నీరవ్‌తో రాహుల్, సింఘ్వీలకు సంబంధాలు! | Congress holds BJP responsible for Nirav Modi fraud case | Sakshi
Sakshi News home page

‘నీరవ్‌’ పాపం మీదే!

Published Sun, Feb 18 2018 1:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress holds BJP responsible for Nirav Modi fraud case - Sakshi

ముంబైలో పీఎన్‌బీ మాజీ అధికారి గోకుల్‌నాథ్‌ శెట్టిని కోర్టుకు తీసుకొస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ/ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన నీరవ్‌ మోదీ అండ్‌ కో విదేశాలకు చెక్కేయగా.. మరోవైపు ఈ పాపానికి బాధ్యులు మీరంటే మీరంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర విమర్శల్లో మునిగితేలాయి. ఈ కుంభకోణం యూపీఏ హయాంలోనే జరిగిందని, అయితే ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపించగా.. దేశానికి కాపలాదారుగా ఉన్న మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదను దోచుకుని దొంగలు పరారవుతున్నారని కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధించింది. మరోవైపు శనివారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) దేశ వ్యాప్తంగా సోదాలు కొనసాగించి రూ. 25 కోట్ల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,674 కోట్ల ఆస్తులు సీజ్‌ చేశామని ఈడీ తెలిపింది.

నీరవ్‌ను పట్టుకుని తీరుతాం: సీతారామన్‌
నీరవ్‌ మోదీ కేసులో కాంగ్రెస్‌ ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను శనివారం బీజేపీ రంగంలోకి దింపింది. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు ఎన్డీయే హయాంలో బయటకొస్తుంటే.. మోదీ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నీరవ్‌ మోదీ దేశం వదిలి పారిపోవచ్చు. అయితే అతనిపై ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది. నీరవ్‌ను పట్టుకుని తీరుతాం’ అని పేర్కొన్నారు. అసలు పాపమంతా కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమై.. రెట్టింపుగా విస్తరించిందని సీతారామన్‌ ఆరోపించారు. మోసగాళ్లు దేశం వదిలి పారిపోయేందుకు కుట్ర చేయకుండా.. వారిని పట్టుకుంటున్నామని చెప్పారు.

ఎన్డీఏ హయాంలో ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి పారిపోతున్నారు కదా! అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పారిపోయారు అంటే వారిని మేం పట్టుకోబోమని అర్థం కాదు. వారిపై చర్యలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. తప్పకుండా పట్టుకుని తీరుతాం’ అని చెప్పారు. నీరవ్‌ మోదీ నిర్వహించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారని సీతారామన్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ భార్య డైరెక్టర్‌గా ఉన్న అద్వైత్‌ హోల్డింగ్స్‌కు చెందిన ఆస్తిని.. నీరవ్‌ నడుపుతున్న ‘ఫైర్‌ స్టార్‌ డైమండ్‌ ఇంటర్నేషనల్‌’ లీజుకు తీసుకుందని ఆమె తెలిపారు. గీతాంజలి జెమ్స్‌ ఆర్థిక వ్యవహారాలపై 2013లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన అలహాబాద్‌ బ్యాంకు ప్రభుత్వ డైరెక్టర్‌ను రాజీనామా చేయాలని కోరారని, అతని అభ్యంతరాల్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.  

2017లోనే కుంభకోణం: కపిల్‌ సిబల్‌  
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో కుంభకోణానికి బీజేపీదే బాధ్యతని, ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవస్థీకృతం చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ప్రధాని, ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దాదాపు నాశనం చేశారని, మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదతో దొంగలు పారిపోతున్నారని విమర్శించారు.

సీబీఐ రెండో ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడికి జారీ చేసిన అన్ని ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌(ఎల్‌వోయూ)’లపై 2017లోనే సంతకం చేసినట్లు ఉందని, కుంభకోణాన్ని అడ్డుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీరవ్, చోక్సీలతో తమ కుటుంబానికి సంబంధాలపై బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ తోసిపుచ్చారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న అద్వైత్‌ హోల్డింగ్స్‌కి చెందిన కమలా మిల్స్‌ను నీరవ్‌ కంపెనీ లీజుకు తీసుకుందని ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీతారామన్, ఆమె సహచరులపై సివిల్, క్రిమినల్‌ పరువు నష్టం దావా వేస్తానని సింఘ్వీ హెచ్చరించారు.

‘అంతా నోట్ల రద్దు వల్లే’
ప్రధానిపై రాహుల్‌ ఆరోపణలు కొనసాగించారు. ‘నీరవ్‌ కేసులో ఏం జరిగిందో ప్రధాని చెప్పాలి. ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి’ అని రాహుల్‌ అన్నారు. నీరవ్‌తో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయన్న బీజేపీ ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు.  ‘నోట్ల రద్దుతో ఇదంతా మొదలైంది. ప్రజాధనాన్ని సేకరించి మోదీ బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెట్టారు. నీరవ్‌ రూ. 20 వేల కోట్ల ప్రజాధనంతో దేశం నుంచి పరారయ్యారు’ అని విమర్శించారు.  

21చోట్ల సోదాలు
శనివారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ. 25 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) అధికారుల్ని సీబీఐ అరెస్టు చేసింది. రిటైర్డ్‌ డిప్యూటీ మేనేజరు గోకుల్‌ నాథ్‌ శెట్టి, సింగిల్‌ విండో ఆపరేటర్‌ మనోజ్‌ ఖారత్‌తో పాటు నీరవ్‌ తరఫున హామీదారుగా ఉన్న హేమంత్‌ భట్‌ను అదుపులోకి తీసుకుంది.

వీరిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో మరింత మంది పీఎన్‌బీ అధికారుల ప్రమేయం ఉండవచ్చని సీబీఐ కోర్టుకు తెలిపింది. రూ. 280 కోట్ల మోసం జరిగిందని, ఇది రూ. 6 వేల కోట్ల వరకూ ఉండవచ్చని రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ శనివారం గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ, ఇతరులకు చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని అటాచ్‌ చేసింది.  

‘పీఎంఓతో కలిసి పనిచేస్తున్నాం’
ఈ కుంభకోణాన్ని పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంతో కలిసి పనిచేస్తున్నామని ఆర్థిక శాఖ తెలిపింది. పీఎంఓ ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఆర్థిక శాఖ అమలు చేస్తుంది’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శుక్లా తెలిపారు. పీఎన్‌బీ కేసులో తమ బ్యాంకు వాటా రూ. 2,636 కోట్లు ఉందని యూకో బ్యాంకు తెలిపింది. పీఎన్‌బీ జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ల ఆధారంగా హాంకాంగ్‌ బ్రాంచీ ఆ మేర రుణాలిచ్చిందని స్టాక్‌ ఎక్సే్ఛంజీకి తెలిపింది.

నీరవ్‌కు ద్వంద్వ పౌరసత్వం!
నీరవ్‌ మోదీ పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసినా.. అతనికి ద్వంద్వ పౌరసత్వాలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నీరవ్, అతని సోదరుడు నిశాల్‌లు బెల్జియంలో పుట్టి పెరిగారు. నిఘా వర్గాల కథనం మేరకు నీరవ్‌ భారతదేశ పాస్‌పోర్టును వదులుకుని బెల్జియం పాస్‌పోర్టును సంపాదించినట్లు తెలుస్తోంది. నీరవ్‌ మాత్రం తాను భారతీయ పౌరుడినేనని గతంలో పేర్కొన్నాడు. గుజరాత్‌కు చెందిన అతను ఫైర్‌స్టార్‌ డైమండ్‌ పేరిట ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రఖ్యాత వార్టన్‌ బిజినెస్‌ స్కూలులో చేరి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు.  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ 2015లో న్యూయార్క్‌లో నీరవ్‌ స్టోర్‌ను ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement