
ముంబై: నీరవ్ మోదీ కుంభకోణం నష్టాల నుంచి తమ బ్యాంకు సత్వరం కోలుకోగలదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో సునీల్ మెహతా ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా మొండిబాకీల రికవరీపై దృష్టి పెట్టడం ద్వారా ఆరు నెలల్లో ఇది సాధించగలమని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రస్తుతం పీఎన్‌బీలో మొండిబాకీలు రూ. 57,000 కోట్ల మేర పేరుకుపోయాయి. ఎన్‌పీఏలు తమకు బంగారుగనిలాంటివని, వీటిని రాబట్టుకోవడం ద్వారా లాభదాయకతను మెరుగుపర్చుకుంటామని మెహతా చెప్పారు.
గడిచిన మూడు త్రైమాసికాల్లో క్విప్ మార్గంలో రూ. 5,000 కోట్లు, ప్రధానయేతర అసెట్స్ విక్రయం ద్వారా రూ. 1,300 కోట్లు, అదనపు మూలధనం రూపంలో రూ. 5,473 కోట్లు సమకూర్చుకున్నామని ఆయన తెలిపారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) ఉన్న మొండిబాకీల కేసులకు సంబంధించి ప్రొవిజనింగ్‌ను ఆర్‌బీఐ 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించడంతో తమకు పది శాతం మేర ప్రయోజనం చేకూరనుందని మెహతా వివరించారు.