
పటేల్‌ను ‘మతతత్వవాది’ అన్న నెహ్రూ!
బ్లాగులో అద్వానీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత మొట్టమొదటి హోం మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు సంబంధించి బీజేపీ మరో వివాదం లేవనెత్తింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. పటేల్‌ను ‘పూర్తి మతతత్వవాది’ అని అన్నారని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తన తాజా బ్లాగ్ పోస్టింగ్‌లో ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకునేందుకు వీలుగా సైన్యాన్ని పంపాలని పటేల్ సూచించిన నేపథ్యంలో నెహ్రూ ఆ విధంగా వ్యాఖ్యానించారని ఎంకేకే నాయర్ రాసిన ఓ పుస్తకాన్ని (ద స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితవుట్ ఇల్ విల్) ఉటంకిస్తూ అద్వానీ పేర్కొన్నారు. హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో నెహ్రూ, పటేల్‌ల మధ్య జరిగిన తీవ్ర వాగ్వివాదం వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
‘దేశ స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌తో కలిసిపోవాలని భావించిన నిజాం ఈ మేరకు పొరుగు దేశానికి రహస్య దూత ఒకర్ని పంపించారు. పెద్దమొత్తంలో డబ్బును కూడా అక్కడి ప్రభుత్వానికి బదలాయించారు. పలువురు నిజాం అధికారులు స్థానిక ప్రజలపై యథేచ్చగా అత్యాచారాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ పటేల్ కేబినెట్ దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లో భయానక పాలనకు తెరదించేందుకు తక్షణమే అక్కడికి సైన్యాన్ని పంపాలని డిమాండ్ చేశారు. సాధారణంగా మృదుభాషి అయిన నెహ్రూ నిగ్రహాన్ని కోల్పోయారు. ‘‘నువ్వో పూర్తి మతతత్వవాదివి. నేనెప్పుడూ నీ సిఫారసును అంగీకరించను..’’ అని అన్నారు. పటేల్ మరో మాట మాట్లాడకుండా తన కాగితాలు తీసుకుని వెళ్లిపోయారు..’ అని అద్వానీ తెలిపారు. పటేల్‌ను హిందూత్వ భావాలు కలిగిన వ్యక్తిగా తెరపైకి తెచ్చేందుకు ఇటీవల కొంతకాలంగా బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌కు సైన్యాన్ని పంపేలా అప్పటి గవర్నర్ జనరల్ రాజాజీ నెహ్రూను ఒప్పించారని అద్వానీ పేర్కొన్నారు.
‘హైదరాబాద్‌లో పరిస్థితి అంతకంతకూ విషమిస్తుండటంతో నెహ్రూ, పటేల్ ఇద్దరినీ రాజాజీ రాష్ట్రపతి భవన్‌కు పిలిపించారు. అప్పటికి రెండ్రోజుల ముందు రజాకార్లు ఓ కాన్వెంట్‌కు చెందిన 70 ఏళ్ల నన్‌లపై అత్యాచారానికి తెగబడటాన్ని నిరసిస్తూ బ్రిటిష్ హైకమిషనర్ రాసిన ఓ లేఖను సిద్ధంగా ఉంచుకున్నారు. పటేల్ సన్నిహిత అధికారి వి.పి.మీనన్ ఆ లేఖను కేబినెట్ భేటీకి ముందు రాజాజీకి అందజేశారు. భేటీలో రాజాజీ తనదైన శైలిలో హైదరాబాద్‌లో పరిస్థితిని వర్ణించి చెప్పారు. అయితే నెహ్రూ అంతర్జాతీయంగా ఉత్పన్నమయ్యే ఇబ్బందుల దృష్ట్యా తటపటాయించారు. ఆ సమయంలో రాజాజీ తురుపు ముక్క (లేఖ)ను బయటకు తీశారు. ఆ లేఖను చదివిన నెహ్రూ ముఖం ఎర్రబడింది. కుర్చీలోంచి వేగంగా లేచి పిడికిలి బిగించి బల్లపై కొట్టారు. ‘‘ఇంకో క్షణం కూడా వృధా చేయడానికి వీల్లేదు. వారికి గుణపాఠం చెబుతాం..’’ అని అన్నారు. ఆ వెంటనే రాజాజీ పథకం మేరకు ముందుకువెళ్లాల్సిందిగా కమాండర్ ఇన్ చీఫ్‌కు చెప్పాలని మీనన్‌ను ఆదేశించారు..’ అని నాయర్ పుస్తకాన్ని ఉటంకిస్తూ అద్వానీ తెలిపారు.