L.K. Advani
-
అద్వానీకి సతీ వియోగం
గుండెపోటుతో కమలా అద్వానీ మృతి న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ (83) గుండెపోటుతో కన్నుమూశారు. ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను బుధవారం సాయంత్రం ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొంతకాలంగా వీల్‌చైర్‌పైనే ఉంటున్నారు. మతిమరుపుతోనూ సతమతమయ్యారు. అద్వానీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన వెన్నంటి ఉన్నప్పటికీ ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తన ఉత్థానపతనాల్లో మద్దతుగా నిలిచిన ఆమె తుదిశ్వాస విడిచినప్పుడు అద్వానీ పక్కనే ఉన్నారు.కమలను సాయంత్రం 5.10 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని, గంటపాటు చికిత్స అందించినప్పటికీ 6.10 గంటలకు ఆమె మృతిచెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రాత్రికి కమల భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ప్రధాని మోదీతోపాటు పెద్దఎత్తున రాజకీయ నేతలు తరలి వచ్చి నివాళులు అర్పించారు. అంత్యక్రియలను గురువారం సాయంత్రం 4 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నారు. 1965లో వివాహమైన అద్వానీ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కమల కొన్నాళ్లు పోస్టాఫీసులోనూ విధులు నిర్వర్తించారు. 90ల్లో అద్వానీ తన రాజకీయ జీవితంలో కీలకమైన రథయాత్ర నిర్వహించినప్పుడు కూడా కమల ఆయన వెన్నంటి ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం కమల మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మోదీలతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృదుస్వభావి అయిన కమల సంస్కృతికి ప్రతీక అని ప్రణబ్ కొనియాడారు. ఆమె మృతి ఎంతగానో కలచివేసిందంటూ మోదీ ఆమెతో జరిపిన సంభాషణలను గుర్తుచేసుకున్నారు. ఆమె పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోనియా అన్నారు. గువాహటిలో ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్.. అద్వానీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. అద్వానీకి తోడుగా ఆదర్శ జీవితాన్ని గడిపిన ఆమె తమకందరికీ ప్రేమమూర్తిగా నిలిచారని ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: కమలా అద్వానీ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. సతీమణిని కోల్పోయి దుఃఖంలో ఉన్న అద్వానీకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
నవంబర్ 8న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఎల్.కె. అద్వానీ (రాజకీయ నేత) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. దీనివల్లన ధైర్యసాహసాలు, దేనినైనా ఎదుర్కోవాలన్న పట్టుదల, దృఢసంకల్పం ఉంటాయి. 9 అనేది న్యూమరాలజీలో అంతిమ సంఖ్య కాబట్టి వ్యాపారస్థులు కొత్తవాటి జోలికి పోకుండా పాతవాటినే కొనసాగించడం మంచిది. అలాగే గ్రీన్ కార్డ్ కోసం 2016 జులై తర్వాత ప్రయత్నించడం మంచిది. వివాహం, సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత ఇంటి కల ఫలించే అవకాశం ఉంది. తొందరపాటును, కోపాన్ని తగ్గించుకోవడం. వాహనాలను, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. లక్కీ నంబర్స్: 1,3,6,8, 9; లక్కీ కలర్స్: సిల్వర్, బ్లాక్, పర్పుల్, రెడ్, గోల్డెన్, బ్లూ; లక్కీ డేస్: ఆది, మంగళ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: అమ్మవారి ఆరాధన, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, రక్తదానం చేయడం లేదా రక్తదానాన్ని ప్రోత్సహించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
‘బాబ్రీ’ కేసులో అద్వానీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తదితరులపై ‘నేరపూరిత కుట్ర’(ఐపీసీలోని సెక్షన్ 120బీ) ఆరోపణను తొలగించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందించాల్సిందిగా అద్వానీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయినవారిలో బీజేపీ నేతలు మురళీమనోహర్ జోషి, ఉమాభారతి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌తో పాటు మరో 15 మంది ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారినందువల్ల సీబీఐ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించే అవకాశముందంటూ హాజీ మొహమ్మద్ అహ్మద్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాల ధర్మాసనం సీబీఐకి, అద్వానీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు, బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీ సహా 19 మందిపై ‘నేరపూరిత కుట్ర’ ఆరోపణను తొలగిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయడంలో జరిగిన జాప్యంపై సుప్రీంకోర్టు సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జాప్యానికి కారణాలను కోర్టు ముందుంచడానికి సీబీఐ సమయం అడగడంతో కోర్టు 4 వారాల గడువిచ్చింది. -
బీజేపీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకం
న్యూఢిల్లీ: తమ పార్టీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకమని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ వ్యాఖ్యానించారు. యూపీఏ హాయంలో కుంభకోణాలు జరగకుంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండేవని అన్నారు. 'లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. నరేంద్ర మోడీ ప్రచార సారథ్యం బీజేపీకి బాగా కలసివచ్చింది. అయితే మా విజయానికి ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా దోహదపడ్డాయి. ఈ విషయాన్ని విస్మరించలేం' అని తన నివాసంలో జెండావిష్కరణ అనంతరం అద్వానీ అన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ 282 లోక్‌సభ సీట్లు నెగ్గగా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడు లేనంతగా చిత్తుగా ఓడిపోయి 42 సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి ఓటు వేశారని, ఇందులో వ్యక్తుల ప్రమేయం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. -
రాహుల్.. మీ ఎంపీలను కంట్రోల్ చేయండి
యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను నియంత్రించాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ సూచించారు. బుధవారం లోక్‌సభలో మతహింసపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాహుల్ తమ పార్టీ ఎంపీలతో కలసి స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో కలసి అద్వానీని కలిశారు. లోక్‌సభలో జరిగిన సంఘటన పట్ల అద్వానీ మనస్తాపం చెందినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమస్యను పరిష్కరించాల్సిదిగా పార్టీ నాయకులకు సూచించినట్టు సమాచారం. దేశంలో మతహింస పెరిగిపోతున్న విషయంపై వెంటనే సభలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం నిరాకరించింది. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ ఆరోపించగా..ఆ తర్వాత సుమిత్ర ఖండించారు. -
అద్వానీతో జస్వంత్ భేటీ
న్యూఢిల్లీ: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జస్వంత్ సింగ్.. ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో శుక్రవారం సమావేశమయ్యారు. జస్వంత్ మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. కాగా జస్వంత్‌ను పార్టీలోకి చేర్చుకునే అంశంపై భావి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు అద్వానీని జస్వంత్ అభినందించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో బార్మర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసినందుకు జస్వంత్‌ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. జస్వంత్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. -
అందరి కంటే అద్వానీయే పెద్ద
న్యూఢిల్లీ: 16వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల్లో అందరి కంటే పెద్ద వయస్కుడు బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీయే. అద్వానీ వయసు 86 ఏళ్లు. మొత్తం 543 మంది లోక్‌సభ సభ్యుల్లో 253 మంది 55 ఏళ్లకు పైబడినవారే. 15వ లోక్‌సభతో పోలిస్తే ప్రస్తుత సభలో పెద్ద వయస్కులు ఎక్కువగా ఉన్నారు. గత సభలో 55 ఏళ్లకు పైబడినవారు 43 శాతం మంది ఉండగా, ఈ సారి ఈ శాతం పెరిగింది. లోక్‌సభకు ఇంతమంది పెద్ద వయస్కులు ఎన్నికవడం ఇదే తొలిసారి. 40 ఏళ్ల వయసులోపు వారు కేవలం 71 మంది మాత్రమే ఎన్నికయ్యారు. -
మన్మోహన్ బలహీన ప్రధాని
మోడీపై ప్రశంసలు కురిపించిన అద్వానీ అహ్మద్‌నగర్: బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ లక్ష్యంగా విమర్శలు సంధించారు. తనకంటే బలహీనమైన ప్రధాని మరొకరు లేరని మన్మోహన్ నిరూపించుకున్నారని అన్నారు. షేవ్గావ్లో బహిరంగ సభలో మాట్లాడిన అద్వానీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేరుు ప్రారంభించిన అభివృద్ధి ప్రక్రియను మోడీ పునఃప్రారంభిస్తారని అన్నారు. నర్మద ప్రాజెక్టు, పారిశ్రామికీకరణ, ప్రతి ఒక్క రైతుకూ నీటిని అందించడం, విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గుజరాత్ రూపురేఖల్నే మోడీ మార్చివేశారని చెప్పారు. -
కాంగ్రెస్ ఓటమి ముందే నిశ్చయం: అద్వానీ
న్యూఢిల్లీ: గత 15 సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ముందే నిశ్చయమైపోయిందని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఎద్దేవా చేశారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడేందుకు పదేళ్లపాటు అసమర్థ పాలనతో బాటలు వేసిన ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తమ పార్టీ రుణపడి ఉంటుందంటూ తన బ్లాగ్‌లో చురకలంటించారు. ‘యూపీఏ సర్కారు పాలనలో జరిగినన్ని కుంభకోణాలు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. అవినీతే యూపీఏ ప్రభుత్వ లక్షణంగా మారింది. ఈ ప్రభుత్వాన్ని త్వరగా గద్దె దించేందుకు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 1952 నుంచి నేను అన్ని సాధారణ ఎన్నికల్లో పాల్గొన్నా. ప్రస్తుతం కాంగ్రెస్ ఓటమి నిశ్చయమైనట్లుగా గత 15 సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ ఆ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు’’ అంటూ దుయ్యబట్టారు -
స్కాంలలో ప్రధానికీ బాధ్యత: అద్వానీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పాలన పదేళ్ల కాలం స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అధ్వానమైన అధ్యాయమని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ధ్వజమెత్తారు. కామన్వెల్త్ క్రీడల నుంచి కోల్గేట్ (బొగ్గు కేటాయింపులు) వరకు వరుసగా కుంభకోణాలు వెల్లువెత్తాయన్నారు. వాటి బాధ్యత నుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను మినహాయించలేమని వ్యాఖ్యానించారు. అయితే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆదేశాలు, అనుమతి లేకుండా ప్రధాని ఏ పనీ చేయబోరన్నారు. ఈ నేపథ్యంలో బొగ్గు కేటాయింపుల సహా అన్ని కుంభకోణాల్లోనూ సోనియా కూడా దోషేనని దుయ్యబట్టారు. ఈ కుంభకోణాలన్నింటి బాధ్యతను యూపీఏ మిత్రపక్షాలపైకి నెట్టేయలేరన్నారు. ఆదివారం ఢిల్లీలో అద్వానీ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ మిత్రపక్షాలు ఉన్నాయని, బీజేపీ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని ప్రస్తావించారు. వాజ్‌పేయిపై కానీ, మరే బీజేపీ మంత్రిపై కానీ ఎలాంటి కేసులు నమోదుకాలేదని పేర్కొన్నారు. ఒక ఆర్థికవేత్త ప్రధానమంత్రిగా ఉన్న ఈ పదేళ్ల కాలంలో ఆర్థికవ్యవస్థ దారితప్పినట్లుగా గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. -
పటేల్‌ను ‘మతతత్వవాది’ అన్న నెహ్రూ!
బ్లాగులో అద్వానీ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత మొట్టమొదటి హోం మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు సంబంధించి బీజేపీ మరో వివాదం లేవనెత్తింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. పటేల్‌ను ‘పూర్తి మతతత్వవాది’ అని అన్నారని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తన తాజా బ్లాగ్ పోస్టింగ్‌లో ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకునేందుకు వీలుగా సైన్యాన్ని పంపాలని పటేల్ సూచించిన నేపథ్యంలో నెహ్రూ ఆ విధంగా వ్యాఖ్యానించారని ఎంకేకే నాయర్ రాసిన ఓ పుస్తకాన్ని (ద స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితవుట్ ఇల్ విల్) ఉటంకిస్తూ అద్వానీ పేర్కొన్నారు. హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో నెహ్రూ, పటేల్‌ల మధ్య జరిగిన తీవ్ర వాగ్వివాదం వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘దేశ స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌తో కలిసిపోవాలని భావించిన నిజాం ఈ మేరకు పొరుగు దేశానికి రహస్య దూత ఒకర్ని పంపించారు. పెద్దమొత్తంలో డబ్బును కూడా అక్కడి ప్రభుత్వానికి బదలాయించారు. పలువురు నిజాం అధికారులు స్థానిక ప్రజలపై యథేచ్చగా అత్యాచారాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ పటేల్ కేబినెట్ దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లో భయానక పాలనకు తెరదించేందుకు తక్షణమే అక్కడికి సైన్యాన్ని పంపాలని డిమాండ్ చేశారు. సాధారణంగా మృదుభాషి అయిన నెహ్రూ నిగ్రహాన్ని కోల్పోయారు. ‘‘నువ్వో పూర్తి మతతత్వవాదివి. నేనెప్పుడూ నీ సిఫారసును అంగీకరించను..’’ అని అన్నారు. పటేల్ మరో మాట మాట్లాడకుండా తన కాగితాలు తీసుకుని వెళ్లిపోయారు..’ అని అద్వానీ తెలిపారు. పటేల్‌ను హిందూత్వ భావాలు కలిగిన వ్యక్తిగా తెరపైకి తెచ్చేందుకు ఇటీవల కొంతకాలంగా బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌కు సైన్యాన్ని పంపేలా అప్పటి గవర్నర్ జనరల్ రాజాజీ నెహ్రూను ఒప్పించారని అద్వానీ పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో పరిస్థితి అంతకంతకూ విషమిస్తుండటంతో నెహ్రూ, పటేల్ ఇద్దరినీ రాజాజీ రాష్ట్రపతి భవన్‌కు పిలిపించారు. అప్పటికి రెండ్రోజుల ముందు రజాకార్లు ఓ కాన్వెంట్కు చెందిన 70 ఏళ్ల నన్లపై అత్యాచారానికి తెగబడటాన్ని నిరసిస్తూ బ్రిటిష్ హైకమిషనర్ రాసిన ఓ లేఖను సిద్ధంగా ఉంచుకున్నారు. పటేల్ సన్నిహిత అధికారి వి.పి.మీనన్ ఆ లేఖను కేబినెట్ భేటీకి ముందు రాజాజీకి అందజేశారు. భేటీలో రాజాజీ తనదైన శైలిలో హైదరాబాద్‌లో పరిస్థితిని వర్ణించి చెప్పారు. అయితే నెహ్రూ అంతర్జాతీయంగా ఉత్పన్నమయ్యే ఇబ్బందుల దృష్ట్యా తటపటాయించారు. ఆ సమయంలో రాజాజీ తురుపు ముక్క (లేఖ)ను బయటకు తీశారు. ఆ లేఖను చదివిన నెహ్రూ ముఖం ఎర్రబడింది. కుర్చీలోంచి వేగంగా లేచి పిడికిలి బిగించి బల్లపై కొట్టారు. ‘‘ఇంకో క్షణం కూడా వృధా చేయడానికి వీల్లేదు. వారికి గుణపాఠం చెబుతాం..’’ అని అన్నారు. ఆ వెంటనే రాజాజీ పథకం మేరకు ముందుకువెళ్లాల్సిందిగా కమాండర్ ఇన్ చీఫ్‌కు చెప్పాలని మీనన్‌ను ఆదేశించారు..’ అని నాయర్ పుస్తకాన్ని ఉటంకిస్తూ అద్వానీ తెలిపారు. -
కసరత్తు చాలని కమలం
విశ్లేషణ: ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మిఠాయి పొట్లంవలె నోరూరిస్తూ చేతికందేలా ఉంది. దీనిని అందుకోవాలంటే ఒకటే-రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎనభై రోజులుగా ఉద్యమిస్తున్న రాయలసీమ, కోస్తా ప్రజలకు మేం అండగా ఉంటామని చెప్పాలి. సీమాంధ్రుల మనోభావాలను గమనించకుంటే తెలంగాణ ఏర్పాటుకు మద్దతునీయమని ప్రకటన చేయాలి. రేపటి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడకుండా ఇది జరగాలి. గ్రీకు పురాణాలలో టాంటలస్ కథ కనిపిస్తుంది. చేయరాని తప్పులేవో చేయడంతో ఈ రాజుకి దేవతలు చిత్రమైన శిక్ష విధించారు. ఒక పండ్ల చెట్టు కింద ఉన్న తటాకంలో రాజు నిలబడే ఉండాలి. కానీ దాహమే సినప్పుడు తాగేందుకు దోసిలి పడితే నీళ్లు దూరంగా జరుగు తాయి. ఆకలేసినప్పుడు పండ్లం దుకునేందుకు చేయి చాచితే కొమ్మలు అందకుండాపోతాయి. నిత్యం ఆకలితో, దాహం తో అలమటించాలి. నీళ్లు, పండ్లు అందుబాటులో ఉన్నా అందుకుందామంటే అందనంత దూరంగా జరిగిపోతా యి. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తే శాపగ్రస్థ టాంటలస్ గుర్తుకొస్తాడు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గెలు పనేది బీజేపీకి చేయి చాస్తే అందేంత దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది. కానీ పదేళ్లుగా అందక బీజేపీని అలమటింప చేస్తూనే ఉంది. నల్లేరు మీద నడక కాదు 2009లో బీజేపీకి 116 మంది ఎంపీల బలమే ఉంది. అగ్ర నేత ఎల్.కె.అద్వానీ ఆకర్షణ తగ్గిపోయిందనుకుని ఇప్పు డు నరేంద్రమోడీని తీసుకువచ్చారు. పార్టీ కళ్ల ముందు ఎన్డీఏ ప్రభుత్వం కనిపించేలా చేయడంలో మోడీ విజయ వంతమయ్యాడు కూడా. అయితే, మోడీ కూడా టాంట లస్ లాగా బాధపడతాడో లేక శాప విముక్తి చేసుకుంటాడో చూడాలి. నరేంద్ర మోడీ వల్ల కొంత ఉత్సాహం వచ్చినా, చాలా రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి ఊహించినంత ఆశాజనం గా లేదు. ముఖ్యంగా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ పార్టీ అంత ఆరోగ్యకరంగా లేదు. ఈ నాలుగు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు బీజేపీ చేతిలో ఉంటే ఢిల్లీ, రాజ స్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ నాలుగు రాష్ట్రాలలో కనీసం మూడు బీజేపీ గెల్చుకుని తీరాలి. కానీ అక్కడి రాజకీయ పరిస్థితులు దీనికి అనుకూలంగా కనిపిం చడం లేదు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నాయని, ఈసారి తమదే అవకాశమని బీజేపీ ఆశ. పదేళ్లుగా బీజేపీ చేతిలోనే ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా అదే సంభవించాలి! ఢిల్లీలో షీలాదీక్షిత్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ల ప్రభుత్వాలతో ప్రజలు విసుగెత్తి ఉంటే, మధ్య ప్రదేశ్‌లో శివరాజ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్‌ల రమణ్సింగ్ల విషయంలోనూ అదే సూత్రం వర్తించాలి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆకర్షణ తగ్గిపోతోంది. 2003 ఎన్నికలలో 288 స్థానాలు ఉన్న ఆ అసెంబ్లీలో 168 స్థానా లు గెలిచి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2008లో శివరాజ్ చౌహాన్ నాయకత్వంలో నెగ్గినా పార్టీ బలం 143కు పడిపోయింది. శివరాజ్ చౌహాన్ పెద్దగా వివాదా లలో, కుంభకోణాలలో చిక్కుకొనకపోయినా పాలనాదక్షు డిగా పేరు తెచ్చుకోలేకపోయాడు. ఆయనను గుర్తు చేసే పథకం, కార్యక్రమం లేవు. పదేళ్ల తర్వాత ఓటరులో ప్రభు త్వ వ్యతిరేకత, విరక్తి సహజం. నాయకత్వం నిత్యనూత నం కాకపోతే ప్రజల దృష్టి ఒక నాయకుడి మీదే నిలబడ టం కష్టం. శివరాజ్ది ఇప్పుడు ఇదే పరిస్థితి. చౌహాన్ ఓడిపోవడమంటూ జరిగితే అది బీజేపీకి విఘాతమే. ఢిల్లీ చుట్టూ తిరగడం, సదా పత్రికలలో కనిపించడం నచ్చని నాయకుడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్. చిన్న రాష్ట్రం కావడం వల్ల ఛత్తీస్‌గఢ్‌కు, అక్కడ అధికారంలో ఉన్నందుకు బీజేపీకీ సమస్యలు బాగానే ఉన్నాయి. 90 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో 2008లో 50 సీట్లు సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ కు, కమలానికి ఉన్న ఓట్ల వ్యత్యాసం ఒక శాతం. బీజేపీకి 50 శాతం, కాంగ్రెస్‌కు 49 శాతం ఓట్లు వచ్చాయి. బస్తర్ మావోయిస్టు ప్రాంతంలో ఉన్న 12 స్థానాలలో 11 గెల్చు కుని బీజేపీ అధికారానికి దగ్గరయింది. ఈ పదేళ్ల అధికారం వల్ల లబ్ధి పొందని బీజేపీ నాయకుల వల్ల పార్టీలో ముఠా లు వచ్చాయి. ప్రజలలో ఉన్న బీజేపీ వ్యతిరేకతకు ఈసారి ఇది కూడా తోడవుతుంది. మారిన ఢిల్లీ దృశ్యం ఢిల్లీలో ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీలే అధికారం పంచు కుంటూ వచ్చాయి. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ రావడంతో పరిస్థితి మారింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఈ పార్టీతో బీజేపీ ఆశకు గండిపడే స్థితి కనిపిస్తున్నది. సాధారణ పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేకత సూత్రం ప్రకారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో అధికారం దక్కకపోతే బీజేపీ జాతీయస్థాయిలో గౌరవం కోల్పోతుంది. ఒక్క రాజస్థాన్ లోనే బీజేపీ గట్టెక్కేలా కనిపిస్తున్నది. ఇక్కడ కూడా పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వివాదరహిత పాలన అందించడంలో విఫలమయిందనే చెప్పాలి. ఆ అపకీర్తి బీజేపీలో ధీమా పెంచింది. ఢిల్లీ, రాజ స్థాన్లను కోల్పోయినా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెల్చుకున్నా కూడా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినట్లే. మోడీ ఆత్మరక్షణలో పడిపోతాడు. బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శకు జవాబు చెప్పడం మోడీకి ఇబ్బంది కావచ్చు. ఆంధ్రలో కమలం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ వేళ్లూను కోలేకపోతోంది. ఇప్పుడు తెలంగాణకు మద్దతుతో కొన్ని ఓట్లు తెచ్చుకునే అవకాశం దొరికింది. కానీ ఈ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు తెలంగాణలో ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితి ఉండటం వల్ల ఆ ఆశయం నెరవేరుతుందని కచ్చితంగా చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ నుంచి అదనంగా సీట్లు వచ్చే అవకాశం లేనందున, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎదురయ్యే ఓటమి భర్తీ చేసే మార్గం లేదు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ఓటమి బీజేపీని టాంటలస్గా మార్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రేపటి జాతీయ ప్రభు త్వం ఎవరిదో నిర్ణయించే శక్తి ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్ సభస్థానాలకే ఉందని బీజేపీకి, కాంగ్రెస్‌లకు తెలుసు. ముందున్న అవకాశాలు దేశ రాజకీయాలలో ఇకపైనా ఒక శక్తిగా కొనసాగాలనుకుం టే, 2014 ఎన్నికలలో గెలవడం బీజేపీకి చాలా అవసరం. ఓడిపోతే, అధికారంలోకి రాలేని పార్టీల జాబితాలో పడిపో తుంది. చాలా మంది విజేతకే ఓటేయాలని భావిస్తారు. విజేత ఎవరో వరస పరాజయాలను బట్టి ప్రజలు నిర్ణ యించుకుంటారు. బీజేపీ ఇలాంటి ఖాతాలో చేరిపోకూ డదు. మోడీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ఉంటుందా లేదా అనేది ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేల్చే స్తాయి. 2014లో అధికారంలోకి రావడం భారతీయ జనతాపార్టీ లక్ష్యమైతే రాయలసీమ, కోస్తా ప్రజల డిమాం డ్లకు సంపూర్ణ మద్దతు ఇవ్వక తప్పదు. అప్పుడు ఈ ప్రాం తంలోని 25 మంది ఎంపీల సానుభూతి దొరుకుతుంది. బీజేపీకి ఒకటో రెండో స్థానాలు దక్కవచ్చు. ఇతర పార్టీల ఎంపీలే ఢిల్లీలో ఎన్డీఏకి మద్దతునిచ్చేలా ఒత్తిడి తెస్తారు. ఈ ప్రాంతంలోని పదమూడు జిల్లాలో పెల్లుబికిన కాం గ్రెస్ వ్యతిరేకత చూశాక ప్రజలు బీజేపీకి మద్దతునీయ కుండా ఉండటం కష్టం. తెలంగాణ అంశానికి మద్దతుని చ్చినా బీజేపీకి అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం లేదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాదని తెలంగాణకే మద్దతునీయాలని నిర్ణయించడం వల్ల ఆ ప్రాంతంలో బీజేపీకి వచ్చే ప్రయోజనమేమీ లేదు. తెలం గాణ నుంచి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకండా సీమాంధ్ర ప్రజల మనోభావాలను బేఖాతరు చేయడం బీజేపీకి నష్టం కలిగిస్తుంది. సీమాంధ్రులకు మద్దతిస్తే... ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మిఠాయి పొట్లంవలె నోరూరిస్తూ చేతికందేలా ఉంది. దీనిని అందుకోవాలంటే ఒకటే-రాష్ట్ర విభ జనను వ్యతిరేకిస్తూ ఎనభై రోజులుగా ఉద్యమిస్తున్న రాయలసీమ, కోస్తా ప్రజలకు మేం అండగా ఉంటామని చెప్పాలి. సీమాంధ్రుల మనోభావాలను గమనించకుంటే తెలంగాణ ఏర్పాటుకు మద్దతునీయమని ప్రకటన చేయా లి. రేపటి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడకుండా ఇది జరగాలి. ఈ రాష్ట్రాలలో పరాజయం ఎదురయ్యాక విధానాలను మార్చుకునేందుకు బీజేపీకి తగినంత సమ యం ఉండదు. మాకియవెల్లి రాజకీయాల గురించి చెబు తూ ‘అది అసాధ్యాలను సుసాధ్యంచేసే కళ’ అన్నాడు. అందీఅందక ఊరిస్తున్న విజయాన్ని దక్కించుకోవాలనుం టే ఐదువందల ఏళ్ల కిందట మాకియవెల్లి చెప్పిన మాటల మర్మాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే టాంటలస్ తరహా శాపం నుంచి బీజేపీకి విముక్తి. -
'తిరస్కరణ ఓటు' ఉండాల్సిందే: అద్వానీ
ఎన్నికల్లో అభ్యర్థులను తిరస్కరించే అవకాశాన్నిఓటర్లకు కల్పిస్తూ ఈవీఎంలలో తప్పనిసరిగా నెగిటివ్ ఓటు బటన్ ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ స్వాగతించారు. అభ్యర్థులందరూ సచ్ఛీలురుకారని ఓటరు భావిస్తే నెగిటివ్ ఓటు తిరస్కరించే అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓటర్లకిది విలువైన హక్కని అద్వానీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో తొలిసారిగా నెగిటివ్ ఓటు అవకాశాన్ని కల్పించనున్నారు. కాగా పౌరులందరూ తప్పనిసరి ఓటు వేసేలా నిబంధన తీసుకురావాలని అద్వానీ అభిప్రాయపడ్డారు. -
ఎన్నికల్లో కాంగ్రెస్ బదులు సీబీఐ : మోడీ
భోపాల్: యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని వాడుకుంటోందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయంలో కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, లోక్‌సభకు జరిగే తదుపరి సాధారణ ఎన్నికల్లోగానీ కాంగ్రెస్ పోటీ చేయదని, బదులుగా తన తరఫున సీబీఐనే రంగంలోకి దింపుతుందని మోడీ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం బీజేపీ, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, ఇటువంటి సర్కారును తక్షణం కూలదోయాల్సిన అవసరం ఉందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అవినీతినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఆఖరి కోరిక మేరకు కాంగ్రెస్‌ను మూసేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. ఒకే వేదికపై మోడీ, అద్వానీ: బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ బుధవారం ఒకే వేదికపై కనిపించారు. భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వీరు కలిసి పాల్గొన్నారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక, వీరు బహిరంగ వేదికలపై కలసి పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే వారిద్దరి మధ్య సఖ్యత కనిపించలేదు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని అద్వానీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలు కష్టించి పనిచేయడంవల్లే బీజేపీ నేడు ఇంతటి స్థితికి చేరుకుందని, అంతేకాని నాయకుల అనర్గళ ఉపన్యాసాలవల్ల కాదని అద్వానీ ఈ సందర్భంగా అన్నారు. కమిటీలకే కేంద్రం పరిమితం అహ్మదాబాద్: దేశంలోని యువతకు నైపుణ్యాలను పెంచడంలో కేంద్రం విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రానికి ఒక విధానమంటూ లేకుండా పోయిందని అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బుధవారం ఆయన జాతీయ నైపుణ్య అభివృద్ధి సదస్సును ప్రారంభించారు. కేంద్రం ఏ సమస్య వచ్చిన కమిటీలు వేయడం, వాటిని మూసేయడం వరకే పరిమితం అవుతోందని అన్నారు. కేంద్రం సాచివేత ధోరణివల్ల విలువైన సమయం వృథా అయిందని, యువత నైపుణ్యాలను పెంచుకునే అవకాశం కోల్పోయిందని పేర్కొన్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం జాతీయ నైపుణ్య అభివృద్ధి కేంద్రం పేరుతో మంత్రులతో కమిటీని ఏర్పా టు చేసిందని తర్వాత జాతీయ అభివృద్ధి బోర్డును నెలకొల్పిందని, అయితే ఈ రెండూ ఇప్పటివరకు సాధించిందేమీ లేదని అన్నారు. -
మోడీని చూసి గర్వ పడుతున్నాను: అద్వానీ
-
మోడీని చూసి గర్వ పడుతున్నాను: అద్వానీ
2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆపార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేపట్టిన తొలినేత మోడీ అని అద్వానీ అన్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోకసభ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో కీలక పాత్ర మోడీదేనని ప్రశంసించారు. చత్తీస్ గఢ్ లోని కోర్బాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా అద్వానీ మీడియాతో మాట్లాడారు. మోడీతోపాటు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేశాడు అని అన్నాడు. మోడీ సాధించిన విజయాలను చూసి తనకు గర్వంగా ఉంది అని అన్నాడు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతృప్తితో రగిలిపోతున్న అద్వానీ.. మోడీని ప్రశంసించడం ఇదే తొలిసారి. -
హోంశాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా మళ్లీ వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పునర్నియమితులయ్యారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. హోంశాఖ స్థాయీ సంఘానికి వెంకయ్య సారథ్యం వహించడం ఇది వరుసగా అయిదోసారి. 2009-10 నుంచి 2012-13 మధ్య ఆయన నాలుగుసార్లు ఈ బాధ్యతలను నిర్వహించారు. కమిటీలో రాజ్యసభ నుంచి పదిమందికి, లోక్‌సభ నుంచి 21మందికి సభ్యులుగా స్థానం కల్పించారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ సహా పలు పార్టీల ముఖ్యనేతలు సభ్యులుగా గల ఈ కమిటీలో టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్‌కు కూడా ప్రాతినిధ్యం లభించింది. -
కేంద్రం ‘ముందస్తు’కు వెళ్లేలా చూడండి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా సూచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ నేతృత్వంలోని బృందం ప్రణబ్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరింది. దేశంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. దాన్ని అధిగమించే శక్తి ఈ సర్కారుకు లేదని బీజేపీ నేతలు వినతిపత్రంలో వివరించారు. -
నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు!
ప్రస్తుతం దేశంలో తీవ్ర అనిశ్చిత వాతావరణం నెలకొందని భారతీయ జనతపార్టీ అధ్యక్షుడు ఎల్.కే.అద్వానీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో పార్లమెంట్‌కు ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎల్.కే.అద్వానీ ప్రసంగించారు. అసలు అయితే 2014లో పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాలి, కానీ వచ్చే నాలుగు మాసాల్లో ఎప్పుడైన దేశంలో ఎన్నికలు జరగవచ్చు అన్నారు. వాటితోపాటు వివిధ రాష్ట్రాలల శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఆ సమావేశంలో ప్రస్తుత యూపీఏ సర్కార్‌పై అద్వానీ నిప్పులు చెరిగారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ఆర్థికమంత్రి పి. చిదంబరం చెప్పే కారణాలు పలాయనవాదానికి నిదర్శనమని ఎల్.కే.అద్వానీ వ్యంగంగా వ్యాఖ్యానించారు.