కోల్‌కతా: పీఎన్‌బీ, రొటోమ్యాక్ కుంభకోణాలపై చర్చ జరుగుతుండగానే కోల్‌కతాలో మరో బ్యాంకు అవినీతి బట్టబయలైంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకి గతంలో సన్నిహితంగా ఉన్న ఓ వ్యాపారవేత్తకు చెందిన ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ కారణంగా కెనరా బ్యాంకుతోపాటు మరో తొమ్మిది బ్యాంకులకు రూ.515 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. సంస్థ కార్యాలయం సహా ఆరుచోట్ల బుధవారం సోదాలు నిర్వహించింది.
ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్ డైరెక్టర్‌లైన శివాజీ పంజా, కౌస్తవ్ చటర్జీ, వినయ్ బాఫ్నా, ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ దేవ్‌నాత్ పాల్ సహా.. పలువురు బ్యాంకు అధికారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. 2012–13లో రూ.515 కోట్ల మోసం జరిగిందంటూ కెనరాతోపాటు తొమ్మిది బ్యాంకుల కన్సార్షియం సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ.. బాధ్యులపై మోసం, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, అధికారులతో అమర్యాదకరంగా వ్యవహరించారంటూ కేసు నమోదు చేసింది. ఇందులో శివాజీ పంజా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడు.
2015లోనే వెలుగులోకి తొలి మోసం
ఈ సంస్థ ‘చిరాగ్’ పేరుతో దేశవ్యాప్తంగా డెస్క్‌టాప్స్, ల్యాప్‌టాప్స్ తయారీ, వ్యాపారం, కంప్యూటర్ల సర్వీసింగ్, నెట్‌వర్కింగ్ ఇంటిగ్రేషన్‌తోపాటుగా హార్డ్‌వేర్ ఉత్పత్తులను అమ్మేది. బ్యాంకుల కన్సార్షియానికి తప్పుడు డాక్యుమెంట్లను ఇచ్చి రుణాలు పొందిన ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్.. ఆ తర్వాత రుణాలు చెల్లించటంలో విఫలమైంది. దీంతో సరైన రుణాలు చెల్లించక ఎన్‌పీఏ ముద్రవేసుకుంది. 2015లోనే ఐడీబీఐ బ్యాంకును రూ. 180 కోట్లకు మోసం చేసిన కేసులో సీబీఐ ఈ సంస్థపై కేసు నమోదు చేసింది. ఫిర్యాదు చేసిన బ్యాంకుల కన్సార్షియంలో ఎస్‌బీఐ, ఎస్‌బీఐలో విలీనం అయిన రెండు బ్యాంకులు, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లున్నాయి.
విచారణకు రాను: నీరవ్
పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు నీరవ్ మోదీ నిరాకరించారు. వ్యాపార కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు. ఏ దేశంలో ఉన్నా అక్కడున్న భారత దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని.. అక్కడి అధికారులే భారత్ వచ్చేందుకు వాళ్లు ఏర్పాటుచేస్తారని నీరవ్ మోదీకి రాసిన లేఖలో పేర్కొంది. కేసులో దోషిగా ఉన్నవారెవరైనా పిలిచినప్పుడు విచారణకు రావాల్సిందేనని హెచ్చరించింది. వచ్చేవారం కేసు విచారణకు హాజరవ్వాలని తెలిపింది. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా పీఎన్‌బీ ఇంటర్నల్ చీఫ్ ఆడిటర్ ఎంకే శర్మను సీబీఐ అరెస్టు చేసింది. కుంభకోణానికి కేంద్రమైన పీఎన్‌బీ బ్రాడీహౌజ్ శాఖలో ఆడిటింగ్ వ్యవహారాలకు ఈయనే బాధ్యుడు.
Comments
Please login to add a commentAdd a comment