
గ‘మ్మత్తు’గా చిత్తు..!
మొదటిసారి మత్తుపదార్థాన్ని తీసుకున్నప్పుడు గ‘మ్మత్తు’గా అనిపిస్తుంది. ఆనందలోకాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇంకోసారీ అంతులేని ఆనందాన్ని పొందాలన్న భావనను రేకెత్తిస్తుంది.
మొదటిసారి మత్తుపదార్థాన్ని తీసుకున్నప్పుడు గ‘మ్మత్తు’గా అనిపిస్తుంది. ఆనందలోకాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇంకోసారీ అంతులేని ఆనందాన్ని పొందాలన్న భావనను రేకెత్తిస్తుంది. లొంగిపోయారో.. ఇక అంతే సంగతులు’’ అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు షౌకీన్. ఒక్కసారి మత్తు పదార్థాన్ని తీసుకుంటే ఏమీ కాదని చాలా మంది భావిస్తారని, అయితే అది తనకు బానిసను చేసుకుంటుందని, జీవితాన్ని చిత్తు చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ముంబై: సాధారణంగా సరదాలు, జల్సాలు, స్నేహాల వల్ల తాగుడు, మత్తు పదార్థాలు అలవాటు అవుతాయి. కొందరికి వంశపారంపర్యంగానూ వ్యసనాలు అబ్బుతుంటాయి. మత్తుపదార్థాలు తమను ఏం చేయవన్న భ్రమలో వారుంటారు. గుట్కా, గుల్‌ఫారం వంటివాటితో నష్టమేమిటని ప్రశ్నిస్తారు. అవి ప్రాణాంతకాలని చెప్పినా నమ్మరు. తీసుకున్న మత్తు పదార్థం ఏదైనా సరే.. అది ఒంట్లోని సత్తువను తగ్గిస్తుందన్న సత్యాన్ని గమనించరు. ప్రజలు పొరపాటునో.. గ్రహపాటునో అనేక రకాల మత్తుపదార్థాలకు అలవాటుపడుతున్నారు. వాటికి బానిసలవుతున్నారు. ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాకుండా వ్యక్తిగత, కుటుంబ ప్రతిష్టనూ మసకబారుస్తాయి. ఆర్థిక స్థితిగతులపైనా ప్రభావం చూపుతాయి.
ఆటుపోట్లకు కుంగి..
ప్రపంచీకరణతో మానవ జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. నిత్యజీవితంలో వేగం పెరిగింది. ఫలితంగా మానవ సమాజం విపరీతమైన ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. కొందరు మానసిక ఒత్తిళ్లు, భయం, ఆందోళనలకు గురవుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నవారిలో అధిక శాతం ఏదో ఒక వ్యసనానికి బానిస అవుతున్నారు. ‘‘వ్యక్తులకు సమస్యలు తలెత్తినపుడు వ్యాకులత ప్రారంభమౌతుంది. దీని వల్ల నిరుత్సాహం, నిద్రలేమి వెంటాడుతాయి. ఆ దశలో మానసిక ప్రశాంతత కోసం మత్తు పదార్థాలు, ఉత్ప్రేరకాలపై ఆధారపడంఅలవాటు చేసుకుంటారు’’ అని డాక్టర్ కేశవులు పేర్కొంటున్నారు.
సమస్య దూరమవుతుందని భ్రమపడి..
తొలిసారిగా మత్తుపదార్థాలను తీసుకున్నపుడు ఏదో తెలియని అనుభూతి ఆవహిస్తుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది. మత్తు వల్ల ఒత్తిళ్లు, బాధలు, సమస్యలు దూరమైన భావన కలుగుతుంది. అయితే ఆ మత్తు దిగిపోయాక మళ్లీ అవే సమస్యలు బాధపెడుతుంటాయి. వాటిని మరచిపోవడానికి నిన్నటి అనుభూతిని కోరుకుంటుంది మనసు. ఇలా క్రమంగా మత్తుపదార్థాలకు అలవాటుపడతారు. కుటుంబ సభ్యులు, హితులు వద్దని వారించినా వినిపించుకోరు. ఆ వ్యసనం లేనిదే బతకలేమన్న దుస్థితికి దిగజారిపోతారు. ఆ మత్తు అందకపోతే శరీరం, నాడీ వ్యవస్థ అదుపుతప్పుతుంది. వ్యసనా న్ని వీడేందుకు ప్రయత్నించినా విఫలమవుతారు.
బలహీనతలే మూలకారణం
తమలో లేని శక్తిని మత్తుపదార్థాల ద్వారా పొందాలనుకునే బలహీనులే ఎక్కువగా వ్యసనాలకు బలవుతున్నారు. అయితే చాలా మంది చెడు స్నేహాల వల్ల వ్యసనాల పాలవుతున్నారు. కారణమేదైనా యవ్వనంలోనే ఎక్కువమంది దారి తప్పుతున్నారు. మత్తుపదార్థాలకు అలవాటుపడుతున్నారు. చాలా సందర్భాల్లో పిల్లలు దారి తప్పుతున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేరు. ఒకవేళ ఎవరైనా గుర్తించి, వారి దృష్టికి తీసుకెళ్లినా.. ఏదో తెలియనితనం అంటూ నిర్లక్ష్యం చేస్తారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలను మందలించడానికి కూడా వెనకాడుతారు.
సమస్యలు ఇవి..
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బానిసల్లో నాడీ రుగ్మతలు తలెత్తుతాయి. కొందరు భ్రమలు, భ్రాంతులకు గురవుతారు. వ్యసనం, డిప్రెషన్ తీవ్రత పెరిగిన వారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న కోరికలూ చెలరేగుతాయి. కేన్సర్ వంటి వ్యాధులూ వస్తాయి. మత్తుపదార్థాలు స్వీకరించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మాన్పించే మార్గాలు
వ్యసనపరులను మామూలు స్థితికి తీసుకురావొచ్చు. మామూలు స్థాయి వ్యసనపరులకు మాటలతో కౌన్సెలింగ్ సరిపోతుంది. కానీ తీవ్ర వ్యసనపరులకు కౌన్సెలింగ్ రుచించదు. వారిని మామూలు స్థితికి తీసుకురావటానికి ట్రీట్‌మెంట్ అవసరం అవుతుంది. హఠాత్తుగా వ్యసనాలను విడిచిపెట్టినా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మత్తుకు అలవాటు పడిన శరీరం, నాడీ వ్యవస్థ అదిలేనిదే తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. అందుకే వైద్యుల సూచనలు పాటిస్తూ క్రమంగా వ్యసనానికి దూరం కావాలి. మనోశక్తిని పెంపొందించడానికి యోగ, వ్యాయామాలు, ధ్యానం, సత్సాంగత్యం వంటివి దోహదపడతాయి.