సాక్షి, న్యూఢిల్లీ : పోక్సో చట్టం కింద కేసుల విచారణపై పర్యవేక్షణ, నియంత్రణ కోసం న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీలు నియమించాలని సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం అన్ని రాష్ట్రాల హైకోర్టులను కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ డీజీపీలనూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేసుల విచారణ వేగవంతానికి, సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని పేర్కొంది.
దేశవ్యాప్తంగా లక్షకు పైగా పోక్సో కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యూపీలో అత్యధికంగా 30,883 ఈ తరహాకేసులు పెండింగ్‌లో ఉండగా, మహారాష్ట్ర, గోవాల్లో 16,099 కేసులు, మధ్యప్రదేశ్‌లో 10,117 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 9894 కేసులు, ఒడిషాలో 6,849 కేసులు, ఢిల్లీలో 6100 కేసులు, బిహార్‌లో 4910 కేసులు, కర్ణాటకలో 4045 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు మరణ దండన విధిస్తూ ప్రభుత్వం చట్ట సవరణను చేపట్టిందని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment