించ లేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేది లేదనిదీ త్వరలోనే ప్రకటిస్తామని సీబీఐ అధికారులు చెప్పారు.

అసలేం జరిగింది ?
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నివసిస్తోన్న డెంటిస్టు దంపతులు రాజేశ్‌- నుపుర్‌ తల్వార్‌ ఇంట్లో వారి కూతురు ఆరుషి(14 ఏళ్లు), పనిమనిషి హేమ్‌రాజ్‌(45 ఏళ్లు) దారుణ హత్యకు గురయ్యారు. 2008, మే 15 అర్ధరాత్రి తర్వాత ఈ ఉదంతరం చోటుచేసుకుంది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులుగానీ, అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా అందరూ భావించే సీబీఐ సిబ్బందికానీ ఆదినుంచీ తప్పులు చేస్తూ పోయారు. మీడియాకు లీకులివ్వడంలో చూపిన ఉత్సాహంలో రవ్వంతైనా దర్యాప్తుపై చూపలేకపోయారు.

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తొలుత ఆరుషిని వాచ్‌మాన్‌ హత్య చేసి పారిపోయి ఉంటాడని నిర్ధారణకొచ్చారు. ఆ ఇంటిపైనున్న గదిలో నివాసం ఉంటున్నా డన్నారు గనుక అక్కడ సోదా చేద్దామనుకున్నా ఆ గదికి దారితీసే మెట్లవైపు తలుపు తాళం వేసి ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. హేమరాజ్‌ కోసం అంతటా వెతికి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు ఆ మర్నాడొచ్చి తలుపు తాళం బద్దలుకొట్టారు. తీరాచూస్తే అక్కడి టెర్రస్‌పైనే అతని శవం పడి ఉంది. ఆ పక్కనున్న గదిలో రక్తపు మరకలున్న దిండు దొరికింది. అనంతరకాలంలో ఆ రక్తపు మరకలు హేమరాజ్‌వేనని నిర్ధారణైంది. ఆరుషికి సంబంధించి మెడ కోసిన ఆనవాలు తప్ప నెత్తురొలికిన జాడలేదు. అంటే ఆ రక్తపు మరకల్ని ఎవరో శుభ్రం చేసి ఉండాలి. అలా చేసిందెవరో పోలీసులు తేల్చలేకపోయారు. తల్వార్‌ దంపతులే ఆ పని చేసి ఉండొచ్చునని భావించినా అందుకు ఎలాంటి ఆధా రాలనూ చూపలేకపోయారు. రాజేష్‌ తల్వార్‌ సహాయకుడు కృష్ణ, ఇంట్లో పనిచేసే రాజ్‌కుమార్, విజయ్‌మండల్‌ అనే మరో ఇద్దరు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఏమీ రాబట్టలేకపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా ఫలితం లేకపోయింది. ఆరుషి కేసులో మొత్తం మూడు దర్యాప్తులు జరిగాయి. అందులో ఒకటి యూపీ పోలీసులది కాగా, మరో రెండింటిని సీబీఐకి చెందిన రెండు వేర్వేరు బృందాలు చేపట్టాయి. చిత్రమేమంటే– రెండూ వేర్వేరు నిర్ధారణలకొచ్చాయి.  

హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెనువెంటనే స్వాధీనం చేసుకోనందువల్ల నేరస్తుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషినీ, హేమ రాజ్‌నూ అభ్యంతరకర పరిస్థితుల్లో చూసిన తల్వార్‌ దంపతులు కోపం పట్టలేక ఆ బాలికను ‘పరువు హత్య’ చేశారని ఆరోపించినా ఆరుషి గదిలో ఆమె శవం మాత్రమే ఎందుకున్నదో, హేమరాజ్‌ శవం టెర్రస్‌పైకి ఎలా చేరిందో సీబీఐ చెప్పలేకపోయింది. ఆరుషి గదికి బయట తాళం వేసి ఉందని, దాని తాళం చెవి తల్వార్‌ దంపతుల దగ్గరే ఉంటుందని, వేరేవారెవరూ ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ గదికి వేరే తలుపు కూడా ఉందని, పైగా ఆరుషి గదిలోకి దుండగులు బాత్‌రూం ద్వారా ప్రవేశించి ఉండొచ్చునని తల్లిదండ్రులు చెప్పినదానికి వారి దగ్గర జవాబు లేదు. నార్కో అనాలిసిస్‌ పరీక్షలు సైతం ఉన్న గందరగోళాన్ని మరింత పెంచాయి. కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌మండల్‌ నార్కో అనాలిసిస్‌ పరీక్షల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరికి వారు మరొకరు ఈ హత్యకు కారకులని చెప్పారు. వారు చెప్పిన అంశాలతో సరిపోలే సాక్ష్యాధారాలేవీ పోలీసులకు లభించలేదు.  తమ సచ్ఛీలత నిరూపించుకోవడానికి ఆరుషి తల్లిదండ్రులు కూడా అన్ని పరీక్షలకూ సిద్ధపడ్డారు. కానీ అందులో ఏమీ తేలలేదు.

ఇలా ఈ కేసులో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయి.. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నదని ‘నిరూపించడం’ కోసం ఆ కుటుంబాన్ని మీడియా బజారులో నిలబెట్టింది. అన్ని విలువలనూ వదిలిపెట్టి అనేక కథనాలను ప్రచారంలో పెట్టింది. రాజేష్‌ తల్వార్‌కు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉన్నదని ఒక కథనం చెబితే... ఆ దంపతులు కుమార్తెను ఒంటరిగా వదిలి విందుల పేరుతో ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవారని మరో కథనం ఏకరువు పెట్టింది. తొలుత ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఇందులో ఎలాంటి ఆధారాలూ లభించలేదని అంగీకరించింది. కానీ ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తున్నట్టు 2013 నవంబర్‌లో తెలిపింది. చిత్రమేమంటే ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు గనుక కేసు మూసేయాలని 2010 డిసెంబర్‌లో న్యాయస్థానాన్ని సీబీఐ అభ్యర్థిస్తే అందుకు అభ్యంతరం చెబుతూ అప్పీల్‌కెళ్లింది తల్వార్‌ దంపతులే.

తీరా మరో మూడేళ్లకు వారే నేరస్తులంటూ న్యాయస్థానం శిక్షించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వివిధ సందర్భాల్లో వారు సాగించిన పోరాటం, పడిన మనో వేదన అంతా ఇంతా కాదు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు లభించడం మాట అటుంచి ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరకు తొమ్మిదేళ్లకు వారిద్దరూ నిర్దోషులుగా బయటికొచ్చారు గానీ... తమ కుమార్తె ఉసురు తీసిందెవరో మాత్రం తెలియలేదు. మన దర్యాప్తు సంస్థల పని తీరుకు, మన న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు సాగే వైనానికి ఆరుషి హత్య  కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement