‘నేను పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో.. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టా.. నాలుగు సినిమాలు చేశా.. ప్రస్తుతం నా హిందీ బాగా మెరుగుపడింది.
న్యూఢిల్లీ: ‘నేను పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో.. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టా.. నాలుగు సినిమాలు చేశా.. ప్రస్తుతం నా హిందీ బాగా మెరుగుపడింది. దీని క్రెడిట్ అంతా అక్షయ్‌కే దక్కుతుంది..’ అని ప్రముఖ మోడల్, నటి లిసా హైడన్ ముద్దుగా హిందీలో చెప్పింది. త్వరలో విడుదల కాబోతున్న ‘షౌకీన్’లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది 1982లో విడుదలైన సూపర్‌హిట్ రొమేంటిక్ కామెడీ సినిమా ‘షౌకీన్’కు రీమేక్. ఇందులో సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌తోపాటు, పరేష్ రావల్, అనుపమ్ ఖేర్, అన్నూకపూర్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగేలా అక్షయ్ సాయం చేశాడని లిసా పేర్కొంది. ‘అక్షయ్ హిందీ చాలా బాగుంటుంది.. అతడు చాలా ఎనర్జిటిక్ యాక్టర్.. ఎప్పుడూ నవ్వుతూ, పక్కవాళ్లను నవ్వి స్తూ ఉంటాడు.. నాతో అతడు ఎప్పుడూ హిందీలోనే మాట్లాడేవాడు.. దాంతో నాకు ఆ భాషపై త్వరగానే పట్టు దొరికింది..’ అని లిసా నవ్వుతూ చెప్పింది. ‘షౌకీన్’లో రతీ అగ్నిహోత్రి పోషించిన పాత్రను ప్రస్తుతం రీమేక్‌లో లిసా పోషిస్తోంది.
ఈ పాత్రకు మొదట నర్గిస్ ఫక్రిని తీసుకోవాలని అనుకున్నారు.. అయితే అప్పటికే ఆమె హాలీవుడ్ సినిమా ‘స్పై’కి ఒప్పందం చేసుకుని ఉండటంతో డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో ‘షౌకీన్’ అవకాశం లిసాను వరించింది. అయితే ఇవేమీ తనకు పట్టవని ఆమె చెప్పింది. ‘నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే నా డ్యూటీ. అంతే తప్ప దాని ముందు వెనుక కథలను పట్టించుకోన’ని లిసా స్పష్టం చేసింది. కాగా, ఇంతకుముందు తాను నటించిన ‘క్వీన్’ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని, ప్రస్తుతం అందరూ తనను గుర్తు పడుతున్నారని లిసా ఆనందం వ్యక్తం చేసింది.