న్యాయం దక్కినట్టేనా? | Arushi murder case final verdict | Sakshi
Sakshi News home page

న్యాయం దక్కినట్టేనా?

Published Fri, Oct 13 2017 1:55 AM | Last Updated on Fri, Oct 13 2017 1:55 AM

Arushi murder case final verdict

తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో ఊహించని మలుపులు తిరిగి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ బాలిక ఆరుషి, వాచ్‌మన్‌ హేమరాజ్‌ల హత్య కేసు చివరకు దోషులెవరో తేలకుండానే ముగిసిపోయింది. ఈ కేసులో ఆమె తల్లిదండ్రులు నూపూర్‌ తల్వార్, రాజేష్‌ తల్వార్‌లే ప్రధాన నిందితులంటూ ఆరోపించిన సీబీఐ చివరకు దాన్ని నిరూపించలేకపోవడంతో... అలహాబాద్‌ హైకోర్టు గురువారం ఆ దంపతులిద్దరినీ ‘సంశయ లబ్ధి’ కింద విడుదల చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు సందేహాతీతమైన, సహేతుకమైన సాక్ష్యాధారాలేవీ సమర్పించ లేకపోయారని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశంలోనూ, వెలుపలా దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారి, ఎన్నో సంక్లిష్టతలతో నిండి ఉన్న కేసుల తీరు తెన్నులను... వాటిని చాకచక్యంగా పరిష్కరించిన వైనాన్ని పోలీసు శిక్షణా సంస్థల్లో అధ్యయనం చేయిస్తారు. దర్యాప్తు ఎలా చేయకూడదో, సాక్ష్యాధారాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో, వాటినెంత ప్రాణప్రదంగా చూసుకోవాలో వివ రించడానికి ఆరుషి హత్య కేసును ఇప్పుడా జాబితాలో చేర్చక తప్పదు. ఎందుకంటే తొలుత దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులుగానీ, అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా అందరూ భావించే సీబీఐ సిబ్బందికానీ ఆదినుంచీ తప్పులు చేస్తూ పోయారు. మీడియాకు లీకులివ్వడంలో చూపిన ఉత్సాహంలో రవ్వంతైనా దర్యాప్తుపై చూపలేకపోయారు.

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తొలుత ఆరుషిని వాచ్‌మాన్‌ హత్య చేసి పారిపోయి ఉంటాడని నిర్ధారణకొచ్చారు. ఆ ఇంటిపైనున్న గదిలో నివాసం ఉంటున్నా డన్నారు గనుక అక్కడ సోదా చేద్దామనుకున్నా ఆ గదికి దారితీసే మెట్లవైపు తలుపు తాళం వేసి ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. హేమరాజ్‌ కోసం అంతటా వెతికి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు ఆ మర్నాడొచ్చి తలుపు తాళం బద్దలుకొట్టారు. తీరాచూస్తే అక్కడి టెర్రస్‌పైనే అతని శవం పడి ఉంది. ఆ పక్కనున్న గదిలో రక్తపు మరకలున్న దిండు దొరికింది. అనంతరకాలంలో ఆ రక్తపు మరకలు హేమరాజ్‌వేనని నిర్ధారణైంది. ఆరుషికి సంబంధించి మెడ కోసిన ఆనవాలు తప్ప నెత్తురొలికిన జాడలేదు. అంటే ఆ రక్తపు మరకల్ని ఎవరో శుభ్రం చేసి ఉండాలి. అలా చేసిందెవరో పోలీసులు తేల్చలేకపోయారు. తల్వార్‌ దంపతులే ఆ పని చేసి ఉండొచ్చునని భావించినా అందుకు ఎలాంటి ఆధా రాలనూ చూపలేకపోయారు. రాజేష్‌ తల్వార్‌ సహాయకుడు కృష్ణ, ఇంట్లో పనిచేసే రాజ్‌కుమార్, విజయ్‌మండల్‌ అనే మరో ఇద్దరు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఏమీ రాబట్టలేకపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా ఫలితం లేకపోయింది. ఆరుషి కేసులో మొత్తం మూడు దర్యాప్తులు జరిగాయి. అందులో ఒకటి యూపీ పోలీసులది కాగా, మరో రెండింటిని సీబీఐకి చెందిన రెండు వేర్వేరు బృందాలు చేపట్టాయి. చిత్రమేమంటే– రెండూ వేర్వేరు నిర్ధారణలకొచ్చాయి.  

హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెనువెంటనే స్వాధీనం చేసుకోనందువల్ల నేరస్తుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషినీ, హేమ రాజ్‌నూ అభ్యంతరకర పరిస్థితుల్లో చూసిన తల్వార్‌ దంపతులు కోపం పట్టలేక ఆ బాలికను ‘పరువు హత్య’ చేశారని ఆరోపించినా ఆరుషి గదిలో ఆమె శవం మాత్రమే ఎందుకున్నదో, హేమరాజ్‌ శవం టెర్రస్‌పైకి ఎలా చేరిందో సీబీఐ చెప్పలేకపోయింది. ఆరుషి గదికి బయట తాళం వేసి ఉందని, దాని తాళం చెవి తల్వార్‌ దంపతుల దగ్గరే ఉంటుందని, వేరేవారెవరూ ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ గదికి వేరే తలుపు కూడా ఉందని, పైగా ఆరుషి గదిలోకి దుండగులు బాత్‌రూం ద్వారా ప్రవేశించి ఉండొచ్చునని తల్లిదండ్రులు చెప్పినదానికి వారి దగ్గర జవాబు లేదు. నార్కో అనాలిసిస్‌ పరీక్షలు సైతం ఉన్న గందరగోళాన్ని మరింత పెంచాయి. కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌మండల్‌ నార్కో అనాలిసిస్‌ పరీక్షల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరికి వారు మరొకరు ఈ హత్యకు కారకులని చెప్పారు. వారు చెప్పిన అంశాలతో సరిపోలే సాక్ష్యాధారాలేవీ పోలీసులకు లభించలేదు.  తమ సచ్ఛీలత నిరూపించుకోవడానికి ఆరుషి తల్లిదండ్రులు కూడా అన్ని పరీక్షలకూ సిద్ధపడ్డారు. కానీ అందులో ఏమీ తేలలేదు.

ఇలా ఈ కేసులో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నదని ‘నిరూపించడం’ కోసం ఆ కుటుంబాన్ని మీడియా బజారులో నిలబెట్టింది. అన్ని విలువలనూ వదిలిపెట్టి అనేక కథనాలను ప్రచారంలో పెట్టింది. రాజేష్‌ తల్వార్‌కు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉన్నదని ఒక కథనం చెబితే... ఆ దంపతులు కుమార్తెను ఒంటరిగా వదిలి విందుల పేరుతో ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవారని మరో కథనం ఏకరువు పెట్టింది. తొలుత ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఇందులో ఎలాంటి ఆధారాలూ లభించలేదని అంగీకరించింది. కానీ ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తున్నట్టు 2013 నవం బర్‌లో తెలిపింది. చిత్రమేమంటే ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు గనుక కేసు మూసేయాలని 2010 డిసెంబర్‌లో న్యాయస్థానాన్ని సీబీఐ అభ్యర్థిస్తే అందుకు అభ్యంతరం చెబుతూ అప్పీల్‌కెళ్లింది తల్వార్‌ దంపతులే.

తీరా మరో మూడేళ్లకు వారే నేరస్తులంటూ న్యాయస్థానం శిక్షించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వివిధ సందర్భాల్లో వారు సాగించిన పోరాటం, పడిన మనో వేదన అంతా ఇంతా కాదు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు లభించడం మాట అటుంచి ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరకు తొమ్మిదేళ్లకు వారిద్దరూ నిర్దోషులుగా బయటికొచ్చారు గానీ... తమ కుమార్తె ఉసురు తీసిందెవరో మాత్రం తెలియలేదు. మన దర్యాప్తు సంస్థల పని తీరుకు, మన న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు సాగే వైనానికి ఆరుషి హత్య  కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement