నమోదైన 24 గంటల్లో వెబ్‌సైట్‌లోకి ఎఫ్‌ఐఆర్
రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 24 గంటలలోపు వాటిని అధికారిక వెబ్‌సైట్లలో ఉంచాలని సుప్రీం కోర్టు బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. పోలీసు శాఖ వెబ్‌సైట్లకు ఎఫ్‌ఐఆర్‌లు అప్‌లోడ్ చేయాలని, ఏ రాష్ట్రంలోనైనా పోలీసు శాఖకు ప్రత్యేక వెబ్‌సైట్ లేకపోతే, ఆ రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌ను వాడుకోవాలని సూచించిం ది. నవంబరు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని తన తీర్పులో ఆదేశించింది. అయితే తిరుగుబాట్లు, ఉగ్రవాదం, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద నమోదు చేసిన వాటితో సహా అన్ని లైంగిక నేరాల ఎఫ్‌ఐఆర్ వెబ్‌సైట్లలో ఉంచడం నుంచి మినహాయించారు.
ఏ ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్లో ఉంచాలో, దేన్ని ఉంచకూడదో నిర్ణయించేందుకు పోలీసు అధికారికి కనీసం డీఎస్పీ స్థాయి హోదా ఉండాలి. ఈ చర్య ద్వారా కేసులతో సంబంధమున్న వ్యక్తులు ఎఫ్‌ఐఆర్‌లను డౌన్‌లోడ్ చేసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం కోర్టుల్లో దరఖాస్తు చేయగలరని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లను వెబ్‌సైట్లో ఉంచాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశమంతా అమలు చేయాలని ‘యూత్ లాయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సుప్రీంలో పిటిషన్ వేయగా కొన్ని మార్పులతో కోర్టు సమ్మతించింది. ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్లలో ఉంచితే నేరస్తులు పోలీసులతో లాలూచీపడి కోర్టులో లబ్ధిపొందే అవకాశం ఉందని కేంద్రం ఆందోళ న వ్యక్తం చేయడంతో కోర్టు కొన్ని మినహాయింపులు ఇచ్చింది.