సాక్షి, న్యూఢిల్లీ : కథువా హత్యాచారం కేసు విచారణను చండీగఢ్ కోర్టుకు బదలాయించాలని దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 27లోగా బదులివ్వాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో లైంగిక దాడి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్దానం ఆదేశించింది. బాధిత బాలిక తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు స్పందించింది.
జమ్మూకశ్మీర్ వెలుపల తమ కేసును విచారించాలని, తమ కుటుంబంతో పాటు కేసును వాదిస్తున్న తమ న్యాయవాదులకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో బాధితురాలి తండ్రి కోర్టును కోరారు. ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన మైనర్ బాలుడిని ఉంచిన జువెనిల్ హోంలో భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించాలని కూడా ఆయన కోరారు. అయితే కశ్మీర్ పోలీసులు బాగా పనిచేశారని సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానానికి విన్నవించారు. సాక్ష్యాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా.. సైంటఫిక్ ఆధారాలు కూడా సేకరించారని తెలిపారు.
తన కుమార్తెపై లైంగిక దాడి, హత్యోదంతంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించాలని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసు విచారణను కథువా జిల్లా కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది. నేటి విచారణకు నిందితులందరూ హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో కథువా జిల్లాలోని రసన గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను గుడిలో నిర్భందించి వారంరోజుల పాటు దుండగులు లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment