‘బాబ్రీ’ కేసులో అద్వానీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తదితరులపై ‘నేరపూరిత కుట్ర’(ఐపీసీలోని సెక్షన్ 120బీ) ఆరోపణను తొలగించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందించాల్సిందిగా అద్వానీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయినవారిలో బీజేపీ నేతలు మురళీమనోహర్ జోషి, ఉమాభారతి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌తో పాటు మరో 15 మంది ఉన్నారు.
కేంద్రంలో ప్రభుత్వం మారినందువల్ల సీబీఐ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించే అవకాశముందంటూ హాజీ మొహమ్మద్ అహ్మద్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాల ధర్మాసనం సీబీఐకి, అద్వానీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు, బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీ సహా 19 మందిపై ‘నేరపూరిత కుట్ర’ ఆరోపణను తొలగిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయడంలో జరిగిన జాప్యంపై సుప్రీంకోర్టు సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జాప్యానికి కారణాలను కోర్టు ముందుంచడానికి సీబీఐ సమయం అడగడంతో కోర్టు 4 వారాల గడువిచ్చింది.