సెన్సార్ బోర్డుకు ఆ 'సినిమా' తిప్పలు!
చెన్నై: ఓ బాలిక(13) సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)కు పరీక్ష పెట్టింది. కొన్ని నెలల కిందట ఇంటి నుంచి పారిపోయిన బాలికను పోలీసులు గతవారం గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక పేరెంట్స్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ ప్రకారం కోర్టులో బాలికను పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాలిక చెప్పిన విషయాలు విని న్యాయమూర్తులు, పోలీసులు, బాలిక తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.
తాను తమిళ చిత్రం కళవని మూవీ చూసి ప్రభావితురాలినయ్యానని కోర్టుకు బాలిక విన్నవించింది. ఆ మూవీ ఎఫెక్ట్ వల్లనే ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు మైనర్ చెప్పింది. ప్రస్తుతం ఆ బాలిక గర్భవతి. అయితే ఆ మూవీకి సీబీఎఫ్‌సీ కేవలం యూ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని చెన్నై కోర్టు తప్పుపట్టింది.
2010లో సీబీఎఫ్‌సీ కళవని మూవీకి యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించి సీబీఎఫ్‌సీ అధికారికి చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సినిమాకు ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారు, యూ సర్టిఫికేట్ ఎలా డిసైడ్ చేశారు.. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎందుకు ఎంకరేజ్ చేశారని కోర్టు ప్రశ్నించింది. నిర్మాత సహా మూవీకి పనిచేసిన కీలక వ్యక్తుల నుంచి వివరణ తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు గడువిచ్చింది.