సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంతో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. 1970లలో హరియాణా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం... అంచెలంచెలుగా ఎదిగి విదేశాంగ మంత్రి స్థాయికి చేరుకున్నారు. దేశ రాజధానికి ఢిల్లీకి స్వాతంత్ర్య భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. 1998 అక్టోబర్ 13న ఆమె ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. 52 రోజులు మాత్రమే కొనసాగినా.. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన ముద్రవేశారు.
దీంతో 800 ఏళ్ల నాటి ఢిల్లీ సుల్తానుల రికార్డును ఆమె శాస్వతంగా తుడిచేశారు. ఢిల్లీ సుల్తానుల పాలకురాలు రజియా సుల్తానా 1236 అక్టోబర్ 14 నుంచి 1240 వరకు హస్తినను పాలించారు. ఆమె తరువాత ఢిల్లీని పాలించిన మహిళగా సుష్మా చరిత్రలో నిలిచిపోయారు. 1998 ఎన్నికల్లో ఆమె ఓటమి చెందినప్పటికీ మరో మహిళా సీఎంగా షీలా దీక్షిత్ ఆ పదవిని అధిష్టించారు. కాగా ఇప్పటి వరకు రాజధాని ప్రాంతానికి మహిళా ముఖ్యమంత్రులుగా సేవలందించింది వీరిద్దరు మాత్రమే. ఇదిలావుండగా షీలా, సుష్మా ఇద్దరూ 15 రోజుల వ్యవధిలోనే మృతిచెంది భారతావనిని శోకసంద్రంలో ముంచారు. 1970లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుష్మా ఇప్పటి వరకు అనేక అత్యున్నత పదవుల బాధ్యతలను స్వీకరించి వాటిని వన్నెతెచ్చారు. మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆమె.. ఇటివల ముగిసిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment