ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా సూచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా సూచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ నేతృత్వంలోని బృందం ప్రణబ్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరింది. దేశంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. దాన్ని అధిగమించే శక్తి ఈ సర్కారుకు లేదని బీజేపీ నేతలు వినతిపత్రంలో వివరించారు.