
స్కాంలలో ప్రధానికీ బాధ్యత: అద్వానీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పాలన పదేళ్ల కాలం స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అధ్వానమైన అధ్యాయమని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ధ్వజమెత్తారు. కామన్వెల్త్ క్రీడల నుంచి కోల్‌గేట్ (బొగ్గు కేటాయింపులు) వరకు వరుసగా కుంభకోణాలు వెల్లువెత్తాయన్నారు. వాటి బాధ్యత నుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను మినహాయించలేమని వ్యాఖ్యానించారు. అయితే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆదేశాలు, అనుమతి లేకుండా ప్రధాని ఏ పనీ చేయబోరన్నారు. ఈ నేపథ్యంలో బొగ్గు కేటాయింపుల సహా అన్ని కుంభకోణాల్లోనూ సోనియా కూడా దోషేనని దుయ్యబట్టారు.
ఈ కుంభకోణాలన్నింటి బాధ్యతను యూపీఏ మిత్రపక్షాలపైకి నెట్టేయలేరన్నారు. ఆదివారం ఢిల్లీలో అద్వానీ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ మిత్రపక్షాలు ఉన్నాయని, బీజేపీ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని ప్రస్తావించారు. వాజ్‌పేయిపై కానీ, మరే బీజేపీ మంత్రిపై కానీ ఎలాంటి కేసులు నమోదుకాలేదని పేర్కొన్నారు. ఒక ఆర్థికవేత్త ప్రధానమంత్రిగా ఉన్న ఈ పదేళ్ల కాలంలో ఆర్థికవ్యవస్థ దారితప్పినట్లుగా గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.